ఆ క్రమంలో చందా కాంతయ్య గారు కూడా చేతులు పైకెత్తి ‘జై’ అంటున్నట్టు కాళోజీ గమనించారు. ‘ఇదేమిటీ, ఈయన తనకు తాను జై కొడుతున్నాడేంటీ!’ అని ఆశ్చర్యబోయిన కాళోజీ కారుకు దగ్గరగా పోయి ఆయన్ను నిశితంగా గమనించారు. అప్పుడు తెలిసిందేమిటంటే అందరూ చందా కాంతయ్య గారి పేరెత్తినప్పుడు ఆయన మాత్రం తన తండ్రి పేరు ఉచ్ఛరించే వారంట. అంటే ఆయనకు అందరూ జయధ్వానాలు పలుకుతుంటే ఆయన వాటిని తన తండ్రి గారి పేరుకు బదలాయిస్తున్నారన్నమాట! అంతటి మహోన్నతుడు అలనాటి నిజాం కాలంలో (1944 లో) వరంగల్ లో నగరంలో ఒక బడిని –అదీ తెలుగు మాధ్యమంలో- ప్రారంభించాలనుకున్నారు. అందుకుగాను లక్ష రూపాయల విరాళమిచ్చారు. ఎవరి సలహాలు తీసుకున్నారో ఏమో గానీ అది వరంగలుకు మొట్ట మొదటి విద్యా తులసి చెట్టుగా పుట్టింది. దాని పేరు కూడా ఎంత అద్భుతంగా వుందో గమనించండి. ‘ఆంధ్ర విద్యాభివర్ధని బహుళార్ఠ సాధకోన్నత పాఠశాల’. సింపుల్ గా దాన్ని ఏ వీ హైస్కూల్ అనే వాళ్ళం. ఆరోజుల్లో స్కూల్ ఫైనల్ అంటే 11వ తరగతి (HSC). ఐతే అప్పటికే హనుమకొండలో ఎప్పుడో నిజాం ప్రభుత్వం నెలకొల్పిన ప్రభుత్వ బహుళార్ఠ సాధకోన్నత పాఠశాల వుంది కాబట్టి, ఏ వీ హై స్కూలును గూడా బహుళార్ఠ సాధకోన్నత పాఠశాలగా ఏర్పరచారు కాబోలు.ఇందులో 12 వ తరగతి వరకు ఉండి అప్పుడు పబ్లిక్ పరీక్ష (దీన్ని మల్టీ పర్పస్ హెచ్ యెస్ సీ అంటారు) రాయాలి. ఇది పాసయితే కాలేజీ లో పీ యూ సీ చదవకుండా నేరుగా డిగ్రీ లో జాయిన్ కావచ్చు. పేరు ఏ వీ హైస్కూల్ ఐనా అందరూ అనేది ‘చందా కాంతయ్య బడి’. ఆయనకు అండగా నగర పెద్దలు వద్దిరాజు రాజేశ్వర రావు, కాళోజి రామేశ్వర రావు గార్లు కమిటీ సభ్యులుగా సహకరించారు. ఎం ఎస్ రాజలింగం గారు కార్యదర్శి.
ఆ పాఠశాల ప్రారంభ సంవత్సరాలలో ప్రోత్సాహక దృక్పథంతో జీతం తీసుకోకుండా పని చేసిన ప్రముఖులు భండారు చంద్రమౌళీశ్వర రావు, పాములపర్తి సదాశివరావు, అడవాల సత్యనారాయణ, బజారు హనుమంత రావు గార్లు.
హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనమైన పిదప 1949 -50 లలో ఆంధ్ర ప్రాంతం నుండి అనేక అధ్యాపకులు ఒక సమూహంగా వచ్చి ఏ. వీ. హైస్కూల్ లో చేరడమయింది. వారికి నాయకుడు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు యద్దనపూడి కోదండ రామశాస్త్రి గారు.అందరూ అనేది వై కె శాస్త్రి గారు అని. తర్వాత 1951 లో విశ్వనాథ సత్యనారాయణగారి సోదరుడు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు కూడా ఆ స్కూల్ కి తెలుగు అధ్యాపకుడి గా చేరారు. మాకు తెలిసిన అప్పటి కొందరు ఉపాధ్యాయుల పేర్లు: కొండల్ రావు, సుబ్బారావు, హరి రాధాకృష్ణ మూర్తి , సోమేశ్వర రావు, శ్రీనివాస మూర్తి సార్లు.
ఇక ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారు, సాహితీ మేధావులు కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్యగార్లు అలనాటి (1950 ల నాటి) ఏ వీ హైస్కూల్ విద్యార్థులే. మా మిత్రుడు, మొన్ననే పరమపదించిన రిటైర్డ్ IAS అధికారి ముదిగొండ వీరభద్రయ్య గారు 1964 విద్యార్థి. ఇంకా హరి శివకుమార్, కాశీ విశ్వనాధం, గుముడవెల్లి పురుషోత్తం, హరి సనత్కుమార్, భండారు ఉమామహేశ్వర రావు, మిమిక్రీ శ్రీనివాస్ మొదలగు ప్రముఖులు ఈ పాఠశాలాలయ పూర్వ విద్యార్థులే!
మొదట ఆ పాఠశాల ఎల్లమ్మ బజార్ లో చకిలం దామోదర్ సందు దగ్గర వుండేది. తరువాత మట్టెవాడ లోని నేరెళ్ళ బిల్డింగ్ కు మారింది. 1962 వరకు స్వంత భవనాలను సమకూర్చుకుని ప్రస్తుత రాం-లక్ష్మన్ సినిమాకు యెదురుగా వున్న విశాల ప్రదేశంలోకి మారింది.1948 లోనే వరంగల్ లో మరొక చదువుల బడి మొకరంజాహీ రోడ్ దగ్గర డాక్టర్ కే పీ రెడ్డి దవాఖానా పక్కనే ఒక పాత బిల్డింగ్ లో ప్రారంభమైంది. కారకులు బజారు హన్మంతరావు. పాములపర్తి సదాశివరావు గార్లు. అది మహబూబియా ఉన్నత పాఠశాల. ఉన్నత విలువల విద్య నందించడంలో ఏ వీ హైస్కూలుకు సమానమైన పాఠశాల. దానికి కారణం ఆరంభ దశ నుండి ఓర్పు, నేర్పుతో తోటి ఉపాధ్యాయ బృందానికి మార్గదర్శకంగా పాతికేండ్లు హెడ్మాస్టర్ గా పనిచేసి ” నేను చదివింది హన్మంత రావు బడి లో” అని గర్వంగా చెప్పుకునే అనేకమంది పూర్వ విద్యార్థులను తయారుచేసిన ఆ హన్మంత రావు సారే!
(మహబూబియా పాఠశాల అలనాటి మేటి ఉపాధ్యాయ వివరాలు మరోసారి) శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి