గర్జించిన గులాబీ దళపతి

  • ప్రాణం పోయినా తెగించి కొట్లాడుడే..  
  • తెలంగాణ రక్షణ కవచం మనమే
  • ఏడాది మౌనం వీడిన కేసీఆర్
(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి )
రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలపై ఏడాదిగా స్పందించని కెసిఆర్‌ ‌శుక్రవారం ఒక్కసారిగా మౌనం వీడి గర్జించారు.బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ఒక విధంగా వారిని కార్యోన్ముఖుల్ని చేసే యత్నం చేశారు. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేలా  త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా వెల్లడించారు. దీంతో ఏడాదికాలంగా ఎర్రవెల్లి ఫామ్‌ ‌హౌస్‌కే పరిమితమైన కెసిఆర్ ‌మళ్లీ ప్రజల మధ్యకు వొస్తారన్న నమ్మకం బిఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో ఏర్పడింది. కెసిఆర్‌ అనగానే ఫామ్‌ ‌హౌస్‌కే పరిమితమంటూ ఇంతకాలం ఎద్దేవా చేస్తున్న రాజకీయ పక్షాలకు ఆయన ఒక విధంగా ఝ‌లక్‌ ఇచ్చినట్లు అయింది. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా మొదల‌య్యాయి. తాము కూడా అదే కోరుకుంటున్నామని, ప్రజల మధ్య ఎలా తిరుగుతాడో చూడాలని ఉందంటున్నారు కాంగ్రెస్‌ ‌నాయకులు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఆయన ఏముఖం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతాడంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన ఈ ఏడాదిలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీపై, కెసిఆర్‌పై తీవ్రాతి తీవ్రంగా విమర్శలు చేస్తున్నప్పటికీ పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలిన కెసిఆర్‌ ఏమాత్రం స్పందించకపోవడం పలువురిని ఆశ్చర్యపర్చింది. అసెంబ్లీలో, బయట బిఆర్‌ఎస్‌ ‌పాలన గురించి తూలనాడుతున్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పేందుకు కూడా కెసిఆర్‌ ఇష్టపడలేదు.
దీంతో పార్టీని కొడుకు కెటిఆర్‌, అల్లుడు హరీష్‌రావులకు వొదిలేశాడని, ఇక ఆయన వ్యవసాయం చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటాడని వొచ్చిన విమర్శలపైనా ఏనాడు స్పందించలేదు. అన్నింటికీ మించి పది మంది ఎంఎల్‌ఏలు పార్టీ మారినా, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఇతరపార్టీల కండువాలు కప్పుకుంటున్నా ఆయన మౌనం వీడలేదు. వీటన్నిటికీ సమాధానం అన్నట్లు శుక్రవారం ఆయన స్పందించిన తీరు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌లనం రేపింది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో  జహీరాబాద్‌ ‌నియోజవర్గ నాయకులతో సమావేశమైన కెసిఆర్‌  ‘‌తాను ఇంతకాలంగా గంభీరంగా, మౌనంగా అన్ని పరిణామాలను పరిశీలిస్తున్నానని, ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందంటూ చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడుతోంది, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటూ’ ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీ వర్గాల నుంచి మంచి స్పందన కనిపించింది. చాలాకాలం తర్వాత ఆయన పూర్వంలాగా చెణుకులు, సామెతలతో పార్టీ వర్గాలను ఉత్తేజపరిచారు. ఈసందర్భంగా ఆయన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపైన ఏడాదికాలంలోనే ఎంత వ్యతిరేకత వొచ్చిందంటే, కాంగ్రెస్‌ ‌పార్టీయే ఎవరి పాలనగొప్ప అని సోషల్‌ ‌మీడియాలో వోటింగ్‌ ‌పెడితే ప్రజలు బిఆర్‌ఎస్‌కే వోటు వేయడమే అందుకు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకుంటున్నారు. ఆలోచనలేకుండా ఎవరో ఏదిచెబితే దాన్నినమ్మి వోటువేసినందుకు తెలంగాణకు మంచి గుణపాఠమే వొచ్చింది. కైలాస ఆటలో పెద్ద పాము మింగినట్లయింది రాష్ట్ర పరిస్థితి. మళ్ళీ కరెంటు కష్టాలు మొదల‌య్యాయంటూ కాంగ్రెస్‌ ‌పాలనా వైఫల్యాలను ఎకరువు పెట్టారు. గత ఎన్నికల సమయంలో కెసిఆర్‌ ‌దాదాపు 90కి పైగా సభల్లో ప్రసంగించారు. ప్రతీ సభలోనూ ప్రజలను హెచ్చరించిన విషయాలను ఆయన మరోసారి గుర్తుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తాను ఆనాడు చెప్పినట్లు రైతుబంధుకు రాంరాం, దళిత బంధు జై భీమ్‌ అవుతుందన్నట్లుగానే అయిందన్నారు. తులం బంగారం కోసం అత్యాశకు పోయి కాంగ్రెస్ వోటేసి ఫలితం అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. బిఆర్‌ఎస్‌ ‌కేవలం రాజకీయంకోసం పుట్టిన పార్టీకాదు. తెలంగాణ ప్రజల కోసం ఆవిర్భవించింది. అందుకే తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
దానికి రక్షణ కవచంకూడా మనమేనంటూ, తెలంగాణలోని ప్రతీబిడ్డ మనోడే అంటున్న కెసిఆర్‌ ఒక విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దపడుతున్నట్లు కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్‌ఎస్‌ ‌దూరమంటూ ఇటీవల వస్తున్న వార్తలకు చెక్‌ ‌పెట్టేవిధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. రాబోయే రోజుల్లో మనదే విజయమని ఆయన ఢంకా బజాయించి చెప్పారు. మన విజయం తెలంగాణ విజయం కావాలని, అందుకు ప్రత్యక్ష పోరాటానికి సిద్దంకావాలని క్యాడర్‌ను ఉత్సాహపర్చడం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడినట్లు కనిపిస్తున్నది. ఎన్నికలు మార్చ్ ‌మొదటివారంలో ఉండవచ్చనుకుంటున్నారు. అందుకే ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బిఆర్‌ఎస్‌ ‌సన్నద్దమవుతున్నది. ఆదే విషయాన్ని కెసిఆర్‌ ‌చెప్పారు.
గతంలోలాగా మెజార్టీ స్థానాల్లో జడ్‌పిటీసిలను, ఎంపీటీసీలను, సర్పంచ్‌లను గెలిపించుకునేందుకు పార్టీ ప్రణాళిక రచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్‌పార్టీకూడా ఫిబ్రవరి 2న సూర్యాపేటలో భారీ బహిరంగసభను ఏర్పాటుచేస్తున్నది. ఈ సభకు కాంగ్రెస్‌ ‌ముఖ్యనాయకుడు రాహుల్‌గాంధీని తీసుకువచ్చే ప్రయత్నంలో ఆపార్టీ ఉంది. దానితోపాటు పార్టీ జిల్లాల అధ్యక్షుల ఎంపికను కూడా ఈలోగానే పూర్తిచేసే విధంగా కసరత్తు చేస్తున్నది. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సమాజంలో అధికసంఖ్యలోఉన్న బిసీ వర్గాల నుంచి వొస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా బిసి రిజర్వేషన్లపై కసరత్తు చేస్తూనే ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్‌ ‌రూపొందించుకుంటున్నది. కెసిఆర్‌ ‌తిరిగి రంగప్రవేశం చేస్తుండడంతో ఈసారి స్థానిక ఎన్నికలు కూడా తగ్గాఫర్‌గా   ఉండే అవకాశంలేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page