అందర్నీ మోసం చేసిన రేవంత్
కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ పబ్లిసిటీ
మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : గతంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేసన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడాది కాలంలో యువతకు లభించింది వికాసం కాదని విలాపమే అని అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకుంటుందని కేటీఆర్ మండిపడ్డారు. 55, 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి మాటలు చెబుతుందని విమర్శించారు.
ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతే అని హెచ్చరించారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ జాడ లేదు.. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది 12,527 మాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా 1,87,473 ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు బాకీ ఉందని వివరించారు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు, అధికారం వొచ్చాక కూడా అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. నిజం నిప్పులాంటిదని.. కాంగ్రెస్ మోసాలకు తెలంగాణ జవాబు చెబుతుందని స్పష్టం చేశారు. జాగో తెలంగాణ యువత అని పిలుపునిచ్చారు.
వొచ్చే ఏడాది నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతి ఏడాది దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు విస్తృతంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్‌ను హైదరాబాద్ సహా పాత జిల్లాల కేంద్రంగా నిర్వహిస్తాం. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు చేసుకుందామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంస్కృతి, భాషపరంగా తెలంగాణ ఔన్నత్యాన్ని చెప్పుకునే విషయంలో కొంతమేర సఫలం అయ్యాం. బతుకమ్మ, బోనాల పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నాం. తెలంగాణ చరిత్రను, ఉద్యమకారులను సిలబస్‌లో పెట్టుకున్నాం. అదే మాదిరిగా యూనివర్సిటీలకు గొప్ప నాయకులు పేర్లు పెట్టుకున్నాం. పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి గొప్ప మేధావుల పేర్లు పెట్టుకున్నాం.
కొత్త జిల్లాలకు కూడా ఉద్యమకారుల పేర్లు పెట్టుకున్నాం.. అలా తెలంగాణ చరిత్రను వెలుగెత్తే చాటే ప్రయత్నం చేశామని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు కేసీఆర్ నాయకత్వంలో మూడు రోజులు ఘనంగా నిర్వహించాం. రచయితలు, కవులను ఘనంగా సన్మానించుకున్నాం. సాంస్కృతిక సారథి పెట్టి రసమయి బాలకిషన్‌ను చైర్మన్‌గా నియమించి, 500 మంది కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చాం. ప్రాజెక్టులు కట్టుకుంటే.. ఆయా ప్రాంతంలో ఉండే దేవుళ్ల పేర్లు పెట్టుకున్నాం. కానీ మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నాలు జరగలేదు. మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం జరగలేదు. ప్రాంతం శాశ్వతం.. అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ శాశ్వతం కాబట్టి తెలంగాణ చరిత్ర శాశ్వతంగా గొప్పగా నిలవాలని ఈ ప్రయత్నం చేశాం. కేసీఆర్ పేర్ల మీద ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళోజీ కళాక్షేత్రం వరంగల్‌లో కట్టినా.. ఇతర జిల్లాల్లో కాళోజీ కళాభారతి పేరిట నిర్మించాం. సాహితీవేత్తలకు, రచయితలకు పెద్దపీట వేశారు కేసీఆర్. గ్రంథాలయాలు కొత్తవి ఎన్నో ప్రారంభించుకున్నాం. ఇంకా జరగాలి అని తెలంగాణ సమాజం కోరుకుంటుంది అని కేటీఆర్ తెలిపారు.