– వంద కోట్ల బేరంతో దొరికిన అసలు తెలంగాణ ద్రోహి
– పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విమర్శలు
భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,నవంబర్ 4: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ నాయకులు గానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులో 100 కోట్ల బేరసారాలు ఆడి అడ్డంగా దొరికిన తెలంగాణ ద్రోహి రేగా అని, ఆయనకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ కార్యాలయానికి సంబంధించిన చరిత్రను వివరించారు. స్థలం దానంగా ఇచ్చినప్పటి నుంచి భూమి పూజ, ప్రారంభోత్సవంతో పాటు ఇంటి పన్నుల వివరాలు అందరికీ తెలుసని, వాటి రశీదులు, కరెంటు బిల్లులు, అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని తెలిపారు. 2009లో రెడిమెడ్‌గా వొచ్చిన నాయకుడు రేగాకు నియోజకవర్గ దిక్కులు కూడా తెలియవని, నాడు అతడిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పార్టీ గెలిపిస్తే బేరసారాలు చేసి ఫార్టీ ఫిరాయించిన సంగతి అందరికీ తెలుసునన్నారు. ఆయన పార్టీ మారుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల శక్తితో కట్టుకున్న భవనాన్ని కబ్జా చేశాడని ఆరోపించారు. తాను గెలిచిన తర్వాత నాయకులు, కార్యకర్తలు మన ఆఫీసును మనం స్వాధీనం చేసుకుందామని అన్నా.. తాను సముదాయించానన్నారు. కానీ ఆదివారం నాయకులు, కార్యకర్తలు ఆఫీసుకు వెళ్లిన సమయంలో బీఆర్‌ఎస్ వారు తమ వారిపట్ల వ్య వహరించిన తీరు ఉద్రిక్తతకు కారణమైందన్నారు. రేగా కాంతారావు రెచ్చగొట్టగా.. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారని, దాన్ని తమ పార్టీ వారు ప్రతిఘటించారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు చేసిన చర్యను తాను అభినందిస్తున్నానని ఎమ్మెల్యే పాయం తెలిపారు. తన ముఖ్య అనుచరుడు నవీన్‌కు చందా హరికృష్ణ ఆ భవనాన్ని అమ్మాడని, ఇందుకు సంబంధించి పత్రాలు తమ వద్ద ఉన్నాయన్న పాయం వాటిని విలేకరులకు చూపారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. మణుగూరులో కాంగ్రెస్ పార్టీ భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం సాహసోపేత నిర్ణయమన్నారు. పార్టీ మారిన రేగా తర్వాత తెలంగాణ భవన్‌గా మార్చాడని, ఆభవనం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆస్తి అని అన్నారు. పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ శ్రేణులకుశిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని పొదెం వీరయ్య తెలిపారు. రేగా మాటలు ఆయన విజ్ఞతకే వదిలే స్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నియోజకవర్గ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





