మేం అధికారంలోకి వొస్తే.. ఆ భూములను వాపస్ తీసుకుంటాం
400 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం..
విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి వారి పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నగర ప్రజల తరఫున బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్యూట్ చెప్పారు. హెచ్‌సీయూ విద్యార్థులది అసామాన్య పోరాటమని తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ లో జరిగిన పోరాటాలకు దీటుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వీరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను బరాబర్ వాపస్ తీసుకుంటామని స్పష్టం చేశారు. 10 రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే.. కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పెయిడ్ బ్యాచ్ అనడం ముఖ్యమంత్రి, మంత్రుల అహంకారానికి నిదర్శనమని అన్నారు. అక్కడ జంతువులే లేవు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అని భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధను బయట పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంతనో. బాసో కాదు.
ఓ పెద్ద పాలేరు మాత్రమే.. మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా.. ఎమ్మెల్సీలైనా.. అందరూ ప్రజా సేవకులేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అనువంతైనా లేదు. మేం పాలకులం.. మీరందరూ మా కాలికింద చెప్పులు, బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజల సొమ్ముకు ప్రభుత్వాలు ధర్మకర్తలు మాత్రమే. రోజుకు 18 గంటలు పని చేస్తా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి కనీసం పది నిమిషాలు మనిషిలాగా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రోజుకు 18 గంటలు పని చేయకుండా ఒక పది నిమిషాలు ఒక తండ్రి లాగా, ఒక తాత లాగా భవిష్యత్ తరాల మీద సోయితోని ఆలోచించాలి. ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి దొంగల్లాగా అక్కడ పనులు ఎందుకు చేయిస్తున్నారు? పది రోజులు సమయం ఇవ్వండని కోర్టుకు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల్లాగా ఎందుకు అక్కడ చెట్లు కొట్టేస్తూ వన్యప్రాణులను చంపేస్తోంది. కోర్టు సెలవులను చూసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది. శని, ఆదివారాలు ప్రజల మీదికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయని హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన ప్రభుత్వానికి బుద్ధి రాదా.. ఇంగితం రాదా? అని నిలదీశారు. ఫుట్‌బాల్ ఆడడానికి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమతో ఫుట్‌బాల్ ఆడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల జుట్టు లాగడం ఆడపిల్లల బట్టలు చింపడమే ప్రజాపాలనా?
హైదరాబాద్ భవిష్యత్ కోసం, ప్రజల కోసమే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడుతున్నారు. అక్కడ వాళ్లకు ఇంచు భూమి కూడా లేదు. వేరే రాష్ట్రాల నుంచి వొచ్చి హెచ్‌సీయూలో చదువుకుంటున్న విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో ఇసుమంతైన రేవంత్ రెడ్డికి ఉందా? అందరిని ఒప్పించి మా ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం 14000 ఎకరాలను సేకరించాం. ఫ్యూచర్ సిటీ కోసం 14000 ఎకరాలను పెట్టుకొని ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? పశ్చిమ హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క లంగ్స్ స్పేస్.. సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలు. దాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమ గూడును చెదరగొట్టొద్దని అక్కడి నెమళ్లు, పశువులు అరుస్తుంటే, ప్రభుత్వంలోని ఏ ఒక్కరికి బాధనిపిస్తలేదా? హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటం మీద రెండు రోజులుగా కేసీఆర్ మా పార్టీ నేతలతో పాటు హైదరాబాద్ కు చెందిన కొంతమంది ముఖ్యులతో మాట్లాడుతున్నారు. చర్చించారు. మా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించాం. కేసీఆర్ హయాంలో 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించాం.
హైదరాబాద్ లో 7.7% గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది
పర్యావరణ పరిరక్షణలో, గ్రీన్ కవర్ ను పెంచడంలో తెలంగాణ దేశంలోని నెంబర్ వన్ గా నిలవడం మేము సాధించిన రికార్డ్. పదేళ్లలో భారతదేశంలోని మెట్రో నగరాల్లో అత్యధికంగా పచ్చదనం పెరిగిన నగరం హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. 2021లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెరిగిందని భారత ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. పల్లెల్లో 13657 ఎకరాల్లో 19472 ప్రకృతి వనాలు పెట్టినం. మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలను 6298 ఎకరాల్లో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. హైదరాబాద్ చుట్టూ 108 అర్బన్ లంగ్ స్పేసెస్ ను ఏర్పాటు చేశాం. పంచాయతీ రాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్ల వెంబడి వందలాది కిలోమీటర్లు చెట్లను పెంచాం.
ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్ర భారతదేశంలో తెలంగాణ ఒక్కటే. 14,864 నర్సరీలు తెలంగాణలో ఉన్నాయి. 270 కో ట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మేం ప్రభుత్వంలోకి వొచ్చిన తర్వాత ఆ 400 ఎకరాల్లో మొత్తం తెలంగాణలోని అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికాలోని మన్ హట్టన్ లో ఉన్న సెంట్రల్ పార్క్ మాదిరిగా ఒక అద్భుతమైన ఎకో పార్కును సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు, హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా అందిస్తామన్నారు. హైదరాబాద్ లో మమ్మల్ని ఏకపక్షంగా గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా మేము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు భూములు కొనుక్కున్న వాళ్లు తర్వాత మమ్మల్ని అనొద్దని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతోనే పనిచేస్తుంది.. మేం మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాం. రాజకీయ నాయకుడు వొచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తే రాజనీతిజ్ఞుడు తర్వాతి తరం కోసం ఆలోచిస్తాడు కోర్టుల్లో మా ప్రభుత్వ హయాంలో కొట్లాడడంతోనే ఆ భూమి ఇవ్వాళ తెలంగాణ ప్రజలకు దక్కింది. రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి మేము కొట్లాడలేదు. దిల్లీలాగా హైదరాబాద్ మారొద్దన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్స్ స్పేస్ ఉండాలన్న దూర దృష్టితో మేము కొట్లాడాం.
ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే, నిర్ణయాన్ని మార్చుకోకపోతే హైదరాబాద్ ప్రజలతో పాటు పెద్ద ఎత్తున మా పార్టీ కార్యకర్తలం, ప్రజా ప్రతినిధులు అందరం హెచ్‌సీయూకి మార్చ్ లాగా తరలి వెళ్తాం.. రాజ్యసభలో మా ఎంపీలు సురేష్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర ఈ విషయాన్ని లేవనెత్తారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మొహబ్బత్ కి దుకాణ్ లా కాదు నఫరత్ కా మకాన్ లాగా తెలంగాణ మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఓ లాపతా లీడర్.. పొలిటికల్ టూరిస్ట్. రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వొచ్చి ఇక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడాలి తమ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటో వాళ్లకు వివరించాలి. ఎస్ఆర్‌డీపీలో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కట్టడానికి మా ప్రభుత్వ హయాంలో పిలిచిన టెండర్లను ప్రజల నిరసనలతో రద్దు చేశామని తెలిపారు. బండి సంజయ్ ఓ ఐటమ్ నంబర్ సిక్స్. అప్పుడప్పుడు పార్లమెంటుకు వెళ్లి భారత ప్రభుత్వ నివేదికలని చదువుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయిన బండి సంజయ్ చదువుకోవాలని, తంబాకు నములుకుంటూ అక్కడా ఇక్కడా తిరగవద్దని.అది ఆయనకి కూడా మంచిది కాదని కేటీఆర్ హితువు పలికారు.