నేటి సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా నిలవాలి!

దశాబ్దాల తరబడి దక్షిణ భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నది. నట సామ్రాట్‌ ఎన్టీ రామారావు తాను రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు హితం కోరి సామాజిక, సాంఘిక, ఆర్థిక అసమానతలను కండ్లకు కట్టినట్టు చూపించే సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించి అనేక వందల పాత్రలలో ప్రజలకు ఒక ఆరాధ్యునిగా కనిపించేవారు. ఏఎన్‌ఆర్‌ కూడా ఇదే కోవలో అనేక చిత్రాలలో నటించి ఆదర్శ వంతమైన జీవితాలు గడిపి మొత్తం దేశంలోని కీర్తి యశస్సులు సంపాదించి ప్రస్తుత తరానికి కూడా ఆదర్శప్రాయులుగా నిలిచారు.    దివిసీమ ఉప్పెన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి విరాళాలు పోగుచేసి బాధిత ప్రజలకు అండగా నిలిచారు. మహానటి సావిత్రి, జమున, వాణిశ్రీ ఇంకా అనేకమంది హీరోయిన్లు కూడా ప్రజల మన్ననలను  పొందారు. ఆనాటి సినిమా హీరోలు, హీరోయిన్లు హాస్యనటులు వ్యాపార రీత్యా సినిమాలు తీయలేదు. సమాజాన్ని విధ్వంసం చేసే సినిమాలు అసలే తీయలేదు. పౌరాణికాలు, సాంఘిక అంశాలతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక దురాచారాలను రూపుమాపే సినిమాలను తీసి సమాజానికి చైతన్యం పెంచడానికి ప్రయత్నించారు. గత దశాబ్దం నుంచి మోసగించడం, నేరాల నేపథ్యం ఉంటూ  యువతను పెడదోవ పట్టించే సినిమాలు అనేకం వొస్తున్నాయి. సినిమాలు సమాజాన్ని ఉద్ధరించేలా, చైతన్యపరిచే విధంగా లేకపోవడమే కాక మరింత విధ్వంసానికి గురి చేసే విధంగా తీస్తున్న వైనం ఈనాటి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. యువతను రెచ్చగొట్టడం వ్యసనాలకు దారి తీసే చిత్రాలను తీయడం ఒక వ్యాపార రీత్యా విజయవంతం కావడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం.

పుష్ప 2 సినిమాను విడుదల చేసిన వెంటనే పేద, మధ్యతరగతి  అని ఆలోచించకుండానే లక్షలాదిమంది యువత మొదటి రోజే చూడాలని ఉత్సాహంతో అత్యధిక ధరలకు టికెట్ల కొని థియేటర్లకు ఎగబడుతున్నారు.ఆదాయాలు పెంచుకోవాలనే దురాశతో సినిమా హీరో కూడా యువతను రెచ్చగొట్టే విధంగా ప్రేక్షకులకు మధ్యకు వెళ్లి తొక్కిసలాట సృష్టించడం ఒక దురదృష్టకరమైన అవాంఛనీయమైన సంఘటన ఇటీవల సంధ్య థియేటర్లో చోటు చేసుకుంది.  హీరో రావడంతో వేలాదిమంది అభిమానులు సినిమా థియేటర్లో కిక్కిరిసిపోయి ఎగబడడంతో ఒక పేద స్త్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  ఆమె 9 సంవత్సరాల కుమారుడు చావుబతుకల్లో ఉండడం తెలంగాణ ప్రజలను మరింత ఆవేదన కలిగించింది. అల్లు అర్జున్‌ పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్‌ లేకుండా థియేటర్లో ప్రవేశించలేదని, సినిమా పూర్తయ్యాకే బయటికి వెళ్తానని అల్లు అర్జున్‌ చెప్పిట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే  ఈ ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా సహించరాని నేరం. ఇంత తొక్కిసలాట జరిగి ప్రాణహాని జరిగి ఒక బాలుడు చావు బతుకులో ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ క్రీడగా మార్చుకోవడం దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పొరపాటును పొరపాటుగా భావించకుండా సినిమా హీరోకు సపోర్టుగా మాట్లాడడం.. ఆయనను అరెస్ట్‌ చేయడం ఒక తొందరపాటు చర్యగా వ్యక్తీకరించడం కూడా ప్రజలకు మింగుడు పడడం లేదు.

బిఆర్‌ఎస్‌, బిజెపి నాయకులు హీరోకు జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడడం సముచితం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాలు అందరికీ సమానంగానే వర్తిస్తాయి. హీరోలకు రాజకీయ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు ఒక న్యాయం సాధారణ పౌరులకు ఒక న్యాయం అనే ఈ భావన ప్రజాస్వామ్యంలో చెల్ల నేరదని తెలంగాణ కేంద్ర మంత్రులకు తెలియనిదేమీ కాదు. ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకొని సినీ పరిశ్రమ ఓట్లను దండుకోవడం కోసం మాత్రమే అలా మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తుపడుతున్నారు. పేద ప్రజల పక్షాన నిలబడవలసిన నాయకులు ధనవంతులకు పలుకుబడిన కలిగిన వారికి అనుకూలంగా ఉండడం సహితకము కాదని ఇప్పటికైనా గుర్తించాలి. ఎన్నికల లబ్ధి కొరకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తమ సభ్యుని రక్షణ నిలబడడం కంటే న్యాయం పక్షాన మాట్లాడడం ఉచితమని ఆలోచించాలి. తప్పు జరిగినప్పుడు అది తప్పని చెప్పడం కూడా వారి నిజాయితీకి ధర్పం పడుతుంది. శ్రీమంతులు ఉన్నతస్థాయి వర్గాల వ్యక్తులు ఈ విధంగా అన్యాయాన్ని కూడా సమర్థించే పద్ధతులు మానుకుంటే ఈ ప్రజాస్వామ్యంలో పేదసాధ ప్రజల హక్కులు భంగం కలిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండి కేవలం సంపద కలిగిన వారి పక్షాన నిలబడడం తెలంగాణ పౌర సమాజం హర్షించదని కూడా తెలుసుకోవడం అవసరం. సినీ పరిశ్రమలో రకరకాల వ్యాపారాలు కార్యకలాపాలు నిర్వహించే ఏ ప్రాంతం వారైనా తెలంగాణలో నివసిస్తున్నారు.

తెలంగాణ వాసులుగా రాజ్యాంగ వ్యవస్థలైన అసెంబ్లీ మండలి రాజ్యసభ లోకసభల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమని భావించకూడదు. ఈ ప్రాంత వాసులతో కష్టనష్టాలతో మమేకం కావాలి. ఈ తొక్కిసలాటలో నష్టపోయిన కుటుంబాలను కూడా ఈ సినీ ప్రముఖులు ఆదరించి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. వలస వొచ్చిన ఒక ప్రాంతం వారంతా కేవలం వారి బాగోగులు మాత్రమే ఆలోచించే సంకుచిత భావాలు కొనసాగించడం తెలంగాణ సమష్టి సామాజిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఇప్పటికైనా ఇతర ప్రాంతాల పునాదులు కలిగిన పెద్దలు అంగీకరిస్తే అది అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తారు స్వాగతిస్తారు.

– ప్రొఫెసర్‌ కూరపాటి వెంకట్‌ నారాయణ  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page