“చిన్న”వాళ్లకు ఆర్థిక చేయూత

2015, ఏప్రిల్ 8న గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎమ్‌వై) ద్వారా భారత ఆర్థిక సమగ్రత దిశగా కీలక అడుగు పడింది. దీని ద్వారా కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తల కోసం రూ.10 లక్షల వరకు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తున్నారు. 2013 ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఆధారంగా ఈ పథకం రూపకల్పన జరిగింది. తయారీ, వ్యాపారం, సేవల రంగాల్లోని దాదాపు 5.77 కోట్ల చిన్న వ్యాపార యూనిట్లు, ప్రధానంగా వ్యక్తిగత యాజమాన్య సంస్థలు సకాలంలో ఆర్థిక సహాయాన్ని పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఆర్థిక సహాయం అందుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి వృద్ధికి ఆటంకంగా మారాయని సర్వే వివరించింది. అదనంగా, చిన్న పరిశ్రమల నిర్వాహకుల రుణ యోగ్యత సరిపడా లేకపోవడం, బ్యాంకుల క్లిష్టమైన నిబంధనలు, అవసరమైన లాంఛనాల గురించి అవగాహన లేమి వంటి అంశాలు సూక్ష్మ వ్యాపార రంగంలోని వ్యాపారులకు రుణాల లభ్యతను పరిమితం చేశాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వం పీఎమ్ఎమ్‌వై పథకాన్ని తీసుకువచ్చింది. తనఖాలు, గందరగోళంగా ఉండే నిబంధనలు, అధిక లావాదేవీ వ్యయాల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ఇది ఒక ప్రత్యేకమైన రుణ పథకంగా నిలిచింది.

తయారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో ఆదాయాన్ని ఆర్జించే చిన్న వ్యాపార సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలను అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. పీఎమ్ఎమ్‌వై కింద, టర్మ్ లోన్‌లు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రెండింటినీ కవర్ చేస్తూ, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎమ్ఎఫ్ఐలు) సహా మెంబర్ లెండింగ్ ఇనిస్టిట్యూషన్స్ (ఎమ్ఎల్ఐలు) ఈ రుణాలను అందిస్తాయి. ప్రారంభంలో, శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు వర్గాల కింద ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించారు. ఈ పథకం విజయవంతం కావడంతో, ‘తరుణ్’ కేటగిరీ కింద గతంలో రుణాలు తీసుకుని వాటిని విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారుల కోసం ప్రభుత్వం “తరుణ్ ప్లస్” అనే కొత్త కేటగిరీని జోడించడంతో పాటు, రుణ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది.

పీఎమ్ఎమ్‌వై ప్రారంభంతో, ప్రజలు బ్యాంకుకు పూచీకత్తుగా ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే రుణాలను పొందగలిగారు. దీనివల్ల సమాజంలోని అణగారిన, బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూరింది. పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. తమ పేరిట ఎటువంటి ఆస్తులు లేని వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి, రుణ చరిత్ర తగిన స్థాయిలో లేని.. బ్యాంకుకు తాకట్టు పెట్టడానికి ఎటువంటి ఆస్తులు లేని వ్యాపారులకు ఎక్కువ సంఖ్యలో సూక్ష్మ రుణాలు అందించేలా బ్యాంకులను ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం ఈ పథకం కింద రుణ మంజూరీకి హామీగా ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ నిధిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం, భారత ప్రభుత్వ యాజమాన్య సంస్థ అయిన నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీజీటీసీ లిమిటెడ్), ఈ పథకం కింద క్రెడిట్ గ్యారంటీ నిధులకు సంబంధించిన వ్యవహారాలు, కార్యకలాపాలను చూసుకుంటున్నది.

అర్హులైన వారికి సులభంగా రుణం అందించడమే కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ దిశగా, ముఖ్యంగా శిశు కేటగిరీకి చెందిన రుణగ్రహీతల కోసం సరళీకృతమైన, వినియోగదారుల హితమైన దరఖాస్తు ప్రక్రియను రూపొందించారు. అలాగే, రుణగ్రహీతలు పీఎమ్ఎమ్‌వై రుణాలను సౌకర్యవంతంగా పొందేందుకు డిజిటల్ వేదికలను కూడా అందుబాటులో ఉంచారు. దరఖాస్తుదారులు జన్ సమర్థ్ పోర్టల్, 59 నిమిషాల్లో పీఎస్‌బీ లోన్స్ వంటి ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా కూడా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది దరఖాస్తుదారు డేటా డిజిటల్ మూల్యాంకనం ఆధారంగా త్వరితగతిన, సమర్థంగా రుణ ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇంకా, అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సొంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, మొబైల్ యాప్‌లను కూడా దీని కోసం ప్రారంభించాయి. కాగితం వినియోగాన్ని తగ్గించడం ద్వారా, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా రుణ దరఖాస్తులను క్రమబద్ధీకరించాయి.

గత దశాబ్దంలో, ప్రజల రుణ అవసరాలను తీర్చడంలో గల ఇబ్బందులను పరిష్కరించడం ద్వారా భారత ప్రజల వ్యాపార నిర్వహణ స్ఫూర్తిని వెలికితీయడంలో పీఎమ్ఎమ్‌వై కీలక పాత్ర పోషించింది. దేశంలో సూక్ష్మ సంస్థల వృద్ధికి ఇది ఊతమిచ్చింది. ఈ పథకం ద్వారా 52 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. వీటి విలువ రూ. 33.54 లక్షల కోట్లు, దీని ద్వారా ఈ పథకం లబ్ధిదారుల్లో సుమారుగా 20శాతం మంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించారు. కాలక్రమేణా సగటు రుణ పరిమాణం దాదాపుగా రెట్టింపు అయింది. కిశోర్, తరుణ్ వర్గాల కింద మంజూరు చేసిన రుణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. మంజూరు చేసిన మొత్తం రుణాల్లో ఇవి 65శాతం వాటా కలిగి ఉన్నాయి.

ఏ కార్యక్రమం విజయమైనా నిజానికి దాని సమగ్రతతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక సమగ్రతను ప్రోత్సహించడం, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం ద్వారా పీఎమ్ఎమ్‌వై దేశ సామాజిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉంది. రుణాలు పొందే ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా, ఈ పథకం వెనుకబడిన వర్గాలు, మహిళలకు సంస్థాగత ఆర్థిక చేయూతను అందించడంలో కీలక పాత్ర పోషించింది. ముద్ర రుణాల్లో దాదాపు 50శాతం ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీ వర్గాల వారికే మంజూరయ్యాయి. ముద్ర లబ్ధిదారుల్లో 68శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు ఉండడం ప్రస్తావనార్హం. ఆర్థిక సమగ్రత, మహిళా సాధికారత, దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో పీఎమ్ఎమ్‌వై సాధించిన విజయం, 2047 నాటికి ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ సాధించాలనే దార్శనికత పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page