జగజ్జేత అలగ్జాండర్ జయించిన పర్షియన్ సామ్రాజ్యపు ప్రాచీన నాగరికత జ్ఞాపకాలు, దౌత్యం, వాణిజ్య ఒప్పందాలు, ఏర్పరచుకున్న వ్యూహాత్మక సరిహద్దుల మధ్య ఎంతోకాలంగా సమాధిచేయబడిన పర్షియన్ నగరానికి చెందిన ప్రేతాత్మలు మరోసారి ఒళ్లు విదుల్చుకొని లేచి సంఘర్షణకు దిగాయి. గత వారం రోజులుగా ఇజ్రాయిన్-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు నోబెల్ శాంతి బహుమతికోసం ఆబగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఒక నిరుత్సాహకరమైన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రజ్వరిల్లడానికి ఇప్పుడు మరో అమెరికా అధ్యక్షుడు దోహదకారి అవుతున్నారు.
ఇరాన్‌పై, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు అమెరికా లాంఛనప్రాయ ఆమోదం లేనప్పటికీ, టెహ్రాన్ మాత్రం యు.ఎస్. మద్దతు లేకుండా ఇవి జరిగే అవకాశం లేదని గట్టిగా విశ్వసిస్తోంది. అయితే దాడులు మొదలైన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్‌ను మెచ్చుకోవడంతో ఇరాన్ అనుమానం నిజమని స్పష్టమైంది. పైకి అమెరికా ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నప్పటికీ, దాని అసలు నైజమేంటో ఇప్పుడు వెల్లడైంది. ఈ సంఘర్షణ నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే, ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈ ప్రాం త భ్రదతకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు, ప్రతి సముద్ర రవాణా మార్గం, దౌత్యసంబంధాలపై పెను ప్రభావం చూపుతున్నాయనేది మాత్రం అక్షరసత్యం.
ఇక్కడ ఇజ్రాయిల్ వైఖరి సుస్పష్టం. ఇరాన్‌నుంచి అణు ప్రమాదాన్ని నివారించడమని ఇజ్రాయిల్ అధికార్లు పైకి చెబుతున్నా, వీరి ఆకాంక్ష దీనికి మించి ఉండటం గమనార్హం! ముఖ్యంగా ఇరాన్ ప్రజలు తమ ప్రాచీన గుర్తింపును మళ్లీ పొందడంకోసం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునివ్వడం, ఇజ్రాయిల్ లక్ష్యం మరేదో ఉన్నదనేదాన్ని స్పష్టం చేస్తున్నది. అంటే ఇజ్రాయిల్ కేవలం సైనికచర్యకు మాత్రమే పరిమితం కావడంలేదు. చారిత్రక గమ్యం మరియు జాతీయ భద్రత ముసుగులో ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టేలా, ఇరాన్ ప్రజలను రెచ్చగొడుతోంది. కానీ ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ పూర్తి ఫలితాలనివ్వలేదనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు విపరీతమైన ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ భద్రతా పరంగా అత్యంత సురక్షితమైన దేశం. కరుడుగట్టిన సైద్ధాంతికత, ప్రాంతీయంగా పరివ్యాప్త నెట్‌వర్క్ కలిగిన దేశం కూడా.
1980లో ఇరాక్‌తో జరిగిన యుద్ధం తర్వాత ఇరాన్ మొదటిసారి ఇంతటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు దేశంలో జాతీయభావాలను, పశ్చిమ దేశాలపై మరింత వ్యతిరేకతను రెచ్చగొట్టే యత్నం ప్రస్తుత ప్రభుత్వం చేయకమానదు. ఇప్పటికే ఇరాన్‌కున్న దౌత్యపరమైన సహనం చచ్చిపోయింది. యు.ఎస్.తో అణుచర్చలు నిలిచిపోయాయి. తన ప్రాక్సీలుగా వ్యవహరిస్తున్న హౌతీలు, హమాస్, హిజ్‌బుల్లా సంస్థలు పూర్తిస్థాయిలో దెబ్బతిని నామావశిష్టంగా మిగిలాయి.
ఇరుదేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగిన సహకారం ముసుగులో పరస్పర వైషమ్యాలు కప్పబడిపోయాయి. ఒకప్పుడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాలు పరస్పరం మిత్రులు కాకపోయినా కోవర్ట్ సహచరులుగా కొనసాగారు. షా మహమ్మద్ రెజా పహ్లవీ పాలనా కాలంలో రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు, నిఘావిషయంలో సహకరించుకోవడం, ఆర్థిక వాణిజ్య సంబంధాలు బలంగానే కొనసాగాయి. అయితే ఇతర అరబ్‌దేశాలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా మారినప్పడు, ఇస్లామిక్ దేశంగా ఈ సంబంధాలను నెరపడంలో ఇరాన్ కొంతమేర భయపడింది. ఇరాన్‌లో 1979 విప్లవం తర్వాత అప్పటివరకు గుప్తంగా ఉన్న పరస్పర అనుమానాలు, ప్రాక్సీ సంఘర్షణలు కనుమరుగైపోయి, బహిరంగ శత్రువులుగా మారి ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు జరిగే యుద్ధం కొత్తవారి మధ్య కాదు. ఒకరి లోతుపాతులు మరొకరికి క్షుణ్ణంగా తెలిసిన సహచరుల మధ్య!
నిజానికి ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జి7 సదస్సు రష్యా-యుక్రెయిన్ యుద్ధం మరియు వాణిజ్య యుద్ధాలపై దృష్టి కేంద్రీకరించాల్సివుంది. కానీ ఇప్పడు ఆ అజెండా స్థానాన్ని పశ్చిమాసిలో జరుగుతున్న యుద్ధం ఆక్రమించేసింది. ఇప్పటికే అమెరికా దాని సహచర దేశాలు ఈ సంఘర్షణ ఒత్తిడిలో ఉన్నాయి. ఇప్పుడీ యుద్ధం విస్తరిస్తే పరిస్థితేంటనే ఆందోళన వాటిని వెన్నాడుతోంది. ఇదే సమయంలో ప్రతి దేశ నాయకత్వానికి దేశీయ ఎన్నికల్లో గెలవాలనే కాంక్ష ఉంటుంది కదా! ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం తక్షణం పడింది చమురు రంగంపై! ఇప్పుడు ముడిచమురు ధర బ్యారల్‌కు పదిడాలర్ల పెరిగింది. అంటే అంతకుముందు 70 డాలర్లుగా ఉన్నది ఇప్పడు 80 డాలర్లయింది. అదీకాకుండా హోర్ముజ్ జలసంధి మూసివేసే ప్రమాదం పొంచివుంది. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్గం గుండా జరిగే 1/5 శాతం చమురు రవాణాపై పడిన ఫలితంగా సరుకు, బీమా ధరలు పెరిగి ఇన్వెంటరీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లలో వొణుకు మొదలైంది. ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలి, సురక్షితంగా భావించే బంగారం, స్విస్ ఫ్రాంక్‌లకు డిమాండ్ పెరిగింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులను పెరిగిన ద్రవ్యోల్బణం భయపెడుతోంది.
ఇప్పుడు భారత్ తక్షణం మన పొరుగునే వున్న ధూర్తదేశం వ్యవహారశైలిపై కన్నేసి మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ ప్రవృత్తితో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న నేపథ్యం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. వర్తమాన పరిస్థితిని మరింత వేగంగా సుస్పష్టమైన రీతిలో అధ్యయనం చేయక తప్పదు. ముఖ్యంగా మన సంబంధాలు ఇరాన్, ఇజ్రాయిల్‌లతో అత్యంత వ్యూహాత్మకమైనవి. ఇరాన్‌తో మనకు చమురు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక సంబంధాలున్నాయి. ఇరాన్‌లోని ఛబ్బహార్ పోర్టు మధ్య ఆసియాతో వాణిజ్య సంబంధాలకు మనకు అత్యంత కీలకమైంది. ఇరాన్‌లో ఏర్పడే ఏవిధమైన అస్థిర పరిణామమైనా దాని ప్రభావం భారత్‌పై తీవ్రస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ దేశాలతో నెరపే వాణిజ్య సంబంధాలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉంగలదు. ఇక ఇజ్రాయిల్ విషయానికి వొస్తే రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం మరియు నవకల్పనల విషయంలో మన సంబంధాలు గాఢంగా పాతుకుపోయి ఉన్నాయి. మిలిటరీ, సైబర్ రక్షణ వ్యవస్థలకు, అత్యంత విశ్వసనీయ దేశం ఇజ్రాయిల్. ఈ నేపథ్యంలో ఈ సంఘర్షణను చూస్తూ ఎంతోకాలం ఉండటం సాధ్యంకాదు. ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చేసిన ప్రకటనకు భారత్ దూరంగా ఉంది . ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటానికే మనదేశం యత్నించింది. అయితే ఈ విధంగా తటస్థంగా ఉంటడం అంటే మౌనంగా ఉండటం కాదని అర్థం చేసుకోవాలి.
దౌత్యపరమైన అసౌకర్యం ఏర్పడినా భారత్ తగిన రీతిలో స్పందించక తప్పదు. ఎందుకంటే మనదేశానికి సరఫరా అయ్యే చమురులో అత్యధికశాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ జలసంధిని మూసివేస్తే చమురు ధరలు, దీనిపై ఆధారపడిన రంగాల్లో ధరలు పెరిగిపోయి దేశం సంక్షోభంలోకి వెళ్లిపోతుంది. షిప్పింగ్ ధరలు, రూపాయిపై వత్తిడి మరింత పెరగడం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. లాజిస్టిక్ క్రియాశీలతను, వ్యూహాత్మక నిల్వలను పెంచడం, గల్ఫ్ చమురు సరఫరాదేశాలతో ద్వైపాక్షిక హామీలను పొందడం ఇప్పుడు అవసరం. నిజానికి భారత్ అద్భుతమైన దౌత్యనిపుణతను కలిగివుంది. ఇప్పుడు మనదేశం, టెహ్రాన్, రియాద్, టెల్ అవీవ్, రష్యా, బ్రెస్సెల్స్, మాస్కోలతో సంప్రదింపులు జరపవొచ్చు. తద్వారా గ్లోబల్ దౌత్యం, వ్యూహాత్మక సంప్రదింపులు ఒక వారధిలాగా పనిచేసి, ప్రపంచానికి ఒక గట్టి సందేశాన్నివ్వగలవు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రజ్వరిల్లడం వల్ల, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా మాత్రమే కాదు, అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఈ నాగరికతల భవితవ్యం కూడా సందిగ్ధంలో పడుతోంది.