స్థానిక సంస్థల ఎన్నికలపై తొలగిన అనిశ్చితి

మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేయండి
రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడిరచింది. సెప్టెంబర్‌ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన అనంతరం హైకోర్టు ఈ తీర్పును వెల్లడిరచింది. అయితే, ప్రభుత్వ తరఫున న్యాయవాదులు రిజర్వేషన్ల పక్రియ పూర్తి చేయడానికి కనీసం మరో 30 రోజుల గడువు అవసరం అని తెలపడంతో హైకోర్టు ఆ అభ్యర్థనని పరిగణనలోకి తీసుకుంది. రిజర్వేషన్ల పక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు మరో 60 రోజులు కావాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థనకు కూడా కోర్టు అంగీకారం తెలిపింది. గరిష్ఠంగా 90 రోజుల లోపుల ఎన్నికల పక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో 2025 సెప్టెంబర్‌ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై పడనుంది. స్థానిక పాలన లోపిస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు లేని పాలన వల్ల గ్రావిూణాభివృద్ధి ఇబ్బందిగా మారుతుందని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. తమ గ్రామాలలో నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం, పథకాల అమలు జాప్యం కావడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కోర్టుకు విన్నవించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన పక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవీదేవి బుధవారం తీర్పు వెలువరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు 2024 జనవరి 30తో ముగిసినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ‘గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది.. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది.. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టాలకు విరుద్ధం.. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు.. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హావిూతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు.. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారు.. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదు.. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి.. లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి‘ అని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల పక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ పక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హావిూ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల పక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక పక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తూ మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page