- కోర్టు స్టే తొలగిపోవడంతో దరఖాస్తులకు త్వరలో మోక్షం
- దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల నిర్మాణం
- రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల (Integrated Registration Buildings) పరిధిలోకి తీసుకువస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం గచ్చిబౌలి (Gachibowli) లోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్బంగా ఏర్పాటైన సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. గత ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళాఖాతంలో కలిపేశామని, దేశంలోని 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి భూభారతి -2025 చట్టాన్ని రూపొందించామన్నారు. రోల్ మోడల్‌గా నిలిచిన ఈ భూభారతి చట్టం మేరకు రైతన్నల , ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులు నిర్వహించగా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలపారు. వీటిలో 2లక్షల దరఖాస్తులు పరిష్కారం కాగా సుమారు 4లక్షల సాదాబైనామా (Sadabinama) దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర హైకోర్టు తాజాగా ఈ సాదాబైనామాలపై ఉన్నస్టేను తొలగించినందున నిజమైన, అర్హత కలిగిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ది కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ భవనాల శంకుస్దాపన అని వివరించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోగల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపేణా సుమారు 62-63 శాతం ఆదాయం లభిస్తోందని, వీటిని 11 ఇంటిగ్రేటెడ్ భవనాల పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. నేడు శంకుస్ధాపన చేసుకున్న ఈ భవనం అత్యాధునిక కార్పొరేట్ స్ధాయిలో ఉండబోతోందన్నారు. సుమారు మూడు ఎకరాల్లో దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో , 300 కార్ల పార్కింగ్ సౌకర్యంతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఫైవ్ స్టార్ సౌకర్యాలు సుమారు 8-9 నెలల్లో ఈ భవనాన్ని నిర్మిస్తామని నిర్మాణ సంస్ధ చెబుతోందని, అయితే 6-7 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి సభా ముఖంగా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభిస్తామని చెబుతూ దశల వారీగా మిగిలిన 10 ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని సౌకర్యాలతో ఇటువంటి భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు.





