– కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గంగన్న హతం
-27 మంది మావోయిస్టులు మృతి – మృతుల సంఖ్య పెరిగే అవకాశం
– మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ
– కేశవరావుపై కోటిన్నర రివార్డు
– భారీగా ఆయుధాలు స్వాధీనం
– 27 మృతదేహాలు స్వాధీనం
– బస్తర్ ఐజి సుందర్‌రాజు
బుధవారం చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజు హతమయ్యారు. ఈయనపై గతంలో ప్రభుత్వం కోటి రివార్డు ప్రకటించింది. ఈయనతోపాటు 27 మంది మావోయిస్టులు మరణించారు. సంఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, బీజాపూర్ , దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో డిఆర్‌జి బలగాలు అబూజ్‌మడ్ ప్రాంతంలోకి వెళ్ళాయి.
మావోయిస్టులు భద్రత బలగాలను పసిగట్టి కాల్పులు ప్రారంభించడంతో బలగాలు ఎదురుకాల్పులు జరుపగా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు కీలక సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో అగ్రనేతలు ఆ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. భద్రత బలగాల చేతిలో హతమైన అగ్రనేత కేశవరావు అనేక సంఘటనలకు భాధ్యుడు. మృతి చెందిన కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. బస్తర్‌లోని నాలుగు జిల్లాల భద్రత దళాలు ఉమ్మడిగా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజి సుందర్‌రాజు మరియు నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్‌కుమార్ దృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.
కీలకమైన మావోయిస్టు నేత నంబాల కేశవరావు
మావోయిస్టు పార్టీలో వ్యూహరచనలు చేయటంలో నంబాల కేశవరావు అలియాస్ గంగన్న కీలక పాత్ర పోషించారు. శ్రీకాకుళం జిల్లా బయ్యన్నపేటలో 1955లో జన్మించారు. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేసారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపనలో నంబాల కేశవరావు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కేశవరావు చిన్న వయస్సులో శ్రీకాకుళంలో చదివినప్పటికి వరంగల్ ఆర్‌ఇసిలో బిటెక్ పూర్తి చేసారు. యంటెక్ చదువుతూ మావోయిస్టు పార్టీలో చేరారు. 1970 నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో నంబాల కేశవరావు కీలకవ్యక్తిగానే ఉన్నారు. 2010 ఛత్తీస్‌ఘఢ్‌లో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతిలో ఈయనదే కీలకపాత్ర. 2018లో కీలక రాజకీయ నాయకుడిని ప్రజాకోర్టులో హతమార్చిన సంఘటనలు ఉన్నాయి.
2018లో మావోయిస్టు కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శగా గణపతి తప్పుకోవడంతో నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు 2003 సంవత్సరంలో తిరుపతి వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద క్లెమోర్‌మైన్ బాంబును పేల్చడంతో బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బయట పడ్డారు. అంతేకాకుండా అనేక ప్రముఖుల హతమార్చిన సంఘటనలు కూడ ఉన్నట్లు తెలుస్తుంది. ఇతని కోసం తెలుగు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఎంతోమంది కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ, నంబాల కేశవరావు మృతితో దాదాపు కనుమరుగయ్యే దశకు చేరుకుంది