- రాజకీయ ఖైదీలు ఏదో చేశారని కాదు, ఏదైనా చేస్తారేమోననే భయంతో జైళ్లలో నిర్బంధించారు
- నిర్బంధించి వాళ్ళు దాని ప్రయత్నాన్ని మాత్రం ఆపలేరు
- పుస్తకావిష్కరణ సభలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కువైన నిర్బందాలు
- అణిచివేతల అధికమైనప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది
- వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు
- ప్రశ్నించిన రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ గా ముద్ర
- సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్
రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లలో పెట్టలేదని, ఏదైనా చేస్తారేమో అని భయంతో జైళ్లలో నిర్బంధించారని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. బుధవారం రాత్రి బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు ‘చందమామను ఎంత కాలం బందీ చెయ్యగలరు?’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, పలువురు కవులు, రచయితలు పాల్గొని ఆవిష్కరించారు.
ఆంగ్లంలో సూచిత్ర విజయన్, ఫ్రాన్సేస్కో రేకియా రచించిన ఈ పుస్తకాన్ని కె.సురేష్ తెలుగులో అనువదించారు. ప్రముఖ కవి యాకుబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం గొంతు విప్పిన వారిని జైళ్లలో పెట్టారని, వారి త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నామని అన్నారు. ప్రశ్నించే గొంతులను పాలకులు అణిచివేయలని చూస్తారని, కానీ చివరికి వాళ్ళు గెలిచినట్లు చరిత్రలో లేదన్నారు. అణిచివేతలపై మౌనంగా ఉండకూడదని, అలా ఉంటే వాటిని సమర్థిస్తున్నట్లు అవుతుందన్నారు.
పక్షిని కూడా పంజారంలో బందిస్తే స్వేచ్ఛ కోసం తాపత్రయ పడుతుందని, నిర్బంధించి వాళ్ళు దాని ప్రయత్నాన్ని మాత్రం ఆపలేరన్నారు. ప్రతి ఒక్కరు తమ హక్కుల కోసం గొంతెత్తాలని, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్బందాలు ఎక్కువయ్యాయన్నారు. వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారని ఆరోపించారు.
ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారని, చివరికి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ గా అభివర్ణించారని అన్నారు. దేశంలో 5 లక్షల 73 వేల మంది జైళ్లలో మగ్గుతుంటే, అందులో 75 శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలే ఉన్నారన్నారు. నిర్బందాలు, అణిచివేతల అధికమైనప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, సామాజిక వేత్తలు ఖలిదా పర్వీన్, అనురాధ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఓయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్, కె.శ్రీనివాస్, విమలక్క తదితరులు పాల్గొన్నారు.