మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి ఉద్బోధ

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26: భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్‌జి కళాశాల నుండి క్లాక్‌ టవర్‌ వరకు గురువారం నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ క్లాక్‌ టవర్‌ చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత డ్రగ్స్‌ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్‌ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని, తెలంగాణలో డ్రగ్స్‌ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా నల్గొండలో రూ.34 కోట్లతో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు కానున్నదని తెలిపారు. త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు, యువత సెల్‌ఫోన్‌కు దూరంగా ఉందాలని, అవసరమైతేనే వాడాలని, చదువుపైనే దృష్టి పెట్టాలని, పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని ఉద్బోధించారు. ప్రకాశం బజార్‌లో ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని, డిజిటల్‌ తరగతులతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఏం కావాలన్నా ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా, మంత్రిగా సహకారం అందిస్తామని కోమటిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ మిషన్‌ పరివర్తన కింద వారం రోజులపాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఒక్కసారి డ్రగ్స్‌ తీసుకుంటే బానిసలు అవుతారని, అందువల్ల తీసుకోవద్దని, డ్రగ్స్‌పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్‌ గురించి ఏదైనా సమాచారం అందితే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని, నల్గొండ జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లా చేద్దామని పిలుపునిచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె .శ్రీనివాస్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్‌ వాడడం చట్టరీత్య నేరమని, విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడవద్దనికోరారు. మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, ఆదనపు ఎస్పీ రమేష్‌, డిడబ్ల్యుఓ కృష్ణవేణి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, డిఈఓ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి,ఎస్‌ పిలు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page