కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందో, ఆ నీరు అందకుండా పోతున్నా పట్టించుకోని ఈ ప్రజాప్రభుత్వం తీరుకు తాము యాక్షన్‌లోకిరాక తప్పనిపరిస్థితి ఏర్పడిందన్న ఆయన మాటలు కాంగ్రెస్‌కు శరాఘాతాలైనాయి. “

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఎట్టకేలకు మౌనం వీడారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు ఏండ్ల కాలంగా ఎన్ని అపవాదులు, అపనిందలు వచ్చినా ఆయన అన్నిటికీ మౌనమే సమాధానం గా ఉంటూ వచ్చారు. చివరకు సొంత పార్టీలో సంక్షోభం తలెత్తినా ఆయన పల్లెత్తు మాట అనకుండా రోజులు నెట్టుకొస్తున్నారు. సొంత  కూతురు పార్టీని, పార్టీలోని ప్రధాన నాయకత్వాన్ని టార్గెట్‌ ‌చేసినా పెదవి విప్పలేదు. అధికార, విపక్ష పార్టీలు ఇక కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌కే పరిమితమని, బిఆర్‌ఎస్‌కు కాలదోషం పట్టిందంటున్నా పట్టించుకోలేదు.

వీటన్నిటికీ సమాధానమన్నట్లు ఆదివారం బిఆర్‌ఎస్‌ ‌నేతలతో సుదీర్ఘ సమాలోచన, మీడియా సమావేశం ప్రజల్లో నెలకొన్న ఆనేక సందేహాలను తీర్చినట్లు అయింది. రెండేళ్ల కాలంగా అధికార పార్టీ చేస్తున్న ఆనేక ఆరోపణలకు ఒకే మీడియా సమావేశం ద్వారా సమాధానం చెప్పారు. వాస్తవంగా కొత్త ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశ్యంగానే ఇంతకాలం మౌనం పాటిస్తూ వచ్చానంటూ దాదాపు గంటకు పైగా నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటుగా, రెండేళ్ళ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడాన్ని చూసి మౌనం వీడాల్సివచ్చిదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందో, ఆ నీరు అందకుండా పోతున్నా పట్టించుకోని ఈ ప్రజాప్రభుత్వం తీరుకు తాము యాక్షన్‌లోకిరాక తప్పనిపరిస్థితి ఏర్పడిందన్న ఆయన మాటలు కాంగ్రెస్‌కు శరాఘాతాలైనాయి.
వెంటనె ఆటునుండి రియాక్షన్‌ ‌మొదలైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఎవరు నష్టం చేశారన్నదాని పైన రోడ్డుమీద కాదు అసెంబ్లీలో చర్చకు రావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కెసిఆర్‌కు సవాల్‌ ‌విసరడంతో మరోసారి రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి.      వాస్తవంగా తెలంగాణ ఉద్యమం కొనసాగిందే నీళ్ళు, నిధులు, నియామకాల పైన. ప్రధానంగా నీళ్ళ విషయంలో తెలంగాణకు మొదటి నుండీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యమ కాలమంతా అదే ప్రధాన చర్చనీయాంశమైంది.
తెలంగాణ ఏర్పడి నేటికి పన్నెండు సంవత్సరాలైనా ఇంకా కృష్ణా, గోదావరి జలాలపై క్లారిటీ రావడంలేదు. రెండు నదుల నుండి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా పై ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారన్నదానిపైన గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. నీటి వాటాను తేల్చాలని పట్టుపట్టిన నాటి సిఎం కెసిఆరే నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశాడన్నది నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాదన. అదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందాం రమ్మంటూ ఆయన కెసిఆర్‌కు సవాల్‌ ‌విసిరారు.
కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుండీ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తొలిబడ్జెట్‌ ‌ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే అసెంబ్లీకివచ్చిన కెసిఆర్‌ ‌గడచిన రెండేళ్ళుగా మళ్ళీ ఎప్పుడు ఆ గడప తొక్కలేదు. శాసనభ సమావేశాల సందర్భంగా, బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని పలుమార్లు సిఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కెసిఆర్‌ను ఒక్కసారైనా ప్రతిపక్షనేత స్థానంలో కూర్చోబెట్టాలన్న ఆయన ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. కాగా ఆదివారంనాటి కెసిఆర్‌ ‌మీడియా సమేవేశంపైన స్పందించిన రేవంత్‌రెడ్డి కెసిఆర్‌ ‌చెప్పదల్చుకున్నది అసెంబ్లీలో చెప్పాలంటూ సవాల్‌ ‌చేశారు. బిఆర్‌ఎస్‌ ‌వర్గాలు భావిస్తున్నట్లుగా అసెంబ్లీలో కెసిఆర్‌ను అగౌరపర్చమని రేవంత్‌రెడ్డి ముందస్తుగానే హామీకూడా ఇచ్చారు.
ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలియాలన్నదే తన ఆలోచనగా రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల్లో 36శాతం వాటా చాలని రాసిచ్చిందే కెసిఆర్‌అన్న విషయాన్ని బహుశా  ఆయన మరిపోయి ఉండవచ్చు. కర్ణాటక నుంచి కృష్ణా నీళ్ళు తెలంగాణలోకి ప్రవేశించగానే జూరాల నుంచే ఆ నీటిని ఒడిసి పట్టాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని తీసుకోవాల్సి ఉండగా, రాయలసీమకు నీరు వెళ్ళాక అక్కడినుంచి తెలంగాణకు తీసుకునేలా కెసిఆర్‌ ‌ప్రభుత్వ ఒప్పందం చేసుకుంది. ఏపీ నీటిదోపిడీకి ద్రోహం చేసిందే కెసిఆర్‌. ఆ ‌ప్రభుత్వ హయాంలో కేటాయించిన నీటిని కూడా వాడుకోలేకపోయినా, తమ ప్రభుత్వం సాధ్యమైనంత నీటిని వాడుకోగలిగిందంటున్న రేవంత్‌రెడ్డి, దీనిపై చర్చకు కెసిఆర్‌ ‌సిద్దమైతే అసెంబ్లీ సమావేశాలను జనవరి రెండు నుండే మొదలుపెడుతామంటూ సవాల్‌చేశారు.
వాస్తవానికి జనవరిలో శీతాకాల సమావేశాలు జరుగాల్సి ఉన్నప్పటికీ కెసిఆర్‌ ఎస్‌ అం‌టే జనవరి 2నే ప్రారంభిస్తామంటున్నారు రేవంత్‌రెడ్డి. కాగా, తెలంగాణకు నష్టం జరిగితే తోలుతీస్తా అంటున్న కెసిఆర్‌, ‌కుర్చీవేసుకుని కూర్చుని పూర్తిచేస్తానన్న పాలమూరు ప్రాజెక్టు ఏమైందంటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నిస్తున్నారు. బిఆర్‌ఎస్‌కు కండలు కరిగిపోయి తోలుమాత్రమే మిగిలిందంటూ ఆయన ఎద్దేవ చేశారు. అసలు ఇరిగేషన్‌ ‌వ్యవస్థను బ్రష్టుపట్టించిందే కెసిఆర్‌, ఈ ‌శాఖపై ఆయన చెప్పేవన్నీ 90 శాతం అబద్దాలంటున్న ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణకు గుండెకాయలాంటిదని చెబుతున్న కాళేశ్వరాన్ని డ్యామ్‌ ‌సేఫ్టీ అథార్టి, సుప్రీంకోర్టు జడ్జి తప్పుపట్టిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు ముందున్న ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడమే తెలంగాణపట్ల కెసిఆర్‌కున్న చిత్తశుద్ది ఏమిటో చెప్పకనే చెబుతున్నదంటూ ఆయన విరుచుకుపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *