– ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు తెరుక ప్రయాణికుల ఇబ్బంది
– అంతా సర్దుకుందంటున్న మెట్రో అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మెట్రో అధికారులు స్పందించారు. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు సేవలు సాఫీగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోనూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెట్రో సేవలు సాఫీగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఆలస్యంగా ఓపెన్ అయ్యాయని అధికారులు తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగానే గేట్లు తెరవడంలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఎల్బీనగర్ సహా ఇతర అన్ని మెట్రో స్టేషన్లలో సేవలు సాధారణ స్థితిలో కొనసాగుతున్నాయని ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు వెల్లడించారు. అయితే ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద స్కానింగ్ సమస్యలు తలెత్తడంతో క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్రో స్టేషన్ సిబ్బంది కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ టికెట్ తీసుకున్నాకా గేట్ల వద్ద వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు