నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

-అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది
– వీటిపై ఎందుకు నోరెత్త‌రు?
– రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌.

తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే అంశంపై మాజీమంత్రి హ‌రీష్‌రావు ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌కు ఆయ‌న హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు.. ఉద్యమ నినాదానికి పాతరేసి దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నారన్నారు. అదే… బీఆర్ ఎస్‌ పై నిందలు – కాంట్రాక్టర్ లతో దందాలు – ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు రీతిలో పాల‌న సాగుతోంద‌ని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్  కాలంతో పోటీపడి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును, సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారని గుర్తుచేశారు.

దశాబ్దాలపాటు సాగునీటి కోసం తండ్లాడిన రైతులకు నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన దార్శనికులు కేసీఆర్ అన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు శ్రీరామరక్ష.. కేసీఆర్. అనుమతి లేకుండా ఏపి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేద‌ని ప్ర‌శ్నించారు. గుజరాత్ లో మోర్బీ బ్రిడ్జి కూలి 140 మంది చనిపోయినా ఎన్‌డీఎస్ ఏ,  మ‌రే ఇత‌రఏజెన్సీ ఇప్పటి దాకా నోరు మెదపలేదు.బీహార్ లో నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలినా ఏ ఏజెన్సీ స్పందించదు.  సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలినా ఎన్‌డీఎస్ ఏ రాదు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది చనిపోయినా ఎన్డీఎస్ ఏ విచారణ చేయదు. వట్టేం పంపూహౌస్ మునిగినా, పెద్ద వాగు కొట్టుకుపోయినా ఎన్‌డీఎస్ ఏ రాదు. కానీ కాళేశ్వరంలోని వంద కాంపోనెంట్లలో కేవలం ఒక్క చోట రెండు పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా రాద్దాంతం చేస్తున్నారని విమ‌ర్శించారు.

ఎన్‌డీఎస్ ఏ రిపోర్ట్ పేరిట బీజేపీ ఆఫీసులో ఎన్‌డీఏ రిపోర్ట్ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రిపోర్ట్ చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికి రాదని ఎల్ అండ్ టీ సంస్థ తేల్చి చెప్పిందని గుర్తుచేశారు.  పార్లమెంట్ నూతన భవనం కట్టిన ఎల్ అండ్ టీ సంస్థనే మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పంపిన మూటలతోనే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కట్టుకుంది. దాన్ని కూడా ఎల్ ఎండ్ టీ సంస్థనే కట్టింది.నమ్మకం లేకపోతే ఆ సంస్థతోనే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం కట్టించారని ప్ర‌శ్నంచారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి తెలంగాణ రైతుల బొండిగె పిసికే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాల వరకూ వెళ్లి వాస్తవాలు చెబుతామ‌న్నారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. కుంటిసాకులతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page