పార్టీ మారిన ఎమ్మెల్యే ల్లో టెన్షన్‌..!

  • సుప్రీం తీర్పుపై బిఆర్‌ఎస్‌ అశలు
  • ఉపఎన్నికలు తప్పవా ..?

మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  

పార్టీ మారిన పదిమంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో  టెన్షన్‌ ‌మొదలైంది. ఈనెల పదవ తేదీన లిఖిత పూర్వకంగా తమ సంజాయిషీని తెలియజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వారిలో ఆయోమయం నెలకొంది. అత్యున్నత న్యాయంస్థాన నిర్ణయం తమకు వ్యతిరేకంగా వొస్తే తమ పనేంటన్నది వారికిప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సుప్రీం ఒకవేళ తమను అనర్హులుగా ప్రకటించిన పక్షంలో తమ భవిష్యత్తేమిటన్న ఆలోచనలో వారున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ అదే జరిగితే తమ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో మరోసారి గెలవడమన్నది తమకు పెద్ద ప్రశ్నగా మారుతుందని వాపోతున్నట్లు వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. పార్టీ మారిన వారిపట్ల లీగల్‌ ‌సమస్యలు రాకుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదటినుండీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. పార్టీ మారిన ఈ పదిమందిని అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గానే గుర్తిస్తూ కూర్చోబెడుతోంది. అయినప్పటికీ వీరు సీఎల్ఫీ  సమావేశాలకు హాజరవుతూనే ఉన్నారు.
కాని తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నోటీసులు అందుకోవడం వల్లనేమో, తాజాగా  గురువారం ఏర్పాటు చేసిన సీఎల్ఫీ  సమావేశానికి మాత్రం హాజరు కాకుండా  జాగ్రత్త పడ్డారు. ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ మాత్రం ఇంకా తమ వెబ్‌సైట్‌లో ఈ పదిమందిని తమ పార్టీ ఎమ్మెల్యేలు గానే చూపుతోంది. ఏదిఏమైనా ఈనెల పదవతేదీన అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపైనే బిఆర్‌ఎస్‌ ఆశ పెట్టుకుంది. ఆ నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని బిఆర్‌ఎస్‌ ‌నమ్మకంగా ఉంది.  తాము ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఈ పదిమంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయని, ఆ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ , స్థానిక సంస్థల ఎన్నికలకు తోడు ఈ ఉప ఎన్నికలను ఒక అవకాశంగా వాడుకోవాలని బిఆర్‌ఎస్‌ ‌భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొస్తాయంటూ, ఇటీవల తమ క్యాడర్‌ను బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం జాగరూకపరుస్తున్నది.

2024 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో ముగ్గురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, ‌తెల్లం వెంకట్రావ్‌లు ముందుగా కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్నారు. దాంతో వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్‌పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే  పాడి కౌశిక్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ విషయంలో చర్య తీసుకోవాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. ఈలోగా ఒక్కొక్కరిగా మరో ఏడుగురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికపూడి గాంధీ, ఎం. సంజయ్‌కుమార్‌, ‌ప్రకాశ్‌గౌడ్‌లు కాంగ్రెస్‌లోకి వలస వెళ్ళారు. వారిపైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా పార్టీ సీనియర్‌ ‌నాయకుడు కల్వకుంట్ల తారకరామారావు శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్‌ ‌వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండడంతో  ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్‌ ‌దాఖలుచేశారు. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆ పదిమంది ఎందుకు పార్టీ మారాల్సివొచ్చిందన్న వివరణ కోసం వారికి నోటీసులు జారీ చేయవలసిందిగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులును ఆదేశించింది.

ఈ నెల పదవ తేదీన వారి వివరణ లిఖిత పూర్వకంగా తమకు అందజేయాలని సుప్రీం ఆదేశించింది. దాంతో మంగళవారం అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు జారీ చేసింది మొదలు వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎలాంటి వివరణ ఇవ్వాలన్న విషయంలో వాటిమధ్య తర్జనభర్జన మొదలైంది. ఈ మేరకు దానం నాగేందర్‌ ‌నాయత్వంలో వారంతా  సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకున్నట్లు తెలుస్తున్నది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సిఎం సలహాదారు వేము నరేందర్‌రెడ్డితో జరిగిన భేటీలో  వారికి అభయం లభించినట్లు వార్తలు వొస్తున్నాయి. తమను నమ్ముకుని కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరినవారిని తాము తప్పక కాపాడుకుంటామన్న హామీ వారినుండి ఎమ్మెల్యేలకు లభించినట్లు తెలుస్తున్నది. న్యాయపరమైన చర్యలకు సుప్రీం సీనియర్‌ ‌న్యాయవాదులతో చర్చిస్తామన్న వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలలో  కొందరు మళ్ళీ బిఆర్‌ఎస్‌ ‌వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దానం నాగేందర్‌, ‌గూడెం మహిపాల్‌రెడ్డిలు తమ కార్యాలయాల్లో ఇంకా మాజీ సిఎం కెసిఆర్‌ ‌ఫోటోలను పెట్టుకోవడం కొంత వివాదస్పదంగా మారింది. అంతేగాక వారిమాటలు కెసిఆర్‌కు అనుకూలంగా ఉండటం ఒకటైతే, హైడ్రా విషయంలో దానం నాగేందర్‌ ‌మాటలు ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించేవిగా ఉండడం కాంగ్రెస్‌లో గందరగోళానికి దారితీసింది. వీరిద్దరు తిరిగి బిఆర్‌ఎస్‌లో చేరుతారా అన్న అనుమానాలకు తావేర్పడింది. ఇదిలాఉంటే పార్టీ మారిన ఈ పదిమంది ఎమ్మెల్యేలను  అనర్హులుగా వేటువేయించేందుకు బిఆర్‌ఎస్‌ ‌తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌ముందస్తుగానే తన లీగల్‌టీమ్‌ను వెంటబెట్టుకుని గురువారం దిల్లీ బయలుదేరి వెళ్ళారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page