మెదక్‌ చర్చికి..దేశంలో ప్రత్యేక గుర్తింపు

  • పనికి ఆహార పథకానికి మెదక్‌ చర్చే స్ఫూర్తి
  •  ఈ చర్చితో నాకు విడదీయరాని అనుబంధం  
  •  కరువు, కాటకాలు నిర్మూలించడానికి చర్చి నిర్మాణం
  •  క్రిస్టమస్‌ వేడుకలు, మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకల్లో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి
  •  చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : మెదక్‌ చర్చితో తనకు విడదీయరాన్ని అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్‌ సిఎస్‌ఐలో జరిగిన క్రిస్టమస్‌ వేడుకలు, చర్చి శతాబ్ది వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్‌, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మెదక్‌ చర్చి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషం గా ఉందన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లు పూర్తి చేసుకుని మెదక్‌ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు. అలాంటి చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులు మా ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ చర్చికి తనకు గొప్ప అనుబంధం ఉందని, పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వొచ్చి యేసుక్రీస్తు ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. అప్పుడు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే తాను వొచ్చే ఏడు ముఖ్యమంత్రి హోదాలో చర్చికి వొస్తానని ఆ రోజే తెలిపినట్లు గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం శతాబ్ది ఉత్సవాలతో పాటు భక్తులతో క్రిస్మస్‌ జరుపుకోవాలనే నేడు ఇక్కడకు వొచ్చినట్లు  సీఎం రేవంత్‌ తెలిపారు.

వందేళ్ల క్రితం కరువు, కాటకాలు నిర్మూలించడానికి మెదక్‌లో చర్చిని నిర్మించారని సీఎం గుర్తు చేశారు. పనికి ఆహార పథకానికి మెదక్‌ చర్చి స్ఫూర్తి అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధిక లబ్ది జరుగుతుందన్నారు. పేదలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లోనూ వారికి ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. ఆనాడు క్రిస్టియన్‌ మెషినరీలు విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు తెలిపారు. ఆ స్పూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిందని అన్నారు.

ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టినట్లు తెలిపారు. మెదక్‌ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతోందని అన్నారు. అందులో భాగంగా 2918.50 లక్షలతో మెదక్‌ చర్చి లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.  కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ శెట్కార్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవ్‌ రెడ్డి, ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు, ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి, శాసనసభ్యులు మదన్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుహాసిని రెడ్డి  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page