మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీర వనిత కొమ్మిడి సుగుణ మృతి పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళా చైతన్యం, సమాన హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన గొప్ప త్యాగశీలి సుగుణ అని మంత్రి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్రాహ్మణపల్లిలో జన్మించిన సుగుణ చిన్న వయసులోనే భువనగిరి ఆంధ్ర మహాసభలో వలంటీర్ గా పనిచేశారన్నారు. సిపిఐ అనుబంధ మహిళా సమాఖ్య కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో విశేష సేవలందించారని, నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన సుగుణ మృతి సమాజానికి తీరని లోటని మంత్రి సీతక్క అన్నారు.