తెలంగాణ ప్రదాత సోనియమ్మ!

(నేడు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు)

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, నిధులు, నీళ్లు నియామకాల పేరిట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలుగా కొనసాగింది. మొదటగా భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ లోని నిజాం పాలించిన 10 జిల్లాలను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం అవకాశవాదుల ముంగిల్లో మగ్గిపోయింది.1956లో ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనం అయిన తర్వాత ముల్కి నిబంధనలు ఉన్న వలసవాదుల పెత్తనంతో ఉద్యోగాలు స్థానికేతరుల  పరమవడం జీర్ణించుకోలేదు. పెద్దమనుషుల ఒప్పందం గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది, ప్రత్యేక తెలంగాణ కోసం నిప్పు రాజుకుంది.

ఉద్యమ ఉధృతిని గమనించిన నాటి కేంద్ర ప్రభుత్వం ముల్కి నిబంధనలను బేఖాతర్‌ చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఉద్యమ కారులపై తుపాకి ఎక్కిపెట్టింది. కాల్పులకు నిరసనగా నాడు బలహీన వర్గాల ఆత్మబంధువు కొండా లక్ష్మణ్‌ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసారు, హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ఏకంగా కర్ఫ్యూ విధించారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యమ కారులపై కాల్పులు జరిగినాయి 369 మంది విద్యార్థుల రక్త బలిదానం చూడాల్సిన పరిస్థితి వొచ్చింది. యుద్ధ భూమిని తలపించే విధంగా చేసిన పోరాటంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. పరిస్థితి విషమించిపోకుండా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తాయిలాలు మర్రి చెన్నారెడ్డితో జరిగిన సారంశంతో విద్యార్థులను ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు. కుట్రలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరుకారింది. ఏండ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఆంధ్ర పాలకుల వివక్ష నిరంతరం కొనసాగింది. కేసీఆర్‌ నాయకత్వంలో, సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్‌ మార్గదర్శకంలో సబ్బండ వర్గాలను కదిలించింది. గల్లీ నుంచి దిల్లీ వరకు తెలంగాణ నినాదాన్ని వినిపించేలా చేసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ లాంఛనాల తర్వాత యూపీఏ చైర్‌ పర్సన్‌ గా ఉన్న సోనియమ్మ చిత్తశుద్ధితో ఈ దేశానికి కోడలు కావడం వల్లనే నికృష్ట రాజకీయాలకు తలొగ్గక మడమతిప్పకుండా సాకారం చేసిన తెలంగాణ దేవత.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరగడానికి విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు వనరులు ,ఆదాయం, ఖర్చు, ప్రధాన కారణం. సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో తెలంగాణ ప్రాంతం వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ఆకాంక్ష ఏదో ఒకరూపంలో కనబడిరది. ఇక 1996 నుండి  తెలంగాణ జనసభ, దళిత బహుజన మహాసభ, తెలంగాణ మహాసభ పేరిట పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించబడినాయి. వరంగల్‌, సూర్యాపేట, భువనగిరి డిక్లరేషన్‌ ప్రజాస్వామిక తెలంగాణ కు ఆజ్యం పోసింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో, మలిదశ ఉద్యమానికి బీజం పడ్డది. కేసీఆర్‌ నాయకత్వంలో ఉవిళ్లూరుతున్న సమయంలో ‘యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ నేరవేరుస్తాం’ అంటూ 2004లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్‌ సభలో తెలంగాణ డిమాండ్‌పై తొలిసారి బహిరంగంగా స్పందించారు.

image.png

సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా మారాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 నుండి జరిగిన అనేక ఉద్యమాలు జరిగినాయి, మలిదశ ఉద్యమంలో రాజకీయ పార్టీలు తలొగ్గి అనుకూలంగా ప్రకటనలు చేసాయి. తదుపరి జరిగిన దుర్ఘటన వైఎస్సార్‌ మరణం, రోశయ్య సీఎంగా బాధ్యతలు తీసుకోవడం లాంటి పరిణామాలతో మళ్ళి తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగడం, ఇదే అదనుగా తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ చచ్చుడో  అంటూ కేసీఆర్‌ ఆమరణనిరహార దీక్ష నేపథ్యంలో, విద్యార్థుల బలిదానాలు చూసి చలించిపోయి ఇక ఆలస్యం తగదని, సోనియా జన్మదినం రోజున ఇచ్చిన మాట ప్రకారం 2009 డిసెంబర్‌ 9న హోం మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటింప జేశారు. తెలంగాణ రాష్ట్రంపై సోనియాకు ఉన్న ప్రేమను చాటుకుంది. కానీ, ఆ తర్వాత ఆంధ్రాలో ఉద్యమం మొదలవడంతో వెనక్కి తీసుకుంది. తదుపరి వేసిన శ్రీ కృష్ణ కమిటీ, సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమాలు, అనేకానేక రాజకీయ కారణాలు వెరసి యూపీఏ-2 పాలన చివరి దశలో మాట తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రక్రియ పూర్తిచేసింది. తెలంగాణ ప్రజలు అవకాశవాదాన్ని వీడలేదు, తెలంగాణ ఇస్తే చాలు, రాష్ట్రమొస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని విలీనం చేస్తామని మాట తప్పినా తల్లి ఈసడిరచుకోలేదు.

తెలంగాణ ప్రజల ‘60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీనే ఇసుమంత అనుమానం లేదు. అప్పుడు కాంగ్రెస్‌ చేయలేని పని ఇప్పుడు చేయడం వెనుక తల్లి సోనియా పాత్ర అనిర్వచనీయమైనది. కానీ అనేక సంఘర్షణల తర్వాత తెలంగాణ కల సాకారమైంది. అందుకే  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కేసీఆర్‌ పార్టీకి విజయం అందించింది. రాష్ట్రాన్ని తెచ్చిన సెంటిమెంట్‌ పేరుతో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను పక్కకు బెట్టి  రాష్ట్రాన్ని ఇచ్చిన  తెలంగాణ ప్రదాత సోనియమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 2023లో అధికారం కట్టబెట్టి తెలంగాణ ఋణం తీర్చుకున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, కోపాలు, తాపాలు తగ్గి రెండు చోట్ల అధికారం ఉండేది, కేసీఆర్‌ను నమ్మితే నట్టేట ముంచారనే ప్రచారం బలంగా నాటుకొంది.

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇందిరా గాంధీ ప్రధానిగా స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేసినా…రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నష్టపోతుందని తెలిసి కూడా చిరకాల ఆకాంక్ష నెరవేర్చి, చరిత్ర గతిని మార్చిన తల్లి సోనియమ్మను జీవితకాలం మననం చేసుకోవాలి. దేశంలోనే అత్యున్నత  ప్రధానమంత్రి పదవిని మూడుసార్లు త్యాగం చేసి, ఎన్నో విషాదాలు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు అంతకుమించి అత్యున్నత త్యాగాలను చేసిన సోనియాగాంధీ నిజ జీవితంలో కూడా వీరవనిత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కటి చెప్పాలంటే అవకాశం ఉన్నప్పటికీ తనయుడు రాహుల్‌ ను కాదని, దేశాభివృద్ధి కోసం అనుభవజ్ఞుడ్కెన, నిజాయతీ  పరుడైన  ఆర్థికవేత్త డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టిన త్యాగశీలి .మన దేశంలో పుట్టనందుకు కావొచ్చు ఇచ్చిన మాటకు కట్టుబడి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, సోనియమ్మ రుణం తెలంగాణ వెలకట్టలేనిది. దశాబ్దం తర్వాత కానీ, తెలంగాణ సమాజం రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టడం ముదావహం.                ి
-డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వ విద్యాలయం,
వరంగల్‌, సెల్‌ : 9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page