రూ.6వేల కోట్లతో 5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి
•ఈ స్కీంతో నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి లబ్ధి
•ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకం
•ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు
•అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర మార్చి 17 : రూ.6000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ‘‘రాజీవ్ యువ వికాసం’’ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అధికారంలోకి వొచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు.
ఈ 15 నెలల్లో 57 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని, 50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నామని తెలిపారు. 43 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని, స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇంకా ఆయన మాట్లాడుతూ.. 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించాం. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నాం. కులగణనలో బీసీల లెక్క 56.36 శాతంగా తేలింది.. వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చాం. దీనిని ఆమోదించుకుని ఎస్సీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. పరిపాలనను ప్రక్షాళన చేస్తూ%•%పారదర్శక విధానం తో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదు.
అందుకే దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇసుకపై ప్రభుత్వానికి కోటిన్నర ఆదాయం వొస్తే%•% నేడు ఇసుక ఆదాయం మూడున్నర కోట్లకు పెరిగింది. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్యను 8.8 నుంచి 6.6 తగ్గించాం. నిత్యావసర వస్తువుల ఇన్ ఫ్లేషన్ లో 1.3 తో దేశంలోనే తెలంగాణ ముందు ఉంది. ఇది మేం చెప్పేది కాదు.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలు. రాజీవ్ యువ వికాసం ద్వారా 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2 న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కలిగించొచ్చు. ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా నిర్వహించామని, . పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలని అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతామని చెప్పారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.