– వక్ఫ్‌బోర్డు సిబ్బందికి శిక్షణ
– బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అసదుల్లా చొరవ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అసదుల్లా ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదుకు సంబంధించి వక్ఫ్‌బోర్డు సిబ్బందికి ఉమీద్ నిబంధనలు 2025 ప్రకారం మేకర్స్, చెకర్స్గా నియమితులైన అన్ని జిల్లాల ఇన్‌స్పెక్టర్ ఆడిటర్స్‌కు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వక్ఫ్ ఆస్తుల సమాచారాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంలో ఉన్న క్లిష్టమైన అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ముతవల్లీలు, ఇతర భాగస్వాములకు శిక్షణ ఇవ్వడం, వారికి సహాయం అందించడంపై దృష్టి సారించారు. ఫలితంగా చాలా తక్కువ సమయంలో జిల్లాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సజ్జాదానషీన్ ముతవల్లీలు, ఖిద్మత్ గుజారాన్ ఆఫ్ వక్ఫ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అసోసియేషన్‌తో తరచుగా అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించారు. జమాతే ఇస్లామీ సభ్యులతో కూడా సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో భారీ సంఖ్యలో భాగస్వాములు హాజరై వారి సందేహాలు, ప్రశ్నలు నివృత్తి చేసుకునేందుకు ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించారు. ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదు ప్రాముఖ్యత, విధానం గురించి తెలియజేయడానికి జిల్లా స్థాయిలో వివిధ ధార్మిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు వక్ఫ్ బోర్డు సహకారాన్ని, మద్దతును అందిస్తుందని తెలిపారు. వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యాలయ సిబ్బందితోపాటు జిల్లా సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇచ్చారు. ఉమీద్ పోర్టల్ అవసరాలకునుగుణంగా గెజిట్, సర్వే ఫారాలు వంటి వక్ఫ్ రికార్డులను డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితంగా చాలా తక్కువ సమయంలో 900 చెకర్స్‌ను ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేయగలిగారు. ఇప్పుడు తెలంగాణ వక్ఫ్ బోర్డు దేశంలో మూడవ స్థానంలో ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





