– 27 మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం
– నంబాల కేశవరావు మృతదేహం హెలికాప్టర్‌లో తరలింపు
– మీడియాకు వివరాలు తెలిపిన బస్తర్ ఐజి సుందర్ రాజు
తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో అగ్రనేత కేంద్ర కమిటి కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న మృత్యువాత పడ్డారు. గురువారం బస్తర్ ఐజి సుందర్ రాజు మృతుల వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత మరణంపై పోలీస్ వర్గాలు సంబరాలు జరుపుకున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడ పోలీస్ అధికారులను అభినందించారు. వీరి మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని ప్రత్యేకంగా హెలీక్యాఫ్టర్ ద్వారా తరలించారు.
వ్యూహరచనలో దిట్ట
పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటి కార్యదర్శి నంబాల కేశవ్ అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న నాలుగున్నర దశాబ్దాలుగా ఉద్యమ బాటలోనే ఉన్నారు. అజ్ఞాతంలో ఉండి అనేక మంది సామాన్య ఆదివాసీలకు సేవలు చేసిన చరిత్ర వుంది. 1955వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో కేశవరావు జన్మించారు. 1970 నుండి వామపక్ష రాజకీయల్లో చురుకుగా పనిచేసారు. వరంగల్‌లో బిటెక్ చదివి యంటెక్ మధ్యలో నిలుపుదల చేసి ఉద్యమబాట పట్టారు. ఆర్‌ఇసిలో బిటెక్ చదివి ర్యాడికల్ స్టూడెంట్‌గా పనిచేసారు. 1980లో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమబాట పట్టారు.
కొండపల్లి సీతారామయ్య మరో నాయకుడు సత్యమూర్తిలతో కలిసి ఉండేవాడు. కేశవరావు తూర్పు గోదావరి, విశాఖ జిల్లా)లో మావోయిస్టు కమాండర్‌గా ఉన్నారు. ఛత్తీస్‌ఘఢ్ దండకారణ్యానికి కేశవరావు కీలక పాత్ర పోషించారు. కొత్తగా మావోయిస్టు పార్టీలోకి వచ్చిన వారికి చురుకుగా ట్రైనింగ్ ఇచ్చే ఆనావాయితీ ఉన్నట్లు తెలుస్తుంది. 2018లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మావోయిస్టు కార్యదర్శికి రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో కేశవరావు 2018 నవంబర్ 10న భాధ్యతలు స్వీకరించారు.
కొత్త క్యాడర్ కోసం సన్నాహాలు
కేంద్ర కమిటి కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో కేంద్ర కమిటి కార్యదర్శి పదవి ఎవరికి ఇవ్వాలనే సందిగ్దంలో మావోయిస్టు పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో రాజీనామా చేసిన గణపతికి మళ్ళీ కేంద్ర కమిటి కార్యదర్శి పదవి ఇవ్వననున్నారా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గణపతి వయస్సు రిత్యా ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త క్యాడర్ కోసం మావోయిస్టు పార్టీ చూస్తునట్లు సమాచారం.