ఐరాస సభ్యదేశాల సంకల్పం నెరవేరుతోందా!?

ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులపై దాడి జరుగుతూనే వుంది.  జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షలకు గురవుతూనే వున్నారు. యుద్ధం జరుగుతున్న ప్రతిచోటా మొదటి బాధితులు బాలలు, మహిళలే. ఎవరినీ చిత్ర హింసలకు గురిచేయరాదు. ఎవరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమాన కరమైన శిక్షకు గురిచేయరాదని ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ హక్కుల పత్రం స్పష్టం చేస్తోంది. అందరి హక్కులు కాపాడతామని ఐరాస సభ్యదేశాలు సంకల్పం తీసుకున్నాయి. గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తోన్న జాతి హననంపై ఐక్యరాజ్యసమితితో పాటు మానవహక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా మానవ హక్కుల పరిరక్షకులుగా ఫోజు పెట్టే అమెరికా కానీ, ఇతర పశ్చిమ దేశాలు కానీ పల్లెత్తు  మాట అనడంలేదు. మరోవైపు, మణిపూర్‌ తగలబడుతోంటే భారత్‌లో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందని గొప్పలు చెప్పుకుంటూ విదేశీ పర్యటనల్లో మునిగి తేలుతున్నారు ప్రధాని నరేంద్రమోదీ.

ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన భారత్‌ ఇప్పటికే ఆహార అభద్రత, పర్యావరణం, నిరుద్యోగం, పిల్లల్లో రక్తహీనత వంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, ఇది చాలదన్నట్లు..  ఇకనుంచి కొత్త జంటలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. అస్సాంలో బీఫ్‌ తినడంపై నిషేధం విధించింది అక్కడి బిజెపి ప్రభుత్వం. వాస్తవానికి అక్కడ బీఫ్‌ తినడం నిషేధం కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఒక హిందువు ఇంటిని ఓ ముస్లిం డాక్టర్‌ కొనుక్కున్నాడని నానాయాగీ చేసి, ఆ ఇంటిని తిరిగి ఇప్పించేశారు. దేశంలో ప్రతిరోజూ  ప్రతిచోటా హక్కుల ఉల్లంఘన సాగిపోతూనే వుంది. ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఏ ఇల్లు కొనుగోలు చేయాలో  చివరకు ఎంతమంది బిడ్డలను కనాలో కూడా వారే నిర్ణయించేస్తూ  హక్కులను పాతరేస్తున్నారు. ‘మన పోరాటం డబ్బుకోసం కాదు, అధికారంకోసం కాదు..  స్వేచ్ఛ, మానవత్వ పునరుద్ధరణలే మన లక్ష్యాలు’ అంటారు అంబేడ్కర్‌  సృష్టిలోని ప్రతి వ్యక్తికీ హక్కులుంటాయి.

ఒక వ్యక్తి అభివృద్ధి సాధించాలంటే, ఆహారం, విద్య, వైద్యం, నైపుణ్యం, స్వేచ్ఛ వంటి సదుపాయాలతో పాటు ముఖ్యంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది.  సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి మానవీయ విలువలను సమర్థించే ప్రజాస్వామ్య వ్యవస్థలో కనుమరుగవుతున్న ఈ హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. సమానత్వం, భావప్రకటన, వ్యక్తి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటివి రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన హక్కులు. ఒక వ్యక్తి హుందాగా, స్వేచ్ఛగా బతకడానికి అవి కనీసవసరం. ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం. అణచివేతలేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగించే కృషికి గుర్తుగా ప్రతి యేడాది డిసెంబర్‌ 10ని ’మానవహక్కుల దినోత్సవం’గా ప్రపంచమంతా పాటిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా  జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి, విధ్వంసం నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం మేల్కొనాలి. మానవ హక్కులను పరిరక్షించాలి.  ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..  నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. రక్తం ఏరులైపారుతున్నా, బాంబులకు శరీరాలు శకలాలుగా మారుతున్నా ఆగని హక్కుల పోరాటం. కొండలు గుట్ట ల్లోని విలువైన ఖనిజాల కోసం హక్కుల హననం ఒకవైపు, మతం పేరుతో మైనార్టీల హక్కులపై నిరంతర దాడి మరోవైపు యధేచ్ఛగా సాగిపోతోంది. గాజా నుంచి మణిపూర్‌ వరకూ సాగుతోన్న మారణహోమం మనకిదే గుర్తు చేస్తోంది.
-రేగటి నాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page