దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

వ్యక్తి వికాసం కాకుండా జాతీయ వికాసం కోసం ఎబివిపి కృషి
ఎబివిపి 43వ రాష్ట్ర మహాసభలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్ర, జాతీయ శక్తి యువతేనని, జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ 43వ రాష్ట్ర మహా సభలు సోమవారం ప్రారంభమయ్యాయి.  ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ,  ఎబివిపి అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్‌ చౌహాన్‌ , ఎంపీ రఘునందన్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడిగా జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా రాంబాబులను మహా సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.ఈ సందర్బంగా ఏబీవీపీ 43 మహా సభలను గవర్నరు జిష్ణు దేవ్‌ వర్మ ప్రారంబించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎబివిపి వ్యక్తి వికాసం కాకుండా జాతీయ వికాసం కోసం పనిచేస్తుందని చెప్పారు. ఎబివిపి నుంచి ఎదిగిన ఎంతోమంది గొప్ప గొప్ప లీడర్లు గా ఎదిగారన్నారు. ప్రవర్తన అనేది సమాజంలో నీ స్థాయిని నిలబెడుతుందని చెప్పారు. జాతీయత నిర్మాణంలో మీ పాత్ర గొప్పగా ఉండాలన్నారు. ఇందులో ఉండేవారు ఎంతో ఎత్తుకు ఎదిగిన జాతీయ భావాలను మాత్రమే కలిగి ఉంటారని పేర్కొన్నారు. పునర్‌ నిర్మాణంలో ముందుండాలని సూచించారు. ఎంతోమంది దేశాన్ని కొల్లగొట్టిన సాంస్కృతిక వైభవాన్ని కోల్పోలేదన్నారు. సరికొత్తగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. అందరూ భారత మాత సేవలో తరించాలని అన్నారు. విశ్వగురు చేయాలన్న వివేకానందుని లక్ష్యం వైపు అందరూ పయనించాలని సూచించారు.

ఎబివిపిని మరింత విస్తరిస్తాం..
75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొందని, నేడు 55 లక్షల మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందని ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి  అన్నారు. ఎబివిపి  సుదీర్ఘ పోరాటం ద్వారా ఎబివిపి జాతీయ విద్యా విధానం సాధించిందని చెప్పారు. లాల్‌ చౌక్‌పై ఎబివిపి జాతీయ జెండా ఎగురవేసిందని తెలిపారు.ఎంతోమంది విద్యార్థులు ప్రతికూల వాతా వరణంలో బలిదానాలు చేసుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఎబివిపిని మరింత విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థి సమస్య ఉన్నచోట ఎబివిపి ఉంటుందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎబివిపి పోరాటం చేసిందని తెలిపారు.

ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రభుత్వం గద్దె దించింది ఎబివిపి అన్నారు. నాణ్యమైన విద్యను అందించాలని చేసిన ఉద్యమ ఫలితమే ఫీజు రీయంబర్స్మెంట్‌ అని అన్నారు. ఎబివిపి అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఎబివిపి ప్రస్థానం అన్నిటికన్నా భిన్నమైందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌, గుజరాత్‌ అన్నింటా మహా సభలు నిర్వహించామని, ఎన్నో సమస్యలకు పరిష్కారం జరిగాయన్నారు. హాస్టల్స్‌ సమస్యలను వెలుగులోకి తెచ్చి వసతుల కల్పనకు కృషి చేశామని చెప్పారు. ఎబివిపి నక్సల్స్‌ ను సమర్థవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు.విద్యార్దులు శారీరక దృఢత్వం కలిగి ఉండాలని, నాణ్యమైన విద్య అందించాలని అన్నారు ఎబివిపి సామాజిక సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page