ఇక చరిత్రలోకి జారుకున్న 2024
తొలుత కిరిబాటి దీవుల్లో న్యూ ఇయర్ వేడుకలు
తర్వాత క్రమంలో న్యూజిలాండ్‌లో..
న్యూదిల్లీ, డిసెంబర్ 31: ప్రపంచ దేశాలకు కొత్త అధినేతలను తీసుకొచ్చిన 2024 ఇక చరిత్రగా మిగలనుంది. అది అందించిన జ్ఞాపకాలను మదిలో పదిలం చేసుకొని.. కొత్త అడుగులు వేయడానికి ప్రపంచం సిద్దం అవుతోంది. అయితే మనకంటే ముందే కొన్ని దేశాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లోని ప్రజలు అందరికంటే ముందే నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ వాసులు కూడా 2025లోకి అడుగుపెట్టారు. భారత్‌లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది.
ఆనందోత్సాహాల మధ్య కివీస్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. ఆస్టేల్రియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇక సూర్యుడు ఉదయించే దేశంగా పేరున్న జపాన్ కూడా మూడున్నర గంటల ముందే 2025లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి. సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2025లోకి అడుగుపెడతాం.
అదే సమయానికి భారత్‌తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వొస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. భారత్ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరుగా వొచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు. రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండుసార్లు జరుపుకొంటారు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి.