కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు
అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం విమాన ఘటన చోటుచేసుకున్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఘటన తీరును ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే మృతుల సంఖ్యలను కనుగొనవలసి ఉందన్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధగా ఉందని తెలిపారు. ఈ విమానంలో ఇతర దేశాల ్రపజలు సైతం ఉన్నారని చెప్పారు. ఈ విషాదకరమైన, భయంకరమైన ఘటనతో తాను పూర్తిగా షాక్ అయ్యానన్నారు. ప్రధానమంత్రి మోదీ తనకు ఫోన్ చేసి ఘటన స్థలంలో ఉండమని కోరారని వివరించారు. ఈ సమయంలో తాను ప్రయాణికులు, వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించగలనన్నారు. అనేక సంస్థలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని గుర్తు చేశారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తున్నామన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలికి వచ్చారు. ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన కోసమే తాను అహ్మదాబాద్ వచ్చినట్లు తెలిపారు.