తెలంగాణలో బిజెపి తప్ప ఏ పార్టీ సరిగా లేదు..
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : వొచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా పుల్వామాలో దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తోందని, బిజెపి అభ్యర్థులు కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, నల్లగొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి తప్ప ఏ ఇతర పార్టీ సమర్థవంతంగా నడవడం లేదన్నారు. శాసనమండలిలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల కోసం అండగా నిలబడాలన్నారు. గతంలో బిజెపి అంటే గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నుకున్నవారే ఎక్కువగా కనపడుతారన్నారు. వి.రామారావు, డాక్టర్ రాజేశ్వరరావు, రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి, విశాఖపట్నం నుంచి పీవీ చలపతిరావు.. ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా బిజెపి అభ్యర్థులే గెలిచారని తెలిపారు.
శాసనమండలిలో పూర్తిస్థాయిలో ప్రజల గొంతుకగా నిలిచేవారు. గతంలో బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా గెలిచినవారు ప్రజా సమస్యలపై శాసనమండలిలో గట్టిగా నిలబడ్డారు. కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనమండలిని నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ నాయకులను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుని ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రుల గొంతును వినిపించకుండా చేసింది. తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రులు ఆలోచించాలి. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రజల తరఫున శాసనమండలిలో ప్రశ్నించే గొంతుగా నిలుస్తారు. ఫిబ్రవరి 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత వోటు వేసి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో మొదట అధికారంలోకి వొచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను తమ చుట్టే తిప్పుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ నియంతృత్వ పాలన నుంచి మార్పు రావాలనే లక్ష్యంతో ఏడాది కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీలను విన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైంది. ఏ ఒక్క గ్యారంటీని, హామీలను నెరవేర్చలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదు, వేతన సవరణ చేయలేదు. రిటైరైన ఉద్యోగులకు వేతన సవరణ ప్రయోజనాలు సకాలంలో అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారు. కేవలం 10 నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే జాబ్ క్యాలెండర్ పేరిట నమ్మించి నిరుద్యోగులకు హామీలిచ్చి మోసం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలిచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు జరగలేదు. రానున్న రోజల్లో ప్రభుత్వ పాఠశాలకు కొత్త బిల్డింగులు కట్టడం దేవుడెరుగు. ఉన్న స్కూళ్లకు సున్నం వేయలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కొత్త ఫర్నిచర్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..
మోదీ ప్రభుత్వం తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు చేసింది. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ప్రకటించింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వరంగల్‌లో మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రారంభమైంది. రైతులకు రూ.2,300 గిట్టుబాటు ధర కల్పించింది. కేంద్రం రూ.26,000 కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఎయిమ్స్, ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతోంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు రహదారులు నిర్మించింది. తెలంగాణలో 33 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం ఎరువులకు సబ్సిడీ అందిస్తోందని, ఏ దేశంలో చూసినా ఎరువుల ధరలు పెరిగాయి. కానీ, మన భారత్ లో ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా సబ్సిడీపై అందిస్తున్నాం.
తెలంగాణ వ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ ను పెంచడం జరిగింది. కొమురవెల్లి మల్లన్న ఆలయం కోసం కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మిస్తున్నారు. కేంద్రం ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కేసీఆర్, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం, 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విదిల్చిన పాపాన పోలేదు. గ్రామపంచాయతీలకు పారిశుద్ధ్యం నిర్వహణ, శ్మశాన వాటికల నిర్మాణం కోసం, గ్రామాల్లో రైతు వేదికలకు నిధులు ఖర్చు చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి అందలేదు.
మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందలేదు. ఉద్యోగ నియామకాలు జరగలేదు. . తెలంగాణ ప్రజలు గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతిని చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ మోసాన్ని చూస్తున్నారు అని మండిపడ్డారు. . రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మీ వోటు ఇవ్వాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా ఫలితాలు వొచ్చాయి. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేసి, ఉద్యమకారులు, ఉద్యోగుల, ఉపాధ్యాయులు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునేలా బిజెపి కృషి చేస్తోందన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఒక్కరు బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత వోటు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.