ప్రజాధనం వృధాను అరికట్టగలగాలి
అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా చట్టాలను మార్చు కుంటున్నారు. రాజకీయ సంస్కరణల విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే దారి. అన్నీ ఒకే తాను ముక్కలు గనక వాటి గురించి అంతా తలూపుతున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల విషయంలో రాజీపడ్డట్లు కనిపించినా అందరికీ అవసరమే. కాకపోతే తరచూ ఎన్నికలను రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, అధికారం పొందేందుకు మాత్రమే వాటి తాపత్రయం తప్ప..ప్రజలపై ప్రేమతో కాదు. ఇకపోతే జమిలితో పాటు అనేక సంస్కరణలు తేవాల్సి ఉంది. ప్రధానంగా రాజ్యాంగం, దేశంపై అవగాహన లేని క్రిమినల్ చరిత్ర ఉన్నవారు కూడా రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. వీరిని ఎన్నికలకు దూరం పెట్టగలగాలి. చదువు సంధ్యలు లేకుండా ఏకంగా పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. అలాగే ఒకటికి మించి రెండుమూడు చోట్ల పోటీ చేసే పద్దతికి స్వస్తి చెప్పాలి. ఎందుకంటే కనీసం మూడుచోట్ల లేదా రెండుచోట్ల పోటీ చేస్తున్నారు. దీంతో గెలిచాక ఒకటి వదులుకున్నా, దాని ఖర్చు ప్రజలపై పడుతోంది. ఇలా పోటీ చేసి, రాజీనామా చేస్తే ఆ ఖర్చును వ్యక్తి లేదా, పార్టీ భరించేలా నిబంధన పెట్టాలి. లేదా అలాంటి వెసలుబాటు లేకుండా చేయాలి. మరో విషయం ఏమంటే ఎమ్మెల్యేలు, ఎంపిల జీతభత్యాలు, పెన్షన్లను రద్దు చేయాలి.
వారికి ఇచ్చే భత్యాలు కూడా లెక్కకు మించి ఉంటున్నాయి. ఈ జమిలి ఎన్నికల సంస్కరణలోనే వీటిని చేర్చాలి. అప్పుడే రాజకీయ సంస్కరణకు అర్థం ఉంటుది. జమిలి ఎన్నికల ద్వారా తరచూ ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. కనక దేశాభివృద్దికి దోహద పడుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఇది ముమ్మాటికీ నిజం. తరచూ ఎన్నికల వల్ల ఖజానా గుల్ల కావడంతో పాటు, ప్రజలను సమస్యల నుంచి తప్పిస్తున్నారు. ఒకేసారి ఎన్నికల ప్రతిపాదన కార్యరూపం దాల్చిన తర్వాత ఎన్నికల పక్రియ సరళతరం కానుంది. ఓ రకంగా చెప్పాలంటే అది అభివృద్దికి మరింత ఊతమిస్తుంది. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతుంది. ఏటా వోట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు తప్ప..తమ హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడడం లేదు. అందుకే ప్రజలు తరచూ అటువంటి పరిస్థితి కోరుకోవడం లేదు. జమిలి బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరుణంలో ఇంకా అనేక ప్రతిపాదనలను జోడిరచి రాజ్యాంగ సవరణకు పూనుకో వాలి. జమిలి కార్యరూపం దాలిస్తే..ఏదో ఒక ఎన్నిక కోసం ఓటర్లు ఏటా పోలింగ్ బూత్‌లకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రస్తుతమున్న జీడీపీకి అదనంగా మరో 1.5శాతం పెరుగుతుంది.
ఒకవేళ ఇదే జరిగితే జీడీపీ 10శాతం పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు. దాంతో ప్రపంచంలోనే మూడు, నాలుగో ఆర్థిక శక్తిగా మన దేశం నిలుస్తుంది. వోట్లు అడగాల్సి వస్తే.. అభివృద్ధికి సంబంధించిన హావిరీలు ఎందుకు అమలు చేయడంలేదు అన్న ప్రశ్నకు ప్రజలకు సమాధానం ఇవ్వాలి. అయితే జమిలి ఒక్కటే పరిష్కారం కాదు. తరచూ ఎన్నికల నిరోధంతో పాటు, రాజకీయ పార్టీల పెత్తనానికి కళ్లెం వేయగలిగేలా చూడాలి. ప్రజాధనం వృధాను అరికట్టగలగాలి. ఈ క్రమంలో దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. ఎట్టకేలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఒకే దేశం – ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఈ రెండు బిల్లులకు డిసెంబర్ 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు అమలయ్యాక ఏ రాష్ట్రంలోన్కెనా ప్రభుత్వం పడిపోతే ఆ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చాలా మందిలో మెదులుతోన్న ప్రశ్న. రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందనేది ఆ ప్రశ్నలలో ఒకటి. ఈ బిల్లు అమలు తర్వాత ఏ రాష్ట్రంలోన్కెనా ప్రభుత్వం పడిపోతే, ఏం చేయాలి అన్న విషయాన్ని చర్చించాలి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులో అనేక రకాల నిబంధనలు రూపొందించారు.
అవిశ్వాస తీర్మానం వల్లనో, లేదా మరేద్కెనా కారణంతోనో ప్రభుత్వం పడిపోతే.. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారనే నిబంధన కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం, ఆ సమయంలో ఆ రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కొత్త అసెంబ్లీ పదవీకాలం వొచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. అంతే కాకుండా ఎన్నికల నిర్వహణకు ముందు అవసరమైన అన్ని అవసరాలను పూర్తి చేయాలని కూడా ఎన్నికల కమిషన్‌ను బిల్లులో ఆదేశించింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కోసం ఎన్నికల సంఘం కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని బిల్లులో వివరంగా తెలిపింది. బిల్లులో తెలిపిన నిబంధన ప్రకారం, లోక్‌సభ లేదా అసెంబ్లీని మధ్యలోనే రద్దు చేయాల్సి వొస్తే, మిగిలిన కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. బిల్లులో ఆర్టికల్ 82 (ఎ), 172, 327లను చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉంది.
లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన 82 (ఎ)లో ఉంది. ఇది కాకుండా, 83లో పార్లమెంటు సభల పదవీకాలానికి సంబంధించిన నిబంధన కూడా ఉంది. అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని కూడా చట్టంలో పేర్కొన్నారు. అయితే 2029 లోక్‌సభ ఎన్నికలు మునుపటిలా నిర్వహించనున్నారు. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమలులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లుపై చర్చలో జేపీసీకి అభ్యంతరం లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడంతో దీనిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ప్రతిపాదించారు. జమిలితో పాటు పైన ప్రస్తావించిన అనేక అంశాలను చట్టంలో పొందుపరిస్తేనే బిజెపి చిత్తశుద్ది చాటుకోగలదు. అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకోసం పట్టబట్టాల్సి ఉంది.
-కందుల శ్రీనివాస్
(సీనియర్ జర్నలిస్ట్ )
(సీనియర్ జర్నలిస్ట్ )