టెక్నాలజీని బ్యాలెన్స్‌గా వాడుకోవాలి!

టెక్నాలజీ అనేది  మనుషులను దూరం చేస్తోందా, బంధాలను బలోపేతం చేస్తోందా అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది. కానీ, మన చిన్న ప్రపంచాన్ని మాత్రం కొన్ని మైళ్ల దూరానికి తీసుకుపోతోంది. మునపటి తరానికి ప్రస్తుత తరానికి ఆలోచనలు, ఆచరణలో చాలా తేడా వుంది. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ అని చెప్పవొచ్చు. తరానికి తరానికి మధ్య ఈ తేడా ఉండటం సహజమే కానీ. కానీ ఈ సహస్రాబ్ది జనరేషన్‌ స్పీడ్‌ మామూలుగా లేదు.

పాతిక, ముప్పయ్‌ ఏళ్ల క్రితం మొబైల్‌  ఫోన్లు లేవు, స్కూలు,  కాలేజీ నుంచి ఇంటికి వొచ్చి అమ్మా నాన్నలతోనే గడిపేవారు. ఇప్పటిలా ఇంట్లో వేర్వేరు గదులు లేవు. హాల్‌లోనే చదువులు ఉండేవి. పిల్లలు రహస్యంగా ఏ పని చేయాలన్నా కష్టంగానే ఉండేది. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్లు ఓ కంట కనిపెట్టేవారు. పిల్లలు తల్లిదండ్రుల మాటకు చాలా విలువ ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు, 13, 14 ఏళ్లకే పిల్లల చేతికి మొబైల్‌ ఫోన్‌ వస్తోంది. స్కూలులో పాఠాలు నేర్చుకోవడానికి, రీసెర్చ్‌కి మొబైల్‌  ఫోన్‌ లేకపోతే ఎలా అని అడగడంతో, తోటి పిల్లల దగ్గర ఎక్కడ తక్కువైపోతారో, చదువులో ఎక్కడ వెనకబడిపోతారో అనే భయంతో తల్లిదండ్రులు పిల్లల చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ పెట్టక తప్పట్లేదు.

మొబైల్‌  చేతిలోకొచ్చాక వాళ్ల స్నేహాలు ఎవరితో ఎలా ఉంటున్నాయో అంచనా వేయలేరు.సైబర్‌ నేరాలు, సైబర్‌ మోసాలు, ఆడపిల్లలను మోసం చేయడం, అపరిచితులతో స్నేహాలు, డేటింగ్‌  ఇవన్నీ మొబైల్‌  ఫోన్ల వల్ల పెరుగుతున్నాయి. టెక్నాలజీ చేతుల్లోకి రాగానే, ప్రపంచం చేతుల్లోకి వొచ్చేసింది. గత తరంలో పిల్లలు తమకు తెలియని విషయాల గురించి పెద్దవాళ్లను ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు గూగుల్‌ తల్లిని అడుగుతున్నారు. ఫోన్లు, టీవీలు పిల్లలకు ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. ఇంటికి చుట్టాలు, స్నేహితులు వొస్తే, వాళ్లతో గడపడానికి, కనీసం ఐదు నిమిషాలు పలకరించేందుకు కూడా ఈ తరం పిల్లలకు  ఓపిక ఉండటం లేదు.

అవతలి వ్యక్తులు మాట్లాడుతుంటే, వీళ్లు ఫోన్లు చూసుకుంటూ, ఇంటికొచ్చిన వారి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది పేరెంట్స్‌ పెంపకం తప్పో, టెక్నాలజీ తప్పో అర్థం కాని పరిస్థితి.  ఇక, ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే సంస్కృతి ఎప్పుడో పోయింది. దీంతో, కుటుంబ సభ్యుల మధ్య మాటలే కరువయ్యాయి. డబ్బులు కావాలంటే మాత్రం ప్రేమగా ఓ ఐదు నిమిషాలు మాట్లాడతారు. ప్రతి బంధాన్నీ ఓ డీల్‌లా చూడటం అలవాటైపోయింది. మానవ సంబంధాలు యాంత్రికంగా మారిపోయాయి. అసాధారణ ప్రవర్తనను ఈ జనరేషన్‌ సాధారణం చేశారు. ఐతే, ఈ తరం వారు దీర్ఘ కాలంలో ఒత్తిడికి, అసహనానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్షణకాలపు ఆకర్షణలో ఏర్పడే పరిచయాలకు శాశ్వతత్వం ఉండదు.

ఆన్‌లైన్‌  చాట్‌లు, కొన్ని రోజులు గడిపిన తర్వాత  గొడవలు సాధారణం అయ్యాయి.  సైబర్‌ సైకాలజీ, బిహేవియర్‌ అండ్‌ సోషల్‌ నెట్‌ వర్కింగ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఆన్‌లైన్‌లో కలిసిన జంటల సంబంధాలు ఆఫ్‌లైన్‌ లో కలిసిన వారి కంటే భిన్నంగా ఎలా ఉంటాయనే అంశాలను పరిశీలించింది.ఈ అధ్యయనంలో ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ఏర్పడే సంబంధాలు విఫలమవుతాయని, బలహీనంగా ఉంటాయని చెప్పడం తప్పు అని అధ్యయనకారులు పేర్కొన్నారు. నేటి యువత సంబంధాలను ఏర్పరచుకోవడంలో, నిర్వహించడంలో టెక్నాలజీ కీలకమైన మార్పులు తీసుకువచ్చింది.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌,  ఎక్స్‌ లాంటి సోషల్‌ మీడియా ఫ్లాట్‌  ఫారాలు వాట్సాప్‌, సిగ్నల్‌ లాంటి మెసేజింగ్‌ అప్లికేషన్లు తక్షణ కనెక్టివిటీని అందిస్తున్నాయి. దూరంతో సంబంధం లేకుండా సులువుగా కమ్యూనికేట్‌ చేయడానికి, కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతున్నాయి. మరోవైపు ఈ కనెక్టివిటీని అధికంగా  ఉపయోగించడం నిజమైన బంధాలకు ఆటంకంగా మారవొచ్చు. ఒంటరితనం, అసంతృప్తికి కారణం కావొచ్చు. మితివిరీరిన స్క్రీన్‌ ట్కెం వంటి అంశాలు ముఖాముఖి సంబంధాలను తగ్గిస్తాయి. దీనివల్ల సోషల్‌ స్కిల్స్‌, ఎమోషనల్‌ స్కిల్స్‌ మందగించవొచ్చు. కాబట్టి, టెక్నాలజీని బ్యాలెన్స్‌గా వాడుకోవాలని యువత గుర్తించాలని అంటున్నారు సైకాలజిస్టులు.     -కె.ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page