మెరుపు తీగెలు కాన!

బమ్మిడి జగదీశ్వరరావు

నేనూ మా పాపా యానిమల్ ప్లానెట్‌ చూస్తున్నాం. సింహం వొకటి లేడిని వెంటాడుతోంది. ఆ లేడిపిల్ల చెంగుచెంగున దూకి పరుగులు తీస్తోంది. క్షణాల్లో దొరుకేస్తోంది అనేలోపు వెంట్రుకవాసిలో తప్పించుకొని పరుగులు తీస్తోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్న మా పాపని గమనించి వీడియోని పాజ్ చేశాను. తను నా ముఖంలోకి చూసింది. ‘ప్చ్’ విచారించింది. ఏమిటన్నట్టుగా చూశాను.

‘మైదానంలో కదా, దొరికేస్తుంది.’ విచారించింది పాప. ‘అది మైదానం కాదు, ఫారెస్ట్. ఓపెన్ ఫారెస్ట్.’ నే చెప్పడం పూర్తికాలేదు. ‘మన ఫారెస్టుల్లా లేవేం?’ అడిగింది పాప. ‘మనవి క్లోస్డ్ ఫారెస్టులు, ఓపెన్ ఫారెస్టుల్లో సూర్యరశ్మి నేలకు తగులుతుంది, పదినుండి నలభైశాతం చెట్లుమాత్రమే వుంటాయి.’ చెప్పాను. ‘మరి క్లోస్డ్ ఫారెస్టుల్లో?’ అడిగింది పాప. ‘డబ్భై శాతం కంటే యెక్కువ చెట్లు వుంటాయి, యిక్కడ సూర్యరశ్మి నేలకు దాదాపు తగలదు,’ చెప్పాను. ‘మరి ఓపెన్ ఫారెస్టులు మంచివా? క్లోస్డ్ ఫారెస్టులు మంచివా?’ అడిగింది పాప.

‘ఎవరికి?’ అని అడిగాను, నిజంగానే నాకు అర్థం కాలేదు. ‘ఓపెన్ ఫారెస్టుల్లో అయితే ఆ లేడిపిల్ల దాక్కోవడానికి వుండదు,’ ఆలోచిస్తూ అంది పాప. ‘క్లోస్డ్ ఫారెస్ట్ అయితే దాక్కోనేది అనా?’ అడిగాను. ఔనన్నట్టు తలూపింది పాప. ‘మరి క్లోస్డ్ ఫారెస్టులో సింహం దాక్కుంటే?’ చూస్తూ నవ్వాను. తను నవ్వలేదు.

ఇద్దరి మధ్యన నిశ్శబ్దం!

తరువాత తనే అడిగింది. ‘ఏ ఫారెస్ట్ మంచిది?’ అని. ‘దేని లాభాలూ నష్టాలూ దానికే వున్నాయి.’ అని క్యాజ్‌వల్‌గా అన్నాను. తలను అడ్డంగా వూపింది పాప. ‘బలవంతులకు లాభం! బలహీనులకు నష్టం!’ అంది. అయిదో తరగతి పిల్ల యిచ్చిన ఆన్సర్‌కు వులిక్కిపడి చూశాను.

‘అయితే ఓపెన్ ఫారెస్టులకూ క్లోస్డ్ ఫారెస్టులకూ తేడా లేదంటావ్?’ అన్నాను యేదో వొకటి మాట్లాడాలి అన్నట్టు. పాప ఆలోచిస్తున్నట్టుంది, వెంటనే సమాధానం యివ్వలేదు. తరువాత అంది ‘ఓపెన్ ఫారెస్టులు క్లోస్డ్ ఫారెస్టులు అవడానికి టైమ్ పడుతుందేమో నాకు తెలీదు, కాని క్లోస్డ్ ఫారెస్టులు ఓపెన్ ఫారెస్టులు కావడానికి పెద్ద టైమ్ పట్టదు!’

అర్థంకాలేదు అన్నట్టు తలని అడ్డంగా వూపాను!

‘ఔను నాన్నా, మనదగ్గర ఫారెస్టులు డిస్ట్రోయ్ చేస్తున్నారా? చెట్లకోసమో ఖనిజ సంపదకోసమో! అప్పుడు క్లోస్డ్ ఫారెస్టులు ఓపెన్ ఫారెస్టులు అవుతాయి.’ తను చెపుతుంటే అర్థమయినట్టు తలూపాను. ‘అయితే అప్పుడు ఆ ఫారెస్టుల్లో సాధు జంతువులూ క్రూర జంతువులూ తిరగవు!’
‘మరేం తిరుగుతాయి?’ అని నేనూ అడగలేదు, తనూ చెప్పలేదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page