బీజేపీ ‘వ్యూహ’ రహస్యం!… ఐదేళ్లు సీఎంగా ఉంటారా?

 రెండేళ్ల ఒప్పందం తెరపైకి!
బీహార్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా, గందరగోళంగా మారాయి. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, ఆయన అధికారం ఐదేళ్లు నిలిచేనా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీ నితీశ్ నాయకత్వాన్నే అంగీకరించడం వెనుక ఉన్న ‘వ్యూహ రహస్యం’ ఏమిటనే చర్చ రాజకీయ వర్గాలను ఊపేస్తోంది. ఈ అనూహ్య నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, నితీశ్ పాలనా కాలంపై ఉన్న అనిశ్చితి బీహార్ రాజకీయాన్ని తీవ్ర సస్పెన్స్‌లోకి నెట్టాయి.
సీట్లు తక్కువైనా పీఠం ఎందుకంటే?
ఎన్డీయే కూటమిలో ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ బీజేపీ అధిష్ఠానం నితీశ్‌కు మద్దతు ఇవ్వడానికి ప్రధానంగా రెండు బలమైన రాజకీయ కారణాలు దోహదపడ్డాయి.
మొదటిది, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ కూటమికి మహిళలు, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఈబీసీ) ఓట్లు భారీగా పడటంలో నితీశ్ కుమార్ పాత్ర కీలకమైనది. నితీశ్‌కు ఉన్న ‘సుశాసన్ బాబు’ ఇమేజ్, ఆయన అనుభవం ఈ కీలక ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి దోహదపడ్డాయి. ఈ ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా ఉండేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా నితీశ్‌కు మద్దతు ఇచ్చింది.
రెండో కీలక అంశం… కేంద్ర రాజకీయాల్లో జేడీయూ ఎంపీల బలం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, టీడీపీ తర్వాత 12 మంది ఎంపీలతో జేడీయూ మూడో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ బలం కేంద్రంలో కీలకంగా ఉన్నందున, రాష్ట్రంలో నితీశ్‌ను కాదని సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే, అది కేంద్రంలో జేడీయూ మద్దతుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రాజకీయ సమీకరణాల దృష్ట్యా, బీజేపీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఈ సాహసం చేయదలుచుకోలేదు. ఎల్జేపీ ఎంపీ శాంభవి చౌదరి, ‘హమ్’ నేత జితన్ రామ్ మాంఝీ వంటి మిత్రపక్ష నేతలు కూడా నితీశ్‌కే మద్దతు తెలుపుతుండటం, నితీశ్ పదవి చేపట్టడాన్ని అనివార్యం చేసింది.
నితీశ్ నాయకత్వంలోనే ఉమ్మడి ప్రయాణం కొనసాగుతుందని బీజేపీ పైకి ప్రకటిస్తున్నప్పటికీ, ఈ తాత్కాలిక మద్దతు వెనుక రాష్ట్ర నాయకత్వాన్ని బలహీనపరిచే అంతర్గత వ్యూహం ఉందనే చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా, నితీశ్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందనే ప్రచారాన్ని ఉపయోగించుకుని, వ్యూహాత్మకంగా కొంతకాలం తర్వాత పీఠాన్ని తమకు దక్కించుకునే ఆలోచన బీజేపీలో ఉందనే ఊహాగానాలు రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా, నితీశ్‌కు ‘పల్టూ రామ్’ అనే విమర్శలు ఉన్నప్పటికీ, ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ జీవితం, పాలనా అనుభవం దృష్ట్యా, ఆయనను కాదని ముందుకు వెళితే వచ్చే రాజకీయ నష్టాన్ని భరించడానికి బీజేపీ ఇష్టపడటం లేదనేది కూడా వాస్తవం. ఈ కారణాల వల్ల, పైకి మద్దతు ప్రకటించినా, లోపల మాత్రం బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని సిద్ధం చేసుకుంటోందనే అభిప్రాయం బలంగా ఉంది.
 ఐదేళ్ల పాలనపై కొనసాగుతున్న సస్పెన్స్
అయితే, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తికాలం కొనసాగుతారా? అనే అంశమే బీహార్ రాజకీయ వర్గాలను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. గతంలో జరిగిందనే “ఆచారం” ఆధారంగా ఈ చర్చ మొదలైంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. కూటమి ధర్మాన్ని పాటించినప్పటికీ, పార్టీలో తమ అభ్యర్థికి పీఠం కట్టబెట్టాలనే అంతర్గత డిమాండ్ బలంగా ఉంది.దీనికి తోడు, గతంలో కొన్ని సందర్భాల్లో నితీశ్‌కు, బీజేపీకి మధ్య “ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి కావాలనే” ఒప్పందాలు, లేదా కొన్ని సంవత్సరాల పరిమిత పాలన ఒప్పందాలు తెరపైకి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంవత్సరాల ఒప్పందం ప్రకారం కొన్నాళ్ల తర్వాత బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే నిబంధన ఇప్పుడు ఏమైనా అమలులో ఉందా అనే విషయంలో స్పష్టత లేదు.
నితీశ్ కుమార్ ఆరోగ్యం కూడా అంచనాలకు ఒక కారణంగా మారింది. నితీశ్ ఆరోగ్యాన్ని ఒక కారణంగా చూపి, ఒకటి లేదా రెండేళ్ల తర్వాత బీజేపీ తమ అభ్యర్థిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చినా, నితీశ్ పూర్తికాలం కొనసాగడానికి అంతర్గత అంగీకారం ఉందా లేదా అనేది ఇప్పుడు రాజకీయంగా మిలిగిన అతిపెద్ద ప్రశ్న. నితీశ్ ఇప్పటివరకు 9 సార్లు సీఎంగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు. ప్రతిసారీ శాసనమండలి సభ్యుడిగానే (ఎమ్మెల్సీ) ఆ పదవిని చేపట్టడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. ఏదేమైనా, నితీశ్ పదవి పగ్గాలు స్వీకరిస్తారా? లేదా? అనే విషయంలో గందరగోళం లేకపోయినా, ఆ పగ్గాలు ఎన్ని రోజులు నిలిచి ఉంటాయి? అనే విషయంలో మాత్రం బీహార్ రాజకీయం గందరగోళంగా ఉంది.
వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ 9848559863

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page