క‌త్తిమీద సాములా మ‌ధ్య‌ప్రాచ్య దౌత్యం!

“సౌదీ అరేబియా-ఇరాన్ ల‌మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎందుకంటే యెమెన్ అంత‌ర్యుద్ధంలో పాల్గొంటున్న ప్ర‌త్య‌ర్థి వర్గాల్లో చెరో దానికి మ‌ద్ద‌తివ్వ‌డంతో ప్ర‌స్తుతం ఆ దేశం రావ‌ణ‌కాష్టంగా మారింది. అయితే ఇటీవ‌లి కాలంలో సౌదీ అరేబియా ఒక అడుగు వెన‌క్కి వేసి, దౌత్య‌మార్గాల ద్వారా ఇరాన్‌తో స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవ‌డం మ‌న‌కు ఊరట క‌లిగించిన అంశం. ప్ర‌స్తుతం మ‌న‌కు అత్యంత మిత్రులైన సౌదీ అరేబియా-యూఏఈల మ‌ధ్య స‌మ‌స్య మొద‌లైంది. ఎందుకంటే 2015 నుంచి ఈ రెండు దేశాలు ఉమ్మ‌డిగా, యెమెన్‌లో ఇరాన్ మ‌ద్ద‌తున్న హౌతీ రెబెల్స్  కు వ్య‌తిరేక పోరులో మ‌ద్ద‌తిచ్చాయి. కానీ ఇందులో వీరిద్ద‌రి ల‌క్ష్యాలు వేరు.”
ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొన్న సంక్లిష్ట భౌగోళిక రాజ‌కీయాలు మ‌న దేశానికి ఒక అగ్నిప‌రీక్ష‌లా మారాయ‌నే చెప్పాలి. ఎందుకంటే విభేదాల‌తో ప‌ర‌స్ప‌రం క‌త్తులు దూసుకుంటున్న సౌదీ అరేబియా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్, ఇరాన్ దేశాలు మ‌న‌కు మిత్రులు. ఇంధ‌న భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే కాదు,  సౌదీ, యూఏఈ త‌దితర అర‌బ్ దేశాల్లో భార‌తీయులు పెద్ద‌సంఖ్య‌లో వుండ‌టం వ‌ల్ల వీరి భ‌ద్ర‌త కూడా మ‌న‌కు కీల‌క‌మైంది. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాంతంలో మ‌నం ఏదో ఒక‌దేశానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా, త‌ట‌స్థంగా స‌మ‌తుల్య వ్యూహంతో ముందుకెళ్లాల్సి వ‌స్తున్న‌ది. ఈవిధంగా వ్య‌వ‌హ‌రించ‌డం చెప్పినంత తేలిక కాదు. సౌదీ అరేబియా-ఇరాన్ ల‌మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎందుకంటే యెమెన్ అంత‌ర్యుద్ధంలో పాల్గొంటున్న ప్ర‌త్య‌ర్థి వర్గాల్లో చెరో దానికి మ‌ద్ద‌తివ్వ‌డంతో ప్ర‌స్తుతం ఆ దేశం రావ‌ణ‌కాష్టంగా మారింది. అయితే ఇటీవ‌లి కాలంలో సౌదీ అరేబియా ఒక అడుగు వెన‌క్కి వేసి, దౌత్య‌మార్గాల ద్వారా ఇరాన్‌తో స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవ‌డం మ‌న‌కు ఊరట క‌లిగించిన అంశం. ప్ర‌స్తుతం మ‌న‌కు అత్యంత మిత్రులైన సౌదీ అరేబియా-యూఏఈల మ‌ధ్య స‌మ‌స్య మొద‌లైంది. ఎందుకంటే 2015 నుంచి ఈ రెండు దేశాలు ఉమ్మ‌డిగా, యెమెన్‌లో ఇరాన్ మ‌ద్ద‌తున్న హౌతీ రెబెల్స్  కు వ్య‌తిరేక పోరులో మ‌ద్ద‌తిచ్చాయి. కానీ ఇందులో వీరిద్ద‌రి ల‌క్ష్యాలు వేరు. సౌదీ అరేబియా, యెమెన్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తివ్వ‌గా, యూఏఈ శ‌క్తివంత‌మైన వేర్పాటువాద స‌ద‌ర‌న్ ట్రాన్సిష‌న‌ల్ కౌన్సిల్‌కు మ‌ద్ద‌తిచ్చింది. దీంతో ఈరెండు దేశాల మ‌ధ్య వైరం రాజుకుంది.
ఇక యూఏఈ అబ్ర‌హామిక్ ఒప్పందాల‌పై సంత‌కాలు చేసి ఇజ్రాయిల్‌తో స‌న్నిహితంగా మెలుగుతోంది. మ‌రి ఇజ్రాయిల్‌కు ఇరాన్‌కు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. అయిన‌ప్ప‌టికీ యూఏఈ ఇరాన్‌తో దౌత్య‌ప‌ర‌మైన సంబంధాల‌ను నెర‌పుతోంది. విచిత్ర‌మేమంటే ఈ దేశాల‌న్నీ మ‌న‌కు అత్యంత ఆప్త మిత్రులే. యూఏఈ-ఇజ్రాయిల్ దేశాలు స‌న్నిహితంగా ఉన్న నేప‌థ్యంలో సౌదీ అరేబియా, ట‌ర్కీ, పాకిస్తాన్‌లు ఒక్క‌ట‌య్యాయి. ఇరాన్ అంత‌ర్గ‌త అల్ల‌ర్లు, అమెరికాతో సంఘ‌ర్ష‌ణ‌తో త‌ల‌మున‌క‌ల‌వుతుండ‌గా, ఇజ్రాయిల్ నిత్యం యుద్ధ వాతావ‌ర‌ణంలోనే కొన‌సాగాల్సి వ‌స్తున్న త‌రుణంలో యూఏఈ ఒంట‌రిగా మిగిలింది. ఈ నేప‌థ్యంలో త‌న‌కంటూ మ‌ద్ద‌తిచ్చే పెద్ద‌న్న‌గా భార‌త్‌ను ప‌రిగ‌ణిస్తోంది. సౌదీ అరేబియాతో సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో యూఏఈ అధినేత మ‌న‌దేశానికి ఆక‌స్మిక సంద‌ర్శ‌న వెనుక మ‌త‌ల‌బేంటో ఇంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు వెల్ల‌డి కాలేదు. కానీ ఒక్క‌టి మాత్రం నిజం, ఒక దేశాధినేత అధికార ప‌ర్య‌ట‌న అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం కాదు. దీర్ఘ‌కాల చ‌ర్చ‌ల అనంత‌రం నిర్ణ‌య‌మ‌వుతుంది. కానీ మ‌న‌దేశానికి ఈవిధంగా ఎటువంటి హ‌డావిడి లేకుండా కొద్ది గంట‌లు మాత్ర‌మే ఆక‌స్మిక అధికార ప‌ర్య‌ట‌న జ‌రిపి తిరిగి వెళ్లిన వారిలో మొద‌టి వారు ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాగా రెండవ‌వారు యూఏఈ  అధ్య‌క్షుడు షేక్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ జ‌యీద్ అల్ నహ్యాన్‌. వ్లాదిమిర్ పుతిన్ 2023లో యుక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించ‌డానికి ముందు మ‌న‌దేశానికి వ‌చ్చి ప్ర‌ధాని మోదీని క‌లిసి వెళ్లారు. జ‌న‌వ‌రి 19న యూఏఈ అధ్య‌క్షుడి రాక మ‌ధ్య‌ప్రాచ్య అస్థిర రాజ‌కీయాల‌ను వెల్ల‌డిస్తోంది.
విచిత్ర‌మేమంటే సిరియా, వెనెజులా మొద‌లైన మ‌ధ్య‌ప్రాచ్య దేశాల‌తో వ్య‌వ‌హ‌రించినంత తేలిగ్గా ఇరాన్‌తో వ్య‌వ‌హ‌రించ‌డం అమెరికాకు, ఇజ్రాయిల్‌కు సాధ్యం కావ‌డంలేదు. ఇరాన్‌తో గ‌తంలో జ‌రిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ చాలా న‌ష్ట‌పోయింది. ఇరాన్ వ‌ద్ద హైప‌ర్ సోనిక్ క్షిప‌ణులు, అణ్వ‌స్త్రాలుండ‌టం ఇందుకు కార‌ణం. అదీకాకుండా చౌక‌ధ‌ర‌లో డ్రోన్ల‌ను త‌యారుచేయ‌డంలో ఇరాన్ దిట్ట. ఈ నేప‌థ్యంలో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై దాడుల‌కు దిగుతాయ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అట్లా దాడుల‌కు దిగితే భార‌త్ కొన్ని వేల‌కోట్లు పెట్టుబ‌డి పెట్టి అభివృద్ధి చేసిన చ‌బ్బ‌హార్ పోర్టుకు నీళ్లొదులుకోవాల్సిం దేన‌ని అంత‌ర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. కానీ వాస్త‌వ‌మేంటంటే ఇజ్రాయిల్ చ‌బ్బ‌హార్ పోర్టుపై దాడి చేయ‌దు. అమెరికా విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఇరాన్‌వైపున‌కు నౌకాద‌ళం వెళుతున్న‌ప్ప‌టికీ గాజాలో శాంతి ప్ర‌కియ పేరుతో త‌న‌కు ఇచ్చిన మాట‌పై పాకిస్తాన్ సైన్యాల‌ను అక్క‌డికి పంపాల్సి వ‌స్తున్న‌ది. అంటే అక్క‌డి హౌతీ రెబెల్స్ తో పోరాడాలి. ఇదే జ‌రిగితే ఇరాన్ తో మ‌రింత వైరాన్ని ఏరికోరి తెచ్చుకున్న‌ట్టే. అప్పుడు బెలూచిస్తాన్ రెబెల్స్, ఇరాన్‌లు క‌లిసి పాకిస్తాన్‌పై దాడులు చేయ‌క మాన‌వు.  త‌న‌కు సంబంధంలేని, స్వీయ మ‌తానికి చెందిన దేశాల మ‌ధ్య‌ప్రాచ్య రాజ‌కీయాల్లో పాకిస్తాన్ ఇప్పుడు బ‌లిప‌శువు కాబోతున్న‌ది.
ఇక మ‌న‌దేశం విష‌యానికి వ‌స్తే ఇ్ర‌జాయిల్‌, సైప్ర‌స్‌, అర్మీనియా, గ్రీస్ దేశాల‌తో స‌న్నిహిత సంబంధాల‌ను నెర‌పుతూ మ‌రోవైపు ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ ల‌తో కూడా ఆప్త మిత్రుడుగా కొన‌సాగుతోంది. అంటే ప‌రస్ప‌రం సంఘ‌ర్షించుకునే దేశాలతో స్నేహాన్ని నెర‌పే సామ‌ర్థ్య‌మ‌న్న ఒకే ఒక దేశం భార‌త్‌! ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం యూఏఈ, సౌదీ పాల‌కులు మ‌న‌దేశ ప్ర‌ధానితో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతూ, స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటుండ‌టం తాజా ప‌రిణామం. విచిత్రంగా మ‌న‌ల్ని ఎదుర్కొన డానికి ఏదోవిధంగా అమెరికా ప్రాప‌కం సంపాదించాల‌నుకున్న షాబాద్ ష‌రీఫ్‌, స‌య్య‌ద్ అసీమ్ మునీర్‌లు ట్రంప్ ఆట‌లో పావులుగా మారి మ‌ధ్య‌ప్రాచ్య రాజ‌కీయాల‌కు దేశాన్ని బ‌లిపెట్టే ప‌రిస్థితి దాపురించింది.  గ‌తంలో మ‌న‌పై ఆంక్ష‌లు విధించాల్సిందేన‌ని గ‌ట్టిగా ప‌ట్టుప‌ట్టిన యూర‌ప్ దేశాలు జ‌న‌వ‌రి 27న మ‌న‌దేశంతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంపై సంత‌కాలు చేయ‌బోతున్నాయి. ఈ ఒప్పందం విలువ 140 బిలియ‌న్ డాల‌ర్లు! అమెరికాను న‌మ్ముకొని నిండామునిగిన ఈ దేశాలు ఇప్ప‌డు మ‌న వ‌ద్ద‌కే చేరుతున్నాయి.
ట్రంప్ గ్రీన్‌లాండ్ కోసం ప‌ట్టుప‌డుతుండ‌టంతో నాటోదేశాలు ఇప్పుడు యు.ఎస్‌.కు వ్య‌తిరేకంగా డెన్మార్క్ కు బాస‌ట‌గా నిలిచాయి. ఒక‌ర‌కంగా నాటోలో చీలిక మొద‌లైంద‌నే చెప్పాలి. ఇరాన్‌పై అమెరికా దాడుల‌కు దిగితే మూడో ప్ర‌పంచ యుద్ధం మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. వెనెజులా చ‌మురును నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న అమెరికా ఇప్పుడు ఇరాన్‌పై క‌న్నేసింది. ఇరాన్ చ‌మురును కూడా నియంత్ర‌ణ‌లో తెచ్చుకోవ‌డానికి అక్క‌డి అంత‌ర్గ‌త ఆందోళ‌న‌ల‌ను రెచ్చ‌గొడుతూ ఇరాన్ అధినేత‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేయాల‌న్న ల‌క్ష్యంతో పావులు క‌దుపుతోంది.  మాజీ ఇరాన్ రాజు షాను తిరిగి ర‌ప్పించాల‌న్న‌ది అమెరికా ల‌క్ష్యం.  ఇరాన్ నుంచి అత్య‌ధిక చ‌మురు కొనుగోలు చేస్తున్న చైనాకు ఇది సుత‌రాము న‌చ్చ‌ని వ్య‌వ‌హారం. ఇదే స‌మ‌యంలో మ‌న‌దేశానికి ఇరాన్ మంచి మిత్రుడుగా కొన‌సాగుతోంది. మొత్తంమీద చెప్పాలంటే మ‌ధ్య‌ప్రాచ్య రాజ‌కీయాలు అమెరికాను ఒంట‌రి చేస్తుండ‌గా, త‌ల‌లు కూడ‌ని అర‌బ్ దేశాల మ‌ధ్య వైరాన్ని మ‌రింత పెంచుతున్నాయి. ఇక ఇజ్రాయిల్, గాజా, యెమెన్ దేశాలు నిత్యాగ్నిగుండాలే! ఈవిధంగా మ‌ధ్య‌ప్రాచ్యం ప్ర‌స్తుతం సంక్లిష్ట శ‌కంలో కొన‌సాగుతోంది. ఇది మూడో ప్ర‌పంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు!

-జమలాపురం విఠల్ రావు 
సీనియర్ పాత్రికేయులు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *