తెలంగాణ ఉద్య‌మ‌మంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయ‌న చేసిన పోరాట ఫ‌లిత‌మే నేటి ప్ర‌త్యేక రాష్ట్రం
– త‌న శ‌వంపై తెలంగాణ జెండా క‌ప్ప‌మ‌న్న త్యాగ‌శీలి కేసీఆర్‌
– కేసీఆర్ దీక్షాదివ‌స్ లేక‌పోతే డిసెంబ‌ర్ 9లేదు
– డిసెంబ‌ర్ 9లేక‌పోతే జూన్ 2లేదు
– తెలంగాణ‌ను వెనుబ‌డేలా చేశారు
– విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు

 డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు. నవంబర్ 29న కేసీఆర్  చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయ‌న ప్ర‌సంగిస్తూ  నాడు కేసీఆర్  ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదు. నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు.కేసీఆర్  దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం.  కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం కానీ రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.  అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడన్నారు. తెలంగాణ తల్లి అనేది ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలనుకోవడం దుర్మార్గం. ఆ తల్లి చేతిలో నుండి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్.  జై తెలంగాణ అనని, ఉద్యమంలో జైలుకు వెళ్ళని రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు లేదన్నారు.ఎన్నికల ముందు తలరాతలు మారుస్తానని చెప్పి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు. చేసింది శూన్యం.. ఎరువుల కొరత తెచ్చాడు, విత్తనాల ధరలు పెంచాడు, కరెంటు కోతలు తెచ్చాడు, రైతుబంధు ఎగ్గొట్టాడు. రైతు బీమా డబ్బులు కూడా కట్టకుండా రైతులను గోస పెడుతున్నాడు. కాకతీయ తోరణాన్ని, చార్మినార్ ను చిహ్నం నుంచి తొలగిస్తానంటాడు. రవీంద్ర భారతి కంటే రామోజీ ఫిలిం సిటీ గొప్పదని మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడన్నారు. కాళోజీ, దాశరథి, గద్దర్ లను చిన్న చేసి మాట్లాడుతున్నాడు.అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతాడట అంటూ ఎద్దేవా చేశారు. పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి భారతీయులను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ పేరు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమేన‌న్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్న సోనియా గాంధీని నాడు బలి దేవత అన్నది రేవంత్ రెడ్డే. ఇప్పుడు ఆ సోనియా గాంధీకి గుడి కడతామంటున్నాడు. నాడు తెలంగాణ వెనక్కి తీసుకున్నప్పుడు మన యువకులు బలిదానాలు చేసుకున్నారు. నాడుయాదిరెడ్డి సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్ కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అది. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్  అంటేనే త్యాగాలు. బహుశా దేశంలో ఒక ల‌క్ష్యం కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ మాత్ర‌మే. పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్. నిమ్స్ లో కేసీఆర్ గారికి సోడియం లెవెల్స్ తగ్గిపోయినాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి మనిషి చనిపోతాడని డాక్టర్లు మాకు చెప్పారు. నేను పోయి కేసీఆర్ దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకి నా ప్రాణం పోదు మనం కొట్లాడుదామని అన్నారు. అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ గారు తేల్చి చెప్పారు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని చెప్పిన గొప్ప నాయకుడు. ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష వల్ల, పోరాటం వల్ల వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గింది. దేవుని దయవల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారు. కచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు.ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది అని జయశంకర్ సార్ చెప్పేవారు. కేసీఆర్ పోరాటం వల్ల, తెలంగాణ రావడం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్ళు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతోంది. సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నార‌ని ఆరోపించారు. ప్రజల పక్షాన కేసీఆర్ మళ్ళీ పోరాటం చేస్తారు, కచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్  పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి వుంటుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *