తెలంగాణా సాంస్కృతిక సలహామండలి ఏమైంది?

“విగ్రహాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లోనూ తెలంగాణా ముఖ్యమంత్రి పై ప్రముఖ సమైక్య వాద నటులు పొగడ్తల వర్షం కురిపించారు. ఉభయకుశలోపరి,మంచిదే. కానీ,రెండేళ్ళ కాలపరిమితి ముగిసినా తెలంగాణా ఉద్యమకారులపై ఉన్న కేసులను రద్దు చేశారా? తెలంగాణా ఉద్యమ కారులకు ఇస్తామన్న నాలుగు వందల గజాల ఇంటి స్థలం మాటేమిటి? తెలంగాణా అమరవీరుల కుటుంబాలకు కోటి రూకల రేవంత్ బాట ఎందుకు వర్తించదు? తెలంగాణా ఉద్యమం కారులకు కనీస లబ్ది దేవుడెరుగు,  కనీసం వారిని గుర్తించే పారామీటర్ లైనాఏమైనా  తయారు చేశారా? ఇత్యాది ప్రశ్నలకు రెండేళ్ళ కాలపరిమితి ముగిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది.”

ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514.
ఇమెయిల్ ఐడి: thirmal.1960@gmail.com

 “ కరిచేకుక్క కి ఒక కండ వేయడం “అనే తెలుగు సామెత ఊరికే పుట్టలేదు.మనపాలకుల విధానాలు అందుకు ఊతం కూడా ఇస్తున్నాయి. తమ ప్రభుత్వాలకు పంటిలో రాయిలా కంటిలో నలుసు లాగా అడ్డుపడే వారికి పావలో పరకో బహుమతిగా ఇచ్చి చల్లబరచడం, కాకుంటే పదవుల్లో కూర్చోబెట్టి సర్దుబాటు జేయడం రివాజుగానే వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా “కళ్ళుమూసుకొని పిల్లి పాలు తాగి నట్లు”ఎవరూ చూడనట్లు,ఒకవేళ చూసినా మాట్లాడకుండా ఉండేటట్లు చేయడం ప్రభుత్వ మంత్రాంగంలో భాగమే?అందుకు తెలంగాణా ప్రభుత్వాలు అతీతం కానేకాదు.కేసీఆర్ అదికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా తెలంగాణా సెంటిమెంట్ కు అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడలేదు.. కాకుంటే తమకు ఆయాచితంగా లేక రాజకీయంగా కలిసి వచ్చే అంశాల్లో సెంటిమెంట్ వాడకుండా లేరంటే అతిశయోక్తి మాత్రం కాదు.

    తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య వాద మూలాలు ఉన్నవారికి అవార్డులు, పదవులు కేసీఆర్ కట్టబెడితే రేవంత్ రెడ్డి దానికి పదింతలు పాలనా వైచిత్యం చూపుతున్నారు.ఇక్కడ ఒక వైవిద్యం మాత్రం ఉంది.కేసీఆర్ సమయం లో ఎవరైతే వివక్షకు గురయ్యారని ఆయన బావించారో!వారికి పదింతలు మర్యాద ఇచ్చి కేసీఆర్ ను పరోక్షంగా సాధించడం రేవంత్ ఆంతర్యం కావచ్చు నేమో! లేక గత పాలనా వివక్షలు చక్కదిద్దడం అయినాకావచ్చును…! ఏ పేరైనా ఖాయపర్చుకోవచ్చును.  ఎవరేమనుకున్నా అందేశ్రీ తెలంగాణా గీతానికి కీరవాణి తో బాణీ కట్టించి తెలంగాణా రాష్ట్ర గీతంగా యుద్ద ప్రాతిపదికన ప్రకటించడం, విరసం నేత చింతకింద కాశీంకు ఇచ్చిన ప్రాధాన్యత, కొందరు రచయితలకు కోటి రూకల ఆర్థిక సహాయం వీటన్నింటినీ చాలా వరకు అదే దృక్పధం నుండి చూడవచ్చును.

    కక్ష్య రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఒక ఆకు ఎక్కువే చదివారు అనిపిస్తుంది.కాకుంటే వీరి తెలంగాణా సెంటిమెంట్ చూసి ఎవరైనా చొక్కాలు చించుకుంటే మాత్రం బహిరంగం గా బట్టలు ఊడి  బద్నాం కావడం ఖాయం! కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో అదికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణా సాంస్కృతిక యోధుడు గద్దర్,ఆయన కుటుంబంకు ఇచ్చిన ప్రాధాన్యత తక్కువేం కాదు! మంచిదే. కానీ, అటు తర్వాత జరిగిన నిర్ణయాల్లో ముఖ్యంగా గద్దర్ అవార్డుల పంపిణీ ప్రహసనం .వేదిక మొత్తం ఆంధ్రా  మూలాలు ఉన్న సినీ నటులకే ప్రాధాన్యత ఇచ్చారనే. అవార్డుల నుండి అవాకులు,చవాకులు దాకా అంతా ఆంధ్రా సెంటిమెంట్ నే కొనసాగించారనే విమర్శలు వచ్చాయి. ఇక్కడే తెలంగాణా సెంటిమెంట్ గాయపడింది కూడా.

అటు తర్వాత హడావిడి గా రూపొందించి ప్రకటించిన తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటులో కూడా తెలంగాణా సాంస్కృతిక ప్రతీక ‘బతుకమ్మ’తొలగించి ఇందిరమ్మ అమృత హస్తం తెలంగాణా తల్లికి తగిలించారనే విమర్శలు వినిపించాయి. వీటన్నింటి తర్వాతనే తెలంగాణా రాష్ట్ర సెంటిమెంట్ ను కాపాడే పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాంతాడంత ‘తెలంగాణా సాంస్కృతిక సలహామండలి’ ని నియమించింది. దీనిలో పైరవీకారులు పీఠాధిపతులకే పెద్దపీట కూడా వేశారనే విమర్శలు కాసేపు పక్కన పెడితే కమిటీ చైర్మన్ గా తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రో.కోదండరాం,రచయితలు పసునూరి రవీందర్, సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి కీలకం అయిన తెలంగాణా వాదులను అందులో భాగస్వాములను చేసింది. తెలంగాణా ప్రజలు ఆశించింది ఏమిటంటే, ఇకనుండి తెలంగాణా సెంటిమెంట్ పూర్తిగా కాపాడలేక పోయినా,కాస్తా చల్లదనం ఇచ్చే లేపనం అయినా పూస్తారన్న ఆశలు  చిగురించాయి . కానీ,ఆచరణ చూస్తే!అలా కనపడడం లేదు.

    తెలంగాణా సాంస్కృతిక సలహామండలి సలహాలు సక్రమంగా ఇస్తున్నారా? ఒక వేళ ఇచ్చినా ప్రభుత్వం పాటించడం లేదా?అనే విషయాలు ప్రక్కన పెడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి లేని వివాదాలు రాజేసింది. ఒకటి ఆర్యవైశ్యులను సంతృప్తి పరచడానికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం ప్రతిష్ట ప్రకటన, రెండు తెలంగాణా సాంస్కృతిక ఐకాన్ రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు యస్ పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ప్రతిష్టాపన. ఈ విషయంలో తెలంగాణా వాదులు, విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేస్తున్న సినీ కళాకారులు మద్య వాగ్వివాదం నడిచింది. తెలంగాణా అంతటా చర్చ నీయాంశం అయ్యింది. ఈ విషయంలో తెలంగాణా సాంస్కృతిక సలహామండలి ఏం చేస్తుంది? ఇదే నేను ప్రధానంగా వేస్తున్న ప్రశ్న. రెండు సాంస్కృతిక మూలాలు పోటీ పడుతున్నప్పుడు కూడా ఈ సాంస్కృతిక సలహామండలి మౌనం దాల్చడం వెనుక అర్థం ఉందా? ఆంతర్యం ఏమిటి?కనీసం ఏదోఒక నిర్ణయం ప్రభుత్వం కు సలహా ఇవ్వాలి కదా? లేదా తెలంగాణా ఉద్యమకారులను పిలిచి మాట్లాడాలి కదా?క్రియాశూన్యత,మౌనం దేనికి సంకేతం. కనీసం తెలంగాణా సాంస్కృతిక సలహామండలి తమ భావాలను కనీసంగా వ్యక్తీకరణ చేయాలి లేదా అవసరం అయితే రాజీనామా చేయాలి కదా? ఏమైంది తెలంగాణా స్ఫూర్తి?

    విగ్రహాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లోనూ తెలంగాణా ముఖ్యమంత్రి పై ప్రముఖ సమైక్య వాద నటులు పొగడ్తల వర్షం కురిపించారు. ఉభయకుశలోపరి,మంచిదే. కానీ,రెండేళ్ళ కాలపరిమితి ముగిసినా తెలంగాణా ఉద్యమకారులపై ఉన్న కేసులను రద్దు చేశారా? తెలంగాణా ఉద్యమ కారులకు ఇస్తామన్న నాలుగు వందల గజాల ఇంటి స్థలం మాటేమిటి? తెలంగాణా అమరవీరుల కుటుంబాలకు కోటి రూకల రేవంత్ బాట ఎందుకు వర్తించదు? తెలంగాణా ఉద్యమం కారులకు కనీస లబ్ది దేవుడెరుగు,  కనీసం వారిని గుర్తించే పారామీటర్ లైనాఏమైనా  తయారు చేశారా? ఇత్యాది ప్రశ్నలకు రెండేళ్ళ కాలపరిమితి ముగిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది.

వాస్తవానికి తెలంగాణా అస్థిత్వం నిలబెట్టేది ఐదేండ్ల పాలనలో కొలువుదీరే ,తెలంగాణా ప్రభుత్వాలు ఎంతమాత్రం కాదు.. తెలంగాణా భాషా ,యాస, సంస్కృతి,సాంప్రదాయాలు,చరిత్ర సంరక్షకులు తెలంగాణా ప్రజలే. ఇక్కడ ఒక్క విషయం మనం ఆలోచించాలసిన అవసరం ఉంది. భావాలకు ఇక ప్రాంతీయ భేదాలు వెతుక్కోవడం మనం ఇప్పటివరకు చూపిన సహనానికి,విజ్ఞతకు పరీక్ష అవుతుంది. కనుక శిశుపాలుని నూరు తప్పులు కాపాడే ఔన్నత్యం తెలంగాణా ప్రజలకు ఉంది. అయితే తెలంగాణా సాంస్కృతిక సలహామండలి మౌనం ఇట్లాంటి సందర్భం లో  సరైనది కాదనే తెలంగాణా ప్రజల నిశ్చితాభిప్రాయం.

-ఎన్.తిర్మల్

(సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త, రచయిత)

సెల్:9441864514,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page