మెడిక‌ల్ విద్యార్థుల స్టూడెంట్ల స్టైఫండ్ సమస్యను ప‌రిష్క‌రించండి

ఎన్ ఎంసీ ఛైర్మ‌న్‌ను కోరిన మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌:

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల‌కు స్టైఫండ్ చెల్లించ‌కుండా ఆయా సంస్థ‌లు ఇబ్బంది పెడుతున్నాయ‌ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హైదరాబాద్‌‌ పర్యటనకు వచ్చిన ఎన్‌ఎంసీ చైర్మన్‌‌‌‌, డాక్టర్ బి.ఎన్.గంగాధర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆయ‌న‌తో శ‌నివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు. విద్యార్థుల‌ను స్టైఫండ్ విషయంలో ఇబ్బంది పెడుతున్న క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ మంత్రి స్టూడెంట్స్ అందజేసిన రిప్రజంటేషన్ కాపీని చైర్మన్‌కు అందజేశారు. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో కాలేజీలు పెరిగినందున, ఫాకల్టీ సర్దుబాటు, బిల్డింగుల విషయంలో అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు.

ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు లేకపోవడం వల్ల, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఇబ్బంది పడుతున్నారని పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాల‌న్నారు. పీజీ సీట్లు పెరిగితే, ప్రజలకు మేలు జరుగుతుందని మెరుగైన వైద్య సేవలు అందుతాయని, మెడికల్ కాలేజీల్లో ఫాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు కూడా ఇబ్బంది ఉండదని ఎన్‌ఎంసీ చైర్మన్‌కు మంత్రి వివ‌రించారు. కాగా మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్ద‌రి మ‌ధ్య సుదీర్ఘ చర్చ జ‌రిగింది. మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ చైర్మన్‌కు మంత్రి సూచించారు. మంత్రి దామోదర చేసిన విజ్ఞప్తులకు ఎన్‌ఎంసీ చైర్మన్‌, డాక్టర్ గంగాధర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఎన్‌ఎంసీ మాజీ సభ్యుడు, ప్రముఖ డాక్టర్ సూర్యనారాయణ రాజు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి, డీఎంఈ (అడ్మిన్) శివరామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఆహ్వానం మేరకు ఉస్మానియాలో స్టూడెంట్స్, టీచింగ్ ఫ్యాక‌ల్టీతో ఎన్‌ఎంసీ చైర్మన్ ప‌మావేశ‌మ‌య్యారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో సీటు రావడం ఇక్కడి విద్యార్థులకు దక్కిన అదృష్టమ‌ని ఛైర్మ‌న్ వ్యాఖ్యానించారు. విద్యార్థి దశలో ఎంత ఎక్కువ మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించగలిగితే, అంత ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చునని సూచించారు. ఎక్కువ పనిచేస్తున్నామన్న భావనను వీడాలని, శక్తి మేరకు కష్టపడి ఉత్తమ వైద్యులుగా ఎదగాలని కోరారు. మెడికోలకు, ఫాకల్టీకి అన్నివిధాల అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఇదే సమయంలో మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచేందుకు సహకరించాలని ఫాకల్టీకి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page