– రూ.74.43 కోట్ల నిధుల మంజూరు
– కొత్త రోడ్లతో పల్లెల ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ దఫా మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని పేర్కొన్నారు. పల్లెల మధ్య అనుసంధానం పెరిగి రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణులు వంటి వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు.. ప్రతి రంగంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ములుగు జిల్లాలోని గిరిజన ఆదివాసీి ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అక్కడి పల్లెలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం ద్వారా పల్లెల మధ్య రవాణా సౌకర్యం మాత్రమేకాక పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ రూ.74.43 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దశకు చేరుతుంది.. రహదారులు మాత్రమే కాదు.. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలే మారిపోతాయి.. మరింత అభివృద్ధి పల్లెల తలుపు తడుతుంది అని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





