కాళేశ్వరం లో ఒక పిల్లరు మాత్రమే ఒంగింది…
•ఆ ఒంగిన పిల్లరును 15నెలలుగా బాగు చేయలేకపోయారు..
•కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయ్..ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కాళేశ్వరం కూలిందంటూ కొందరు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్, గాంధీభవన్‌లో కూర్చుని పిచ్చి మాటలు, చెబుతున్నోళ్లు ఒకసారి పలెల్లకు వొచ్చి గలగల పారుతున్న కాళేశ్వరం జలాలను చూడాలని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం విఠలాపూర్-రంగాయిపల్లి గ్రామాల వద్ద కాలువలోకి కాళేశ్వరం జలాలను వొదిలిన అనంతరం స్థానిక రైతులు, బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్‌లో కూర్చుకుని కాళేశ్వరం కూలిందనీ, కాళేశ్వరంతో పారడం లేదంటూ మాట్లాడుతున్న వాళ్లు ఇక్కడి నీళ్లను చూసి ఇప్పటికైనా మేల్కొని, కళ్లు తెరవాలన్నారు. ఒక సిద్ధిపేట నియోజకవర్గంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలలో పంట సాగవుతుందన్నారు. ఒక సిద్ధిపేట జిల్లాలోనే కాదూ పొరుగున ఉన్న యాదాద్రి, సిరిసిల్ల, మెదక్ తదితర జిల్లాలకు కాలేశ్వరం ఒక వరప్రదాయిని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించకుంటే మా ప్రాంతమంతా ఎడారిగా ఉండేదన్నారు. కాలేశ్వరం లేకుంటే బోరుబావుల్లో చుక్కనీరు ఉండేది కాదనీ, కాలువల కింద పంటలు పండేవి కావన్నారు. బంగారంలాంటి పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, కేసీఆర్ కృషి వల్లనే సాధ్యమైందన్నారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, అంతాయగిరి, కొండపోచమ్మ రిజర్వాయర్లు కాలేశ్వరం ప్రాజెక్టులో భాగం కావా?అని ప్రశ్నించారు. ఈ గలగల పారే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావా?అన్నారు. కాలేశ్వరం కూలిందంటున్న మూర్ఖులకు ఈ నీళ్లు ఎక్కడి నుంచి పారుతున్నాయో కళ్లు తెరిచి చూడాలన్నారు. హైదరాబాద్‌లో కూర్చోని దొంగ మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర కాలంలోనే ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయందనీ, మహబూబ్‌నగర్ జిల్లాలో వట్టెం పంపు మునిగిందనీ ప్రాజెక్టు, నల్గొడం జిల్లాలో సుంకిశాల, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ కూలిపోయిందన్నారు. ఎంతో పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లరు మాత్రమే ఒంగిపోయిందన్నారు. గడిచిన 15నెలల కాలంలో ఒంగిన పిల్లరును ఏమైనా మరమ్మత్తు చేశారా?అని అడిగారు.
ఒంగిపోయిన ఆ పిల్లను బాగు చేస్తే మరింతగా పంటలు పండించే అవకాశం ఉందన్నారు. గొప్ప గొప్ప మాటాలు మాట్లాడుతున్న సిఎం రేవంత్‌రెడ్డికి మల్లన్నసాగర్ నీళ్లు కాలేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా?అన్నారు. హైదరాబాద్ గండిపేటకు, మూసినది ప్రక్షాళనకు తీసుకెళ్తానంటున్న మల్లన్నసాగర్ నీళ్లు గోదావరి నీళ్లు, కాలేశ్వరం ప్రాజెక్లు నీళ్లు కావా?అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు ఎలా చెబుతున్నారని మండిపడ్డారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్ప కూలాయని ధ్వజమెత్తారు. అంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే రాజకీయం చేస్తున్నారనీ, బద్నాం చేస్తున్నారనీ, బద్నాం చేయడం ఇప్పటికైనా మానుకుని కుంగిన పిల్లరును ఇప్పటికైనా బాగు చేయాలన్నారు. పొలాలకు సాగు నీరు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దోకేబాజ్ మాటలు ఇకనైనా బంద్ చేయాలన్నారు.
కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే బిఆర్‌ఎస్ తప్పు చేసిందంటున్న రేవంత్‌రెడ్డి…మీ పాలనలో నాలుగు కుప్ప ప్రాజెక్టులు కూలాయంటూ ఫైర్ అయ్యారు. ఇదైతే దేవుని మహత్యం అట, ప్రకృతి వైపరీత్యం అట. మీకో నీతి, మాకో నీతా. ఒక్క పిల్లర్ కుంగితే లొల్లి పెట్టారు, మీయి అయితే మొత్తం కుప్ప కూలినయని దుయ్యబట్టారు. కాలేశ్వరం దండగ కాదు, పండుగ అని రైతులందరూ చెబుతారు. పొలాల మధ్య నిలబడి మాట్టాడుతున్నా, ఈ నీళ్లన్నీ కాలేశ్వరం వల్లే సాధ్యమైందని ప్రజలందరూ మాట్లాడుతున్నారనీ, చెబుతున్నారనీ స్పష్టం చేశారు. అంతకుముందు కరెంట్ లేదు, నీళ్లు లేదు,రెండు పంటలు పండుతున్నాయంటే కాలేశ్వరం వల్లేనన్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేసి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండు చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కాముని శ్రీనివాస్, కూర మాణిక్యరెడ్డి, కొండం రవీందర్‌రెడ్డి, ములకల కనకరాజు తదితరులు ఉన్నారు.