లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నాం
వాషింగ్టన్ విూడియా సమావేశంలో జైశంకర్
వాషింగ్టన్, జూలై 3: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్నుతో ’ఆర్థిక బంకర్ బస్టర్’ జారవిడుస్తామంటూ అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్‌లో విూడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్ ప్రయోజనాలపై ప్రభావం చూపనుండటంతో వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు. భారత్ దౌత్య కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు ఆ బిల్లుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. మా ఆందోళనలు, ఇంధన భద్రత ప్రయోజనాలను ఆయనకు తెలియజేసినట్లే భావిస్తున్నాం.. ఇక అవసరమైతే ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలని పేర్కొన్నారు. క్వాడ్ సమావేశంలో పాల్గొనడానికి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్‌కు వెళ్లిన విదేశాంగ మంత్రి జైశంకర్ తమ ఆందోళనలను ఆ సెనెటర్‌తో ఇప్పటికే పంచుకొన్నామన్నారు. ఆ బిల్లు వాస్తవరూపం దాలిస్తే ఎదురయ్యే ఇబ్బందులపై తమకు అవగాహన ఉందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం పరిస్థితిని మరింత జఠిలం చేసింది. అమెరికా ప్రతిపాదించిన ఈ బిల్లును ప్రస్తావించే సమయంలో సెనెటర్ లిండ్సే గ్రాహం భారత్, చైనా పేర్లను ముఖ్యంగా ప్రస్తావించడం గమనార్హం. ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యాను ఒప్పించేందుకు ఓ ఆయుధం వలే ఈ బిల్లును వాడాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ఇక, ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించ నున్నట్లు తెలుస్తోంది. మరో 48 గంటల్లో భారత్- అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి వస్తుందన్న వేళ జైశంకర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.