పార్లమెంట్‌లో ఆర్థిక అంశాలపై చర్చలేవీ..?

18 శాతం జీఎస్‌టి విధించడం ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయలు కేంద్ర బొక్కసానికి చేరుతున్నాయని అంచనా! ప్రజల రక్త మాంసాలతో ఖజానాను నింపాలని చూడటం సబబు కాదు. దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిచుకోవాలి. దీనిపై పోరాటం ఒక్కటే శరణ్యం. లేదా దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్టీ ఎత్తేయాలి. పేద, మధ్య తరగతి ప్రజలు రక్తమాంసాలు వెచ్చించి కడుతున్న పాలసీలపై జీఎస్టీ విధించడం దుర్మార్గం కాక మరోటి కాదని మోదీ  ప్రభుత్వం గుర్తించాలి.  

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలిదశ ముగిసింది. మలిదశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు పక్షం రోజులు జరగనున్నాయి. ఇవే అత్యంత కీలకమైన రోజులు. విపక్షానికి ఇది నిజంగా పరీక్షా కాలం. వారు అనేకానేక సమస్యలను లేవనెత్తడానికి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి . గొడవలతో బాయ్‌కాట్లతో సమస్యలు పరిష్కారం కావు. ఇందులో అత్యంత ప్రధానమైనది జీఎస్టీ అని గుర్తించాలి. జీఎస్టీతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న బాదుళ్లను చర్చించాలి. ఎందుకంటే అధికార పార్టీ కాబూలీవాలా లాగా వసూళ్లకు తెగిస్తోంది. పదేళ్లుగా పోరాటం చేస్తే..ఆదాయపు పన్నును 12 లక్షలకు చేర్చినా అందులోనూ మెలికలే పెట్టారు.

మధ్యతరగతి ప్రపజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆర్థిక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే తమ వాదనలు చేస్తోంది. బిజెపి ఎంపీలు కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై దృష్టి పెట్టడం లేదు. కుక్కిన పేనుల్లా మోదీ ముందు మోకరిల్లుతున్నారు. ఆహా మోదీ ..ఓహో మోదీ అంటూ భజనలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కడా చర్చ చేయడం లేదు. ఎవరైనా చర్చించినా దానిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎదురుదాడితో విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జీఎస్టీపై గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమె చేసిన ఎదురుదాడి ప్రసంగమే ఇందుకు నిదరర్శనం.

జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వ 18 శాతం జిఎస్‌టి విధించడం అత్యంత దుర్మార్గం. ఆపద వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ కష్టాన్ని సైతం ఖజానాను నింపుకోవడానికి మార్గంగా చూడటం అమానుషం! సొంత పార్టీ నుండే వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, సీనియర్‌ నేతలే ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నా మోదీ ప్రభుత్వం మాత్రం కష్టకాలంలోనూ ప్రజల మూలుగులను పీల్చి పిప్పి చేయాలనే భావిస్తోంది. అందుకే ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాక్స్‌ టెర్రరిజంగా అభివర్ణిస్తున్నాయి. జీఎస్‌టిలో వివిధ వస్తువులు, సేవలపై సున్నా నుండి గరిష్టంగా 28 శాతం వరకు పన్నులు విధించవచ్చు. ఈ పట్టికలో చివరి నుండి రెండవ స్థానంలో ఉన్న 18 శాతం జిఎస్‌టిని బీమాపై పాలసీలపై విధిస్తున్న కేంద్రం బంగారం పై మూడు శాతం, వజ్రాలపై 0.25 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తుండటం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా బీమా కంపెనీలు రకరకాల కారణాలు చెబుతూ ప్రీమియం మొత్తాలను ఇష్టా రాజ్యంగా పెంచుతున్నాయి.

ఈ పెంపును నియంత్రించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు. రెండు సంవత్సరాల క్రితం 22 సంవత్సరాలున్న ఒక వ్యక్తి ఐదు లక్షల రూపాయల బీమా మొత్తానికి పది వేల రూపాయలు ప్రీమియంగా చెల్లించే పరిస్థితి ఉంటే, గతేడాది ఆ ప్రీమియం 15 వేల రూపాయలకు చేరింది. ఇదే తలకు మించిన భారంగా మారుతుండటంతో అనేక మంది తమ పాలసీలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పుడు 18 శాతం జిఎస్‌టి విధించడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా దీనిని లేవెనెత్తినా..ఆయనను ఈగలాగా తీసిపారేశారు. ఆయన సూచనలకు విలువనివ్వలేదు. దీంతో పాలసీలపై పడే భారం మరింత పెరుగుతుం దన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా ఉన్నప్పటికీ రోగగ్రస్త దేశంగా మారే ప్రమాదం ఉంది.

ఆరోగ్య పాలసీలను పక్కన పెట్టి ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆరోగ్యశ్రీలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కాస్తా కార్పోరేట్‌ హాస్పిటల్స్ ను ప్రోత్సహించేలా మారుతోంది. నయా ఉదారవాద విధానాలు అమలు చేస్తున్న పాలక వర్గాలు ఒక వ్యూహం ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. వైద్య సేవల కోసం ప్రైవేటు రంగంపై ఆధారపడక తప్పని స్థితిని సామాన్యులకు కల్పించాయి. ప్రైవేటు రంగానికి లాభాల లెక్కలే కీలకం కావడంతో వైద్యం సాధారణ ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని తిరిగి పట్టాలెక్కిస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెబుతున్నప్పటికీ ఆచరణలో అవి అమలుకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితే వైద్య రంగంలో బీమా ఆవశ్యకతను పెంచాయి. గతేడాది ప్రారంభంలో దేశంలోని నాలుగు రాష్టాల్లో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ సంస్థ టి.బి రోగులపై ఒక సర్వే నిర్వహించగా 30 నుండి 61 శాతం మంది ఆర్థిక సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో చికిత్సను తీసుకోలేకపోయారని తేలింది.

వీరికి ఆరోగ్య బీమా ఉండి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని ఆ సంస్థ పేర్కొంది. ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాలు అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 2021 గణాంకాల ప్రకారం 40 కోట్ల మంది ఎటువంటి ఆరోగ్య బీమా లేకుండా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ బీమా పథకాలకు నిధుల కొరత వెంటాడుతుండటంతో అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్‌ హాస్పిటల్స్ వైద్య సేవలను నిరాకరిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ బారిన పడి దేశంలో ఏటా 58 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. మెర్సర్‌ మార్ష్‌ బెనిఫిట్స్‌ (ఎమ్‌ఎమ్‌బి) హెల్త్‌ ట్రెండ్స్‌ నివేదిక ప్రకారం ఆసియా ఖండంలోని మెడికల్‌ క్లయిమ్‌లలో 55 శాతం క్యాన్సర్‌, 43 శాతం రక్తప్రసరణ వ్యవస్థ ఆధారిత వ్యాధులు ఉంటున్నాయి. మన దేశంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేయడం తప్పనిసరి అవసరంగా మారింది.

ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంల పైనే ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరంలో 8,263 కోట్ల రూపాయలు వసూలైందని ఆనాటి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో తెలిపారు. అది చాలదన్నట్లు మరింతగా ప్రజల నుండి వసూళ్లు చేయాలని కేంద్రం భావిస్తోంది. 18 శాతం జీఎస్‌టి విధించడం ద్వారా ఏటా 24 వేల కోట్ల రూపాయలు కేంద్ర బొక్కసానికి చేరుతున్నాయని అంచనా! ప్రజల రక్త మాంసాలతో ఖజానాను నింపాలని చూడటం సబబు కాదు. దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిచుకోవాలి. దీనిపై పోరాటం ఒక్కటే శరణ్యం. లేదా దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్టీ ఎత్తేయాలి. పేద, మధ్య తరగతి ప్రజలు రక్తమాంసాలు వెచ్చించి కడుతున్న పాలసీలపై జీఎస్టీ విధించడం దుర్మార్గం కాక మరోటి కాదని మోదీ ప్రభుత్వం గుర్తించాలి.

రేగటి నాగరాజు
(సీనియర్ జర్నలిస్ట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page