అందాల పోటీలకు రూ.200 కోట్లు..

రైతన్నలకు మాత్రం మొండిచేయి
కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు

సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే రూపాయి లేదంటున్నారని ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ ‌రెడ్డి ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు పెడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ప్రతీ గ్రామంలో చెరువులకు నీళ్ళు ఇచ్చి ముదిరాజ్‌లకు ఉపాధి కల్పించామని గుర్తుచేశారు. చేపల పెంపకాన్ని భారీగా పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి ప్రాజెక్‌లను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక సగం జిల్లాలో చెరువుల్లో, కుంటల్లో చేపలు పోయలేదన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపల పెంపకం కోసం టెండర్లు పిలవడం లేదని మండిపడ్డారు. ఈ ఏడాది అన్ని చెరువుల్లో చేపలు వదలాలని.. లేకుంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని వదిలేది లేదని హెచ్చరించారు.

జనుము జిలుగు విత్తనాలు దొరకడం లేదన్నారు. ఫ్యూచర్‌ ‌సిటీ కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు పెడుతారని… కాంట్రాక్టర్ల కోసం వేల కోట్లు ఖర్చు పెడతారని… కానీ రైతులకు మాత్రం రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదంటూ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా.. సోమవారం నాడు జిల్లాలోని నంగునూరు మండలం పాలమాకులలో కొరివి కృష్ణస్వామి, పండగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు, శాసన మండలి వైస్‌ ‌చైర్మన్‌ ‌బండ ప్రకాష్‌ ‌పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండ ప్రకాష్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకుని గుర్తించుకుంటున్నామని.. ప్రముఖుల చరిత్రలు బయటకు వస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ 1956 తరవాత మొదటి మేయర్‌ ‌కృష్ణ స్వామి అని అన్నారు. పండగ సాయన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. పెద్దోన్ని కొట్టు- పేదలకు పెట్టాలనే నినాదంతో ఆయన పని చేశారన్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు అయినా పేద ముదిరాజ్‌లకు సంక్షేమ పథకాలు అందడం లేదని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఇచ్చిన హాలను నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. హాలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని బండ ప్రకాష్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page