కొత్త ఇంజనీర్లకు కాళేశ్వరం ఓ ప్రయోగశాల

మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..?
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే..    
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి..
అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది..
ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల ప్ర‌దానోత్స‌వంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : నీళ్లు, నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద‌ని, నీళ్లు మన సంస్కృతిలో భాగమ‌ని, అలాంటి శాఖకు ప్రతినిధులుగా ఇంజ‌నీర్లు క్షేత్ర‌స్థాయిలో చిత్త‌శుద్ధితో ప‌నిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.  నీళ్లు మన జీవన విధానంలో ఓ భాగమని.. వ్యవసాయం, నీళ్లు తెలంగాణ ప్రజల భావోద్వేగమని అన్నారు. హైదరాబాద్ జలసౌధలో కొత్తగా నియమాకమైన 700 మంది ఏఈఈలకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం నియామక పత్రాలు అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏఈఈలకు ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగమని అన్నారు.

అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగితేనే  పూర్తి అవగాహన వొస్తోందని.. క్షేత్ర స్థాయిలో తిరిగి నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు.నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని.. నాణ్యత లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావన్నారు. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారని, రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వొచ్చిన వారే ఎక్కువ రాణిస్తారని తెలిపారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారని గుర్తుచేశారు. తాను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వొచ్చానని చెప్పారు.గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారని, ఫీల్డ్ విజిట్ చేశాకే రిపోర్టులు రాసే వారని తెలిపారు.

image.png
కానీ ఈ మధ్య కాలంలో  క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారని మేం అధికారంలోకి వొచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించామని చెప్పారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయని, దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి.. అధికారులనా? రాజకీయ నాయకులనా? మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ అని రేవంత్ అన్నారు.  ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావని అన్నారు.

లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ సెటైర్లు వేశారు.  పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించాలని, 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకమని, రికమెండేషన్ తో వొచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి అని అధికారులను ఆదేశించారు..అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *