కాంగ్రెస్‌ చేతగానితనానికి యూరియా యాప్‌ నిదర్శనం

– పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న సర్కార్‌
– కనీస ప్రణాళికా జ్ఞానం లేనందునే యూరియా కష్టాలు
– రేవంత్‌ సర్కారుపై కేటీఆర్‌ నిప్పులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్‌ అప్లికేషన్‌ విధానం రైతు వ్యతిరేక విధానాన్ని స్పష్టం చేస్తోందని, యూరియా యాప్‌ నాటకం – లైన్లను దాచే కుట్ర అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయంటూ అసలు సమస్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు ఏనాడూ క్య్లూలో నిలబడాల్సిన పరిస్థితి రాలేదన్నారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని, అవసరమైన మేర యూరియా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని మండిపడ్డారు. రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కనబెట్టిందని కేటీఆర్‌ విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్‌ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసిందన్నారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందన్నారు. కేసీఆర్‌కి రైతులపై ఉన్నట్లు ప్రేమ ఉంటే రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావన్నారు.

ప్రజల సొమ్ముకు మ‌నం ధ‌ర్మ‌క‌ర్తలం మాత్రమే

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరని, గ్రామాల్లో సర్పంచులే అసలైన కథానాయకులని కేటీఆర్‌ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా సర్పంచులకే చెల్లుతాయని స్పష్టం చేశారు. ఇందులో ఏ ఎమ్మెల్యే లేదా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. మనం కేవలం ప్రజా ధనానికి ధర్మకర్తలుగా ఉండి, ప్రజల అవసరాలకనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో పల్లెలే పట్టుకొమ్మలనే నినాదంతో గ్రామాలను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి నెలా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేశామని, దీనివల్ల 30 శాతం పల్లెలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ గ్రామ పంచాయతీ తీర్మానమే కీలకమని, సర్పంచుల సంతకం లేకుండా ఏదీ సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే రూ.2.5లక్షల కోట్ల అప్పు చేసినా కనీసం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే నిధులు లేక ఇబ్బందిపడుతున్నారని, ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, 67మంది సర్పంచులు గెలవడం శుభపరిణామమని కేటీఆర్‌ అన్నారు. రాబోయే రెండేళ్లు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఉన్నా ప్రజల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అప్పులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, కర్నె ప్రభాకర్‌, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page