మినీ సంగ్రామానికి సిద్దమవుతున్న రాజకీయ పక్షాలు

– మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
– త్వరలో గ్రేటర్‌ హైద‌రాబాద్‌ ఎన్నికలు కూడా
– త్రిముఖ పోరు.. ప్రధాన పార్టీల కసరత్తు
– అసెంబ్లీకి సెమీఫైనల్ గా భావిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ

                                                       (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)

మరో మినీ సంగ్రామానకి రాజకీయ పక్షాలు సిద్దమవుతున్నాయి. మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎంఎల్సీ ఎన్నికలకు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాయి. వీటితోపాటు త్వరలో జరుగనున్న గ్రేటర్‌ హైద‌రాబాద్‌ ఎన్నికలు కూడా పార్టీల భవిష్యత్‌ను శాసించేవిగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీఫైనల్‌గా ఆ పక్షాలు భావిస్తున్నాయి. భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చేది తామంటేతామేనంటూ ఇంతకాలంగా ప్రచారం చేసుకుంటున్న ఈ పక్షాలు, అత్యధిక సంఖ్యలో పట్టభద్రులు పాల్గొననున్న ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం సాధించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తుండడంతో ఇక్కడ త్రిముఖపోటీ అనివార్యత ఏర్పడనుంది. సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పార్టీల భవిష్యత్‌ను మార్చే అవకాశముందను కుంటున్నారు.హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల నియోజవర్గంతోపాటు, వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గానికి సంబందించిన ఎంఎల్సీల పదవీకాలం వచ్చే సంవత్సరం మార్చ్ 27‌తో ముగినయనుంది. కాగా మార్చ్ 29 ‌నాటికి ఈ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిఉంది. సుమారు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ రాజకీయ పక్షాలు ఇప్పటినుండే పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. మూడు పార్టీల్లోనూ ఎంఎల్సీలుగా పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే మూడు పార్టీలుకూడా బాగా జల్లెడపట్టి గెలువగలిగేవారికే టికట్‌ ఇవ్వాలన్న నిర్ణయానికొచ్చాయి. అయినప్పటికీ ఆశావహులు తమవంతుగా లాబియింగ్‌ ‌మొదలుపెట్టారు. విచిత్రమేమంటే ఈసారి సీనియర్‌ ‌నేతలకన్నా ఎక్కువగా యువనేతలే ముందుకు రావడం.
2034 వరకు తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్న సిఎం రేవంత్‌రెడ్డి గ్రాడ్యుయేట్‌ ఎన్నికలను అంత సులభంగా తీసుకోరాదని తమ నేతలకు చెప్పినట్లు తెలుస్తున్నది. అధిష్టానంకూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పూర్తిస్తాయిలో కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌ ఇన్‌ఛార్జీ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్‌  ‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రల నియోజకవర్గ ఓట్లకు సంబందించిన వివరాలను సేకరిస్తున్నారు. అర్హుడైన ఏ ఒక్క పట్టభద్రుడి ఓటుకూడా మిస్‌ ‌కావద్దని సంబందిత నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబందించిన పార్టీ ఇన్‌ఛార్జీలు ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవిధంగా ఇప్పటికే పురమాయించడమైంది. ఈ నియోజవర్గంనుండి పోటీచేసేందుకు అనేక మంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నప్పటికీ కొందరి పేర్లు మాత్రం బాగా వినవస్తున్నాయి. వాటిలో టిపీసీసీ మీడియా కమిటీ చేర్మన్‌ ‌సామా రామ్మోహన్‌రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. కాగా తెలంగాణ పిఆర్‌టియు వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ‌మాజీ ఆధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎంఎస్‌ఎం ‌పారిశ్రామికవేత్త కుటుంబంనుండి మన్నె జీవన్‌రెడ్డి, యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, మరో సీనియర్‌నేత గౌరీ సతీష్‌లు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్సీ కోసంకూడా పోటీ బాగానేఉంది. ఈ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పేరు బాగా వినవస్తున్నది. టూరిజం కార్పోరేషన్‌ ‌మాజీ చేర్మన్‌ ‌పటేల్‌ ‌రమేష్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీనుంచి డాక్టర్‌ ‌లోకేష్‌ ‌యాదవ్‌, ‌చనగాని దయాకర్‌ ‌పేర్లు వినపడుతున్నాయి. ఓయు నేతలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆశిస్సులున్నట్లు తెలుస్తున్నది. బిఆర్‌ఎస్‌కూడా ఈ రెండు స్థానాలను గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంఎల్సీ స్థానంనుండి గతంలో గెలిచిన బిఆర్‌ఎస్‌ ‌నేత సురభి వాణీదేవి మరోసారి ఇక్కడినుండి పోటీ చేసేందుకు సుముఖంగాలేరని తెలుస్తున్నది. దీంతో కొత్తవ్యక్తులకోసం ఆ పార్టీ అన్వేషణ ప్రారంభించింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామాచేసి పోటీకి దిగవచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఆయనతోపాటు శాప్‌ ‌మాజీ చేర్మన్‌ ‌వెంకటేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ ‌నాయకుడు అంజనేయగౌడ్‌ ‌పేర్లు వెలుగులోకి వచ్చాయి. అలాగే వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ ఎంఎల్సీ స్థానానికి గతంలో పోటీచేసి ఓటమి చవిచూసిన బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డికే మరో అవకాశం ఇవ్వవచ్చనుకుంటున్నారు. కానిపక్షంలో వికలాంగుల కార్పోరేషన్‌ ‌మాజీ చేర్మన్‌ ‌వాసుదేవరెడ్డికి అవకాశం రావచ్చనుకుంటున్నారు. బిజెపిలోకూడా ఆశావహుల సంఖ్య పెద్దగానేఉంది. హైదరాబాద్‌,‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంఎల్సీ స్థానంలో గతంలో గెలిచిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మరోసారి పోటీకి సిద్దమవుతున్నారాలేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఆయన కాని పక్షంలో మల్లారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌వి సుభాష్‌, ‌పోరెడ్డి కిశోర్‌, ‌డోకూర్‌ ‌పవన్‌లు పోటీకి సిద్దపడుతున్నారు. వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ విషయానికి వస్తే గతంలో పోటీచేసిన ప్రేమేందర్‌రెడ్డికి ఇంకో అవకాశం ఇస్తారా లేక మహిళలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో రాణి రుద్రమకు ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా కాసం వెంకటేశ్వర్లుకూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తంమీద ఈ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు త్వరలో తెలంగాణలో మినీ సంగ్రామంగా మారే అవకాశాలు లేకపోలేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *