నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ చేస్తుందో, నయా ఉదారవాదం పేర ప్రభుత్వ రంగాలన్నింటిని ఎలా ప్రైవేట్ పరం చేస్తుందో, ప్రభుత్వ సంస్థలన్నింటిని తీసుకెళ్ళి ఒకరిచేతిలో పెట్టి సింగల్ మోనోపలీ కింద చేసిపడేసి దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తూ, మతం పేర సమాజాన్ని ధ్వంసం చేస్తూ, ప్రజలమీద ఎంతటి భారాన్ని మోస్తుందో! ఇలాంటి అంశాలని బహిర్గతం చేస్తూ ప్రజల్లో ఆ ఎరుక కలుగజేస్తున్నది కేవలం సాహిత్యం మాత్రమే.

ఇప్పుడేకాదు ఎన్నో ఏండ్లుగా సాహిత్యం- సమాజంలోని అసమానతల గురించి మాట్లాడుతున్నది, స్త్రీ పురుషసమానత్వం గురించి, దళిత, బహుజన, స్త్రీలహక్కుల గురించి మాట్లాడుతుంది. అణచివేయబడ్డ, అణగారినవర్గాల గొంతుకై నిలుస్తూ వస్తున్నది. నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడాల్సిన జర్నలిజం అమ్ముడుపోయిన కారణంగా నేడు సాహిత్యం మాత్రమే ఆదివాసీలా తరపున అండగా నిలబడింది. రాజ్యం కుట్రకు బలైపోతున్న అమరుల త్యాగాల్ని భుజాన మోస్తుంది. న్యాయమని గొంతెత్తిన పాపానికి అన్యాయంగా జైలు పాలవుతున్న విద్యార్థులు, మహిళలు, ప్రొఫెసర్లు, మేధావుల తరపున పాటై గర్జిస్తుంది. కాలేజీ క్యాంపస్లలో డప్పై మొగుతుంది. మనం సంతోషించాల్సిన ఇంకో విషయం ఏంటంటే నిజాల్ని కప్పి పుచ్చాలనే పన్నాగాలు పన్నుతున్న రాజ్యాన్ని ఎదురించి నేడు ఎంతోమంది, యువకులు, మహిళలు, బుద్దిజీవులు సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా వారి అగ్రహాన్ని, అక్రోషాన్ని చూపిస్తున్నారు. నిజాన్ని బట్టబయలు చేస్తూ, న్యాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ జనరేషన్లో వచ్చిన విప్లవత్మాక మార్పు అంటాను.

కవిత్వం విషయానికొస్తే,”కవిత్వమంటే ఆషామాషీ విషయం కాదు” అంటారు. కవిత్వం రాయాలంటే కేవలం భాషవస్తే సరిపోదు. హృదయం వుండాలి. ఎదుటిమనిషి బాధని చూడగలిగేవారు, కష్టాన్ని చూసి చలించేవారు, దుఃఖించేవారు, సమస్త మానవాళిని నా అనుకున్నవాళ్ళు, యావత్తు జగత్తు నాదనే బాధ్యత, ఎరుక కలిగినవాళ్ళు మాత్రమే కవిత్వాన్ని రాయగలరు. అది ఉట్టి అక్షరాలభాష కాదు, హృదయాంతరాళాల నుండి పొంగేభాష. అయితే మరోవైపు “అబ్బో కవులున్నారు జాగ్రత్త!” అంటూ హెచ్చరికలు చేసేవారు, భయపడి పారిపోయేవాళ్ళు లేకపోలేదు. దీన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే “కవులంటే శుద్ధ పాండిత్యాన్ని మామీద రుద్దేవారని, ఏం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పకుండా సుత్తిచెప్పి బుర్ర తింటారని” వాళ్ళ ఫీలింగ్. అయితే ఇలాంటి ఒక భావన వాళ్ళ మెదళ్ళలోకి ఎందుకు వచ్చింది? జనాలు మనల్ని దగ్గరికి తీసుకొని, మన సాహిత్యాన్ని గుండెలకి హత్తుకోవాల్సింది పోయి ఎందుకు  మననుండి పారిపోతున్నారు అనేది వేసుకోవాల్సిన ప్రశ్న.

ఒకప్పుడు ఈ పాండిత్యం, పద్యాలని జనాలు రిసీవ్ చేసుకున్నారేమో గాని మారుతున్నకాలంతో పాటు జనాలు మారుతూ వచ్చారు. వారి జీవనశైలి, భాషలోనూ మార్పులు వచ్చాయి. కాబట్టి ప్రజలు ఏ భాషనైతే ఎక్కువగా అలవర్చుకున్నారో ఆ భాషలోనే మనం చెప్పాలి. అలా చెబితేనే జనాలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు గాని మా బుద్ధిబలం చూపించుకోడానికి ఎక్కడలేని పాండిత్యాన్ని చూయిస్తాం అంటే దగ్గరికి కూడా రానివ్వరు. అలా జనంకోసం రాసే రాతలు జనం దాక వెళ్ళనప్పుడు ఇక రాయడం ఎందుకు, ఎవరికోసం? కేవలం కవులే రాసుకొని, కవి సమ్మేళనాలు, సభలు పెట్టుకొని, మనమే చదువుకొని, మనల్నిమనమే పొగుడుకోడానికి అయితే రాయక్కర్లేదు. ఎందుకంటే సమాజానికి పనికిరాని సాహిత్యం, జనాలకి అర్ధంకాని సాహిత్యం నిరూపయోగం.

ఈ మధ్యకాలంలో యువత మంచి కవిత్వాన్ని రాయడం గమనించాను. ఇంతకుముందు ఇక్కడ ఈ సభలో కవిత్వం చదివిన వారంతా యంగ్ పోయెట్స్. ఎంత భావుకత వుంది వారి కవితల్లో. ఉద్వేగంతో కూడిన అక్షరాలు, ఆక్రోశంతో కూడిన గొంతుతో వారు కవితల్ని చదువుతుంటే విన్నవారికెవరికైనా గుండె పచ్చిబడి పోకుండా వుండదు. వీళ్ళు గ్లోబలైజెషన్ తర్వాత వచ్చిన మార్పుల గురించి రాసారు. మోడరనైజషన్ పేరుతో గతించి పోతున్న పల్లెబతుకుల గురించి రాసారు, పల్లెలో అమ్మకొంగునే ఉయ్యాలగా చేసి ఎదిగిన కొడుకు జ్ఞాపకాలను రాసారు, అభ్యుదయ ముసుగుల్లో వున్న కవుల మగమదం గురించి కుండబద్దలు గొట్టినట్టు చెప్పారు. రాజ్యం కుట్రల్ని ప్రశ్నించారు. ఇప్పటికి ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో తండా పడుతున్నా తండ్లాట గురించి రాసారు. ఆదివాసుల హక్కుల గురించి, అమరులైన వీరుల గురించి, వీరులను కన్నతల్లుల గురించి వారిదైనా భాషలో ఆ దుఃఖాన్ని రాసారు. అవన్నీ ఎంత సహజంగా ఉన్నాయంటే రోజూ మనం మాట్లాడుకునే భాషకు మల్లె, క్లిష్టమైన పదాలు లేకుండా చాలా సరళంగా వున్నాయి కాబట్టే అవన్నీకూడా సభలో అందర్నీ ఇట్టే ఆకట్టుకోగలిగాయి. అందరూ వాటిలో దాగున్న భావాన్ని పట్టుకోగలిగారు, ఆ బాధని తీసుకొని దుఃఖపడ్డారు. ఇప్పుడు కావాల్సింది ఇలాంటి సాహిత్యమే. జనాలకు అర్ధమయ్యే భాష, జనాల భాష.

అయితే ఈరోజు ఇలా సాటిమనిషి మీద ప్రేమతో, దేశం పట్ల బాధ్యతతో, రాజ్యానికి ఎదురెల్లి మాట్లాడే యువగొంతుకలు ఎన్ని వుంటాయి, మహా అయితే ఓ పిడికెడుమంది. మరి ఆ పిడికెడుమందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యంగా మీకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ వాళ్ళని ముందుకు నడిపించే బాధ్యత ఎవరిది, ఎన్నోఏళ్ళుగా సాహిత్యంలో మునిగితేలుతున్న, గొప్ప అభ్యుదయ కవులుగా, రచయితలుగా పేరొందిన సీనియర్స్ దే కదా. కానీ నాకెందుకో వీళ్ళంతా ఈ తరం కవులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు, వాళ్ళని లెక్క చేయకుండా కనీసం పరిగణంలోకి కూడా తీసుకోకుండా పక్కన పడేస్తున్నారేమో అనిపిస్తుంది. మాకుమేమే గుంపులో గోవిందం అన్నట్టుగా ఉండటం, కొత్తతరాన్ని ప్రోత్సాహిస్తే ఎక్కడ కిరీటాలు పడిపోతాయనే స్వార్థంలో పెద్దలు ఉన్నారేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే గనుక నిజమైతే మీకన్నా స్వార్థపరులు ఇంకెవరు వుండరు. కుట్రపూరితమైన రాజ్యానికి, మీకు పెద్దగా తేడా ఏమివుండదు. ఎందుకంటే మీరు వాళ్ళని ప్రోత్సహించకపోవడం అంటే మీ తరువాతి సాహిత్యాన్ని ముందుకు పోకుండా ఆనకట్ట వేయడం. ముందుతరం సాహిత్యాన్ని మీరు చంపేయడమే అవుతుంది. పెద్దలుగా, సీనియర్ కవులు, రచయితలుగా కొత్తతరాన్ని ప్రోత్సహిస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మీమీదే వుందని మర్చిపోకండి. లేదంటే నాలాంటివాళ్ళు మిమల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.

చివరగా ఒకమాట. యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కవులు, రచయితలు ఎవరైనా రాసేరాతలు, వారి వ్యక్తిత్వం వేరు కాదని గుర్తించుకోవాలి. మీరు రాసే సాహిత్యం మీ వ్యక్తిత్వానికి విరుద్ధంగా వుంటే, మీ వ్యక్తిత్వాన్ని, మీ రాతల్ని వేరుగా చూడలేం ఎందుకంటే చలించే హృదయం ఉన్నవారు, ఎదుటివారి దుఃఖాన్ని తనది భావించేవారు, సమాజ పురోగతిని ఆశించేవారు మాత్రమే, అభ్యుదయ, విప్లవ రచనలు చేయగలరు, అలాంటివారెపుడు ఎదుటి మనిషిపట్ల అసభ్యంగా ప్రవర్తించలేరు. కనీసం అటువంటి ఆలోచన కూడా చేయలేరు. అలా కాకుండా వారు కాకమ్మకథలు ఎన్నిచెప్పినా నిజం కాదని అర్ధం. వారిరాతలు, మాటలు అంతా మోసం. అలాంటివాళ్ళు క్షమాపణకి ఎట్టి పరిస్థితుల్లోను అర్హులు కారు. వారిని వెనకేసుకొచ్చేవారు కూడా. ఎందుకంటే సాహిత్యం కేవలం అవార్డులు, రివార్డుల కోసం రాసుకొని వచ్చినపేరుని, ఇచ్చిన పతకాల్ని ఇంటిగోడలకి వెళ్ళాడదీసుకొని చూసి మురిసిపోయందుకు కాదు. అదొక బాధ్యత. సమాజాన్ని మార్చే కర్తవ్యాన్ని నిత్యం నెత్తిన మోసుకు తిరిగే ముందుతరాల చరిత్ర. కాబట్టి ఈ విషయంలో సాహిత్యకారులంతా యువతరం, పెద్దలు కూడా జాగ్రత్తగా మసులుకుంటే మంచిది లేదా చరిత్ర మీ ఘనకార్యాలను కూడా రికార్డు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు.

(‘కనురెప్పల మాటున’, ‘ప్రపంచ స్త్రీల కవిత్వం’ పుస్తకాలకి ‘కుందుర్తి పురస్కారం’ తీసుకున్న సందర్భంగా చేసిన ప్రసంగపాఠం)

–   దియా విగ్నేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *