కుల అహంకార హత్యలకు చెంప దెబ్బలా తీర్పు

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ కుల అహంకార హత్య కేసులో నల్లగొండ జిల్లా స్పెషల్ సెషన్స్ జడ్జీ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ సెకండ్ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పుతో సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసులో 540 పేజీలకు పైబడిన తీర్పు వెల్లడించింది. ఏ2 కు మరణశిక్ష, ఏ3 టూ ఏ8 వరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఎట్టకేలకు ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పడింది. ఈ తీర్పు కుల అహంకారానికి చెంప దెబ్బగా భావించవచ్చు. చుండూరు, కారంచేడు దళితుల మారణ హోమం తర్వాత అతిపెద్ద సంచలనాన్ని సృష్టించిన కుల  అహంకార హత్య కేసుగా  ప్రణయ్ కేసును చూడవచ్చు. భారతదేశంలో వేలుండుకొని కొనసాగుతున్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజల మధ్య తీసుకు వచ్చిన చీలికలు,దెబ్బతీసిన మానవ సంబంధాలు, మరొకసారి ఈ ఘటనతో తరుముకొచ్చాయి. సభ్య సమాజాన్ని ఈ ఘటన మేల్కొలిపింది. ఇది ఒక ఉత్కంఠతను లేపింది. మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఘటనలో స్పందించారు.

కేసు పూర్వపరాలు
దళిత మాల సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ కుమార్ కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ లో పదో తరగతి చదివే సమయంలో, అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే తిరునగరు మారుతీరావు ఏకైక కుమార్తె అమృత వర్షిణితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి ఒకరికొకరు మాట్లాడకుండా ఉండలేని స్థితికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మారుతీరావు తన కూతురుని ఆ స్కూల్ నుంచి తీసి మరో ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. ఇంటర్మీడియట్ కోసం అమృతను జూనియర్ కళాశాలలో చేర్పించారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న మారుతీరావు తన కూతురును ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం కళాశాలకు పంపకుండానే ఇంటి వద్దనే ఉంచి వార్షిక పరీక్షలు రాయించాడు. ఇంజనీరింగ్ బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా ప్రణయ్ కుమార్ కూడా ఘట్కేసర్ లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు.

అదే క్రమంలో అమృత వర్షిని పెళ్లి చేసుకుందామని ప్రణయ్ ని ఒత్తిడి చేయడంతో జనవరి 30, 2018 లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు అమృత వర్షిణిని హైదరాబాద్ లోని ఆర్య సమాజంలో కులాంతర వివాహం చేసుకున్నారు. వీరిద్దరు స్వస్థలం మిర్యాలగూడ. అయితే అమృత తండ్రి మారుతీరావుకు కులం అడ్డు వొచ్చింది. తనకున్న ఆర్థిక బలాన్ని ఉపయోగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తి తన కూతురును వివాహం చేసుకున్నాడనే నెపంతో దళిత యువకుడైన పెరుమాళ్ల ప్రణయ్ ని హత్య చేయించడానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసి పేరుమోసిన నేరస్థులకు సుపారీ ఇచ్చాడు. ఈ హంతక ముఠా ప్రణయ్ ని చంపడానికి అనేకసార్లు రెక్కీ నిర్వహించింది. ప్రణయ్ తన భార్యను వైద్య నిమిత్తం తీసుకొని చెకప్ చేయించుకొని వెళ్తుండగా మాటు వేసిన కిరాయి హంతకులు మిర్యాలగూడలో ని ఒక ప్రైవేట్ హస్పిటల్ వద్ద పట్టపగలే సెప్టెంబర్ 14, 2018న దారుణ హత్య చేశారు.

ఆ కేసుకు సంబంధించిన పూర్వోపరాలు ఈ విధంగా ఉన్నాయి. అదే రోజు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైం. నెంబర్:139/2018 గా యూ/ఎస్ 302 ఆర్/డబ్ల్యూ 34,120(బి)109 ఆఫ్ ఐపిసి సెక్షన్ 3(2)(v) ఆఫ్ ఎస్సీ/ ఎస్టీ(పీవోఏ)యాక్ట్ 1989 క్రింధ నమోదైంది. హత్యలో ఆయుధాన్ని ఉపయోగించడం జరిగింది కాబట్టి  సెక్షన్ 25(ఐఏ)&27(3) ఆఫ్ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 కూడా పరిగణలోకి తీసుకున్నారు.ఈ హత్య  కేసులో మారుతీ రావుతో పాటు కుట్రదారులైన 8 మంది నిందితులను గుర్తించి ఈ ఘటనకు బాధ్యులను చేశారు.

పనిచేసిన ప్రజా ఉద్యమాల ప్రభావం

ఈ మతోన్మాద హత్య జాతీయ మేధో సమాజాన్ని మరియు పౌర సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. దళిత బహుజన సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు కదిలొచ్చాయి. ఇదే సందర్భంలో కొన్ని ఆదిపత్య శక్తులు, మతతత్వ శక్తులు ఈ కేసుకు తల్లిదండ్రుల ప్రేమను ఆపాదిస్తూ మారుతి రావుకు అనుకూలంగా ర్యాలీ చేయడంతో పాటు సామాజిక మాద్యమాలలో హత్యను స్వాగతిస్తున్నామని వొచ్చిన ప్రేలాపనలపై ఉద్యమాల ద్వారా ఈ సమాజం తిప్పికొట్టగలిగింది.

కుల నిర్మూలన పోరాటాలు, కులాంతర వివాహాలు ప్రోత్సహించే సమాజం పెద్ద ఎత్తున స్పందించింది. ప్రణయ్ కుటుంబానికి పెద్ద ఎత్తున బాసటగా నిలబడింది.హత్య జరిగిన మిర్యాలగూడ ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కదం తొక్కి కులోన్మాదానికి వ్యతిరేకంగా నినదిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని ఉద్యమించారు. బలమైన ప్రజా ఉద్యమం ఊపందుకోవడంతో పోలీసు యంత్రాంగం సీరియస్ గానే చేపట్టింది. ఎలాంటి రాజకీయ ప్రమేయాలకు తావు ఇవ్వలేదు.

సమగ్ర దర్యాప్తు

సమాజం దృష్టి అంతా ఈ ఘటనపై పడడంతో మిగతా కేసుల లాగా కాకుండా పోలీస్ యంత్రాంగం ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుంది. ఎస్పీ ఏవి రంగనాథ్ ఈ కేసును సవాల్ గా తీసుకొని పక్క రాష్ట్రాలలోని నిందితులను పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. పలు రకాలుగా సమగ్రమైన దృష్టి కోణంతో నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(డి.ఎస్పీ) పి.శ్రీనివాస్ మరియు జిల్లా ఎస్పీ ఏ.వి రంగనాథ్ సమన్వయం తో సంఘటన జరిగిన అనంతరం దాదాపు 1200 పేజీల చార్జిషీట్ తో ను దాఖాలు చేశారు.

102 మంది సాక్షులను విచారించి నమోదు చేసారు.ఈ కేసులో ఐపిఎస్ రంగనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్సు టీంని ఏర్పాటు చేసుకొని ఓరల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించడంలో నిర్విరామ కృషి చేశారు. వారి టీంతో కలిసి అద్భుతమైన ఓరల్, డాక్యుమెంటరీ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ను సేకరించారు. హైదరాబాద్ లోను, నల్లగొండలోనూ మిర్యాల గూడలోను, వివిధ హోటళ్లలో బస చేసిన రికార్డులను పకడ్బందీగా సేకరించారు. దాదాపుగా 293 ఎగ్జిబిట్స్/డాక్యుమెంటరీ లను న్యాయస్థానం ముందు ఉంచగలిగారు. దీంతోపాటు హత్యకు ఉపయోగించిన 30 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని న్యాయస్థానం ముందు ఉంచారు.

ప్రత్యేక చొరవ చూపిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

ఈ కేసును ప్రత్యేకమైన కేసుగా న్యాయస్థానం స్వీకరించింది.ఘటన జరిగిన ఏడాదికి ప్రణయ్ కుమార్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 2019లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహను నియమించారు. అప్పటికే నిందితులు బెయిల్ పై వొచ్చి ఉన్నారు బెయిల్ పై వచ్చిన మారుతి రావు తన కూతురు ఇంటికి తెచ్చుకోవడానికి మధ్యవర్తుల ద్వారా రాయబారం, ఒత్తిడి చేయడంతో పోలీసు వారు మారుతి రావు పై మరో కేసు నమోదు చేశారు.అనంతరం మారుతీ రావు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ పీపీ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. కొద్ది కాలానికి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 1200 పేజీల చార్జిషీటును కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ కేసులో సాక్షుల విచారణ ప్రారంభం కాకముందే ప్రణయ్ హత్య కేసు కు సంబంధించి నిజ జీవితాన్ని మర్డర్ మూవీ రూపంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రదర్శించే రయత్నం చేయగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లో ఉన్న సాక్షుల, బాధితుల రక్షణ కోసం ఉద్దేశించిన సెక్షన్ 15 ఆఫ్ ఎస్సీ ఎస్టీ( పీవోఏ ) యాక్ట్ ప్రకారం కేసు విచారణలో ఉండగా, సాక్ష్యం ప్రభావితం చేసేలా ఉన్నందున ఈ సినిమాను ప్రదర్శించడానికి వీలులేదని న్యాయస్థానం ముందు పిటిషన్ ఉంచి, ఆ సినిమాను నిలుపుదల చేయించడంతోపాటు ఆర్జీవీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించడంలో స్పెషల్ పిపి కీ రోల్ పోషించారు.

పోలీస్ వారు సేకరించిన సాక్షాదాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారణ మొదలైన సందర్భంలో ప్రత్యక్ష సాక్షులతోపాటు పరోక్షంగా ఈ కేసు వివరాలు తెలిసిన సాక్షులందరిని, టెక్నికల్, డాక్యుమెంటరీ, సైంటిఫిక్, సాక్షులను కోర్టులో రికార్డు చేయించడంలో కీలకపాత్ర పోషించారు.ఐ విట్నెస్(ప్రత్యక్ష సాక్ష్యం)గా ఉన్న ప్రణయ్ భార్య అమృత వర్షిణి,ప్రణయ్ తల్లి ప్రేమలత క్రాస్ ఎగ్జామిన్ ను ఎదుర్కొని, కళ్లకు గట్టినట్లు జరిగిన ఘటనను ను రికార్డు చేయించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోషించిన పాత్ర అద్బుతం. స్పెషల్ పిపి చెప్పిన ఓరల్ ఆర్గ్యుమెంటుతోపాటు 472 ఫేజీల లిఖితపూర్వక ఆర్గ్యుమెంట్ నిందితుల తరుపు న్యాయవాదులను ముచ్చెమటలు పట్టించింది.

నిందితులకు ఎందుకు ఉరి శిక్ష విధించాలో మచ్చిసింగ్ v/s స్టేట్ ఆఫ్ పంజాబ్(1983),భగవాన్ దాస్ వి/ఎస్ స్టేట్(ఎన్ సిటి) ఆఫ్ దిల్లీ(2011) వంటి కేసులలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఐదు తీర్పులను న్యాయమూర్తి ముందు ఉంచగలిగారు.ఈ దేశంలో ఇలాంటి పరువు హత్యలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. నిందితులు ఫిర్యాదుదారులను,సాక్షుల నుండి మొదలుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వరకు ప్రలోభాలకు గురి చేస్తూ వీగిపోతున్న కేసులు అనేకం ఉన్నాయి.కాని సంచలనం సృష్టించిన ఈ కేసులో సమగ్రమైన న్యాయం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ముద్దాయిలకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రేరెస్టు ఆఫ్ రేర్ కేసుగా పరిగణించాలని ప్రత్యేక న్యాయమూర్తిని కోరారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ ఆచితూచి వ్యవహరించిన తీరు నేటి ఈ తీర్పు వారి వృత్తి నిబద్ధతకు నిదర్శనం.

కుల అహంకార దాడులకు ఒక హెచ్చరిక ఈ తీర్పు.

ఈ హత్య కేసులో 14 సెప్టెంబర్ 2018 న కేసు నమోదు కాగా,12 జూన్ 2019 లో చార్జిషీట్ ఫైల్ చేయడం జరిగింది.జనవరి 2022న కేసు ట్రయల్ (విచారణ)ప్రారంభమైంది. కేసు పైల్ చేయబడి 6 సంవత్సరాల 5 నెలల 25 రోజుల కాగా, విచారణ 3 సంవత్సరాల 2 నెలలు కొనసాగింది.నలుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారణజరిపారు.భిన్న రకాల సాక్ష్యాధారాల ఆధారంగా,ఇరుపక్షాల వాదనల అనంతరం అంతిమంగా నిందితులను దోషులుగా తేలుస్తూ మార్చి 10, 2025 న న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది.ఇందులో ఏ2 నిందితునికి మరణ శిక్ష,15000 జరిమానా విధించగా A3 నుంచి A8 వరకు యావజీవ కారాగార శిక్ష ,10,000 జరిమానా విధించింది. ఈ తీర్పును యావత్ సమాజం స్వాగతిస్తుంది. ప్రజలకు, ప్రధానంగా బాధితులకు ,ప్రజాస్వామికవాదులకు,అభ్యుదయవాదులకు, న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం బలపడింది. అంతిమంగా ఈ కేసులో న్యాయం గెలిచింది.

పందుల సైదులు

న్యాయవాది.

9441661192

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page