గత ప్రభుతవం లక్ష ఎకరాలు అమ్ముకుంటే నోరు మెదపరేం
పదివేల ఎకరాలు అమ్ముకుంటే ఏం చేశారు
8 మంది ఎంపీలున్నా తెలంగాణకు గుండు సున్నా..
దమ్ముంటే తెలంగాణకు సాయంపై శ్వేతపత్రం విడుదల చేయండి
బిజెపి, బిఆర్‌ఎస్ రెండూ ఒక్క గూటి పక్షులే..
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి తీరు దారుణం
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ తీరని అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. 11 ఏళ్లుగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని అన్నారు. ఫెడరల్ వ్యవస్థను విస్మరించి తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమను చూపిస్తోందని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ వేల ఎకరాలను అమ్ముకుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ లక్ష ఎకరాలు డీఫారెస్ట్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదన్నారు. 10 వేల ఎకరాల భూములను కేసీఆర్, కేటిఆర్‌లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏం చేశాడని అన్నారు. ఇప్పుడు 400 ఎకరాల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు.. ఆనాడు లక్షల ఎకరాలు గత ప్రభుత్వం డి ఫారెస్ట్ చేస్తే.. కిషన్ రెడ్డి ఆనాడు ఎందుకు నోరు మెదపలేదన్నారు. నిధుల విడుదలలో చేస్తున్న అన్యాయానికి గాను కేంద్రంపై ఫైర్ అయ్యారు. గత పదకొండేళ్లలో మోదీ సర్కారు తెలంగాణకు ఇచ్చింది సున్నా అంటూ మండిపడ్డారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని.. డీలిమిటేషన్ జరగకుండా ఉండేందుకు కోదండరాంతో కలిసి నడుస్తామని ఆయన అన్నారు. భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 8 స్థానాల్లో గెలిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం సున్నా.. అని విమర్శించారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వడం లేదు. మూసీ పునరుజ్జీవానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదు. విభజన చట్టంలోని హాల గురించి కేంద్ర మంత్రులు ఏనాడైనా మాట్లాడారా? మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించేందుకు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని అన్నారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం లేదా అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి బీజేపీ నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానిది సవతితల్లి ప్రేమను బిజెపి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బిఆర్ఎస్, బిజెపి మధ్య ఎప్పుడూ రహస్య బంధం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి బండిది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర.. 11ఏండ్లు తెలంగాణకు ఏం తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మోదీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడున్నాడు. తెలంగాణకు ఏం వెలగబెట్టారని ఒక్క చాన్స్ అని అడుగుతున్నారు.. మూడుసార్లు మోదీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమి ఎలగబెట్టారు.. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏమి చేశారు. మూడోసారి కూడా మతం పేరున వోట్లు అడిగి అధికారంలోకి వొచ్చారు..
మెట్రో కోసం ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదన్నారు. మూసి ప్రక్షాళన జరిగి హైదరాబాద్ ప్రజలు బాగుపడటం కిషన్ రెడ్డికి నచ్చదు.. మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు నచ్చదు.. అందుకే కు ప్రజలు చాన్స్ ఇవ్వరు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల.. విభజన హామీలు కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి పట్టదు ..అయినా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పగటి కలలు కంటున్నారు.. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించినా ఇచ్చిన హాలు అమలు చేస్తున్నాం. పేద వాళ్లకు సన్న బియ్యం ఇస్తున్నాం.. మీరు.. బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఏఐసీసీ నడుపుతుందని మాట్లాడుతున్నారు.. అమిత్‌షా, మోదీ పర్మిషన్ లేనిదే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు.. అమిత్ షా మోదీ చెప్పులు మోయలేదా.. సన్నబియ్యం మేమే ఇస్తున్నాం అని బీజేపీ నాయకులు చెప్తున్నారు.. సన్న బియ్యం కార్యక్రమం బీజేపీ పాలిత అన్నీ రాష్ట్రాల్లో అమలు చేయండి.. బీజేపీకి వితండవాదం అలవాటైందని మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు.