విద్యార్థులు వీసా నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం అంతర్జాతీయ విద్యార్థులకు హెచ్చరికను జారీచేసింది.  త‌మ‌దేశంలో  విద్యనభ్యసిస్తున్న సమయంలో తమ విద్యార్థి వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. తమ యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా చదువు మానేయడం, తరగతులకు హాజరు కాకపోవడం లేదా ప్రోగ్రామ్‌ మినహాయింపుగా వెళ్లిపోవడం వంటివి విద్యార్థి వీసా తక్షణమే రద్దుకావడానికి దారి తీస్తాయని, భవిష్యత్తులో అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయే అవకాశముందని హెచ్చ‌రించింది.

విద్యార్థి హోదాను కొన‌సాగిస్తే ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదురు కాబోవ‌ని పేర్కొంది. ట్రంప్ ప్ర‌భుత్వం విద్యార్థి వీసాలపై తీసుకొచ్చిన తాజా మార్పులు భార‌తీయ విద్యార్థుల‌పై ప్ర‌భావం చూపనున్నాయి. ఈ మార్పుల నేప‌థ్యంలో విద్యార్థులు తమ విద్యా కార్యక్రమాలను పూర్తిగా కొనసాగించకపోయినా లేదా తరగతులకు హాజరుకాకపోయినా వారి వీసాలు ర‌ద్ద‌య్యే  ప్రమాదం ఉంది. అంతేకాదు భ‌విష్య‌త్తులో అమెరికా వీసాలకు అర్హత కోల్పోవ‌చ్చు కూడా.

ట్రంప్  యూఎస్ సీఐఎస్  డైరెక్టర్ పదవికి  నామినేట్ చేసిన జోసెఫ్ ఎడ్లో  ఓపీటీ ప్రోగ్రామ్‌లో తీసుకు రావాల్సిన మార్పుల‌పై చేసిన సూచ‌న‌ల మేర‌కు  ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ఇవి భారతీయ విద్యార్థులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ తర్వాత పని చేసే అవకాశాలను ప్రభావితం చేసే అవ‌కాశాలే మెండుగా వున్నాయి. తాజా మార్పుల నేప‌థ్యంలో ఎఫ్‌బీఐ డేటాబేస్‌లో కొందరు  విద్యార్థుల పేర్లు కనిపించడాన్ని ఆధారంగా చేసుకుని,వారి వీసా స్టేటస్‌ను రద్దు చేశారు.  ఇది విద్యార్థులకు ముందస్తు సమాచారం లేకుండా జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. క్యాచ్ అండ్ రీవోక్ అనే కార్యక్రమం ద్వారా, సోషల్ మీడియాలో హమాస్‌కు మద్దతుగా భావించే పోస్టులను గుర్తించి, విద్యార్థి వీసాలను రద్దు చేయడం ప్రారంభించారు.

భారతీయ విద్యార్థులకు సూచనలు
వీసా నిబంధనలు పాటించండి. తరగతులకు హాజరుకావడం, పూర్తి సమయ విద్యార్థిగా ఉండడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించండి. మీ సోషల్ మీడియా కార్యకలాపాలను జాగ్రత్తగా నిర్వహించండి, ఎందుకంటే అవి వీసా నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు.మీ విద్యా సంస్థలతో నిరంతర సంబంధం కొన‌సాగించండి. ముఖ్యంగా ఏవైనా మార్పులు ఉంటే ముందస్తుగా తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page