సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు
•బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి24: కాంగ్రెస్ పాలనలో పల్లెన్నీ పట్టిం చుకునే నాథుడే లేడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న సమ స్యలపై కేటీఆర్ స్పందించారు. పల్లెలు నాడు కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పడితే.. నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టాయని ధ్వజమెత్తారు. 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 12,754 గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని.. దీంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒకవైపు తాగునీరు, మరోవైపు విద్యుత్ కోతలు ప్రజలను వెంటాడుతున్నాయని అన్నారు. హరితహారం మొక్కల హాహాకారాలు.. పంచాయతీల నిర్వహణకు కార్యదర్శుల ఆపసోపాలు పాడుతున్నారని పేర్కొన్నారు. హరితహారంలో మొక్కలు నాటించి గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణ, మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే ఆదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు.. నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యంతో నిధులు లేక వెలవెలబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.