రోడ్డు భద్రత ప్రతి వారి సామాజిక బాధ్యత

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– రాష్ట్రవ్యాప్తంగా ’అరైవ్ అలైవ్’ నిర్వహణ
– నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఖైరతాబాద్ రవాణా కార్యాలయం, సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. వాహనదారులకు సరిపడా ఉద్యోగులను ఏర్పాటు చేయడం అసాధ్యమని, ప్రజలే స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని కోరారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర’లో హాస్పిటల్‌లో చేర్చి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం తరపున రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు భవిష్యత్తు లేకుండా వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో రోడ్డు భద్రతను పాఠ్యాంశాల్లో చేరుస్తామని, ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్ల నిర్మాణంలో మార్పులు చేస్తామని చెప్పారు. ఐఐటీ విద్యార్థుల సహకారంతో రోడ్డు భద్రతపై కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తామన్నారు. ఆర్టీసీ బస్సులు రోజుకు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నా ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ప్రమాదాల బారినపడి మరణించిన సంఘటనలున్నాయంటూ గమ్యాన్ని త్వరగా చేరాలనే ఆరాటంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే విమర్శలు రావడం సరికాదన్నారు. అనంతరం అధికారులతో కలిసి రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేసి, గోడ పత్రికలను విడుదల చేశారు.

భారీ వాహన డ్రైవర్లకు డీజీపీ ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ

నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డీజీపీ బి.శివధర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సోన్‌లో డీజీపీకి ఆదివాసీలు గుస్సాడి నృత్యంతో స్వాగతం పలకగా అక్కడ డాక్టర్ అంబేడŠ్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. గంజాల్ టోల్ ప్లాజా వద్ద భారీ వాహన డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ చేసి, ఓవర్ టేకింగ్‌కు నో చెప్పాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ‘భరోసా’ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ జాతీయ స్థాయిలో ‘స్కోచ’ అవార్డు సాధించిన ‘పోలీస్ అక్క’ బృందాన్ని అభినందించారు. విధుల్లో ఉన్న పోలీసుల కోసం బ్లూ కోల్ట్స్ సిబ్బందికి 40 హెల్మెట్లను అందజేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా చంద్రాయన్ పల్లి వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన ‘వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ’ వీఐడీఎస్‌ను ప్రారంభించారు. ప్రతి వాహనదారుడు అతివిశ్వాసం వీడి ‘డిఫెన్సివ్ డ్రైవింగ’ పాటించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరిస్తేనే ఎయిర్‌బ్యాగ్స్ పనిచేస్తాయని వివరించారు. కామారెడ్డి పర్యటనలో భాగంగా ఎన్‌హెచ్-44పై కుప్రియల్ క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాద ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అనంతరం కలాభారతిలో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హత్యల కంటే రోడ్డు ప్రమాద మరణాలే 10 రెట్లు ఎక్కువగా ఉండడం ఆందోళనకరమని అన్నారు. ఏడాదికి సుమారు 800 మంది హత్యల వల్ల మరణిస్తుంటే 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందుకు ప్రధాన కారణం నిర్లక్ష్యమేనని తెలిపారు. ఈ సందర్భంగా 300 మందికి హెల్మెట్లు పంపిణీ చేయగా 161మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందజేశారు. 50 మంది ప్రాణాలను కాపాడిన వి.రవిని డీజీపీ సన్మానించారు.

రెండో రోజుకు ‘అరైవ్ అలైవ్ ’

కాగా, అంబేడŠ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్ అలైవ’ రెండో రోజు కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించి, మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రామగుండం మున్సిపాలిటీ జంక్షన్ వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ వద్ద కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అంబేడŠ్కర్ సాక్షిగా ప్రమాద రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించి జీబ్రా క్రాసింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో డీసీఆర్‌బీ డీఎస్పీ ఎ.బాలాజీ నాయక్ అంబేడŠ్కర్ చిత్రపటానికి నివాళులర్పించి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఏఎస్పీ చిత్తరంజన్, సూర్యాపేటలో కలెక్టర్, ఎస్పీ, జోగుళాంబ గద్వాలలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎస్పీ టి.శ్రీనివాసరావు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మంచిర్యాలలో మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లిలో శాసనసభ్యుడు గడ్డం వినోద్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని రోడ్డు నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామ రోడ్డు భద్రత కమిటీలు, విద్యార్థులతోపాటు స్వచ్ఛంద సంస్థలు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *